ప్రభుత్వ ఉద్యోగులకు ఏడాదిలో 15రోజులు వర్క్ ఫ్రం హోం!

  • Published By: venkaiahnaidu ,Published On : May 15, 2020 / 01:20 PM IST
ప్రభుత్వ ఉద్యోగులకు ఏడాదిలో 15రోజులు వర్క్ ఫ్రం హోం!

కోవిడ్-19 కట్టడిలో భాగంగా దేశవ్యాప్త లాక్ డౌన్ విధించబడిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా అనేక సంస్థలు తమ ఉద్యోగులతో వర్క్ ఫ్రమ్ హోం(ఇంటి నుంచే పనిచేయడం) విధానాన్ని అమలు చేశాయి. అయితే ఇప్పుడు కరోనా పుణ్యమా అంటూ వర్కింగ్ రూల్స్‌లో అనేక మార్పులు చోటుచేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వర్కింగ్ రూల్స్ విషయంలో కొన్ని మార్పులు చేసేందుకు కేంద్ర సిబ్బంది మంత్రిత్వ శాఖ సిద్దమైంది. ఇకపై ఏడాదికి 15 రోజుల పాటు అర్హులైన కేంద్రప్రభుత్వ ఉద్యోగులు,అధికారులకు వర్క్ ఫ్రమ్ హోం అమలు చేయాలని భావిస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి ప్రణాళికలను సిబ్బంది మంత్రిత్వశాఖ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. 

భారత్ లోని 48.34 లక్షలమంది కేంద్రప్రభుత్వ ఉద్యోగులు ఏడాదిలో 15 రోజుల పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేసుకునేలా డిపార్ట్మెంట్ ఆఫ్ పర్శనల్ అండ్ ట్రయినింగ్(DOPT) ఓ డ్రాఫ్ట్‌ను రూపొందించినట్లు సమాచారం. వాస్తవ పరిస్థితిని దృష్టిలో పెట్టుకునే ఈ డ్రాఫ్ట్‌ రూపకల్పన జరిగిందని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. కేంద్ర సచివాలయంలో సామాజిక దూరం కొనసాగించడంతో పాటు పని వేళల్లో మార్పులు… ఇతరత్రా అవసరాల దృష్ట్యా సమీప భవిష్యత్తులో ఈ నిర్ణయం తీసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయని అని డ్రాఫ్ట్‌లో తెలిపారు.

అంతేకాకుండా అన్ని శాఖల్లోనూ ఈ- ఆఫీసులను ఏర్పాటు చేసి రద్దీ తగ్గించాలని చూస్తోంది. వర్క్‌ఫ్రం హోం నుంచి పనిని సులభతరం చేయడానికి, అన్ని మంత్రిత్వ శాఖలు మరియు అనుబంధ విభాగాలలో ఈ-ఆఫీస్ అమలును DOPT ప్రతిపాదించింది. ఇక.. పార్లమెంట్‌తో పాటు వీఐపీల ప్రశ్నల విషయంలో మాత్రం ఒక ఎస్‌ఎంఎస్  ద్వారా అలర్ట్స్ ఇచ్చే విధంగా సాఫ్ట్‌వేర్‌ రూపొందిస్తున్నారు. అధికారిక సమావేశాల బదులు ఎన్‌ఐసీ వేదికగా వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించాలని డ్రాఫ్ట్‌లో పొందుపర్చినట్లు తెలుస్తోంది.