నేడు చంద్రగ్రహణం… భారత్‌లో దీని ప్రభావం ఎంతంటే

10TV Telugu News

ఈరోజు(జూలై 5,2020) ఖగోళంలో మరో అద్భుతం ఆవిష్కృతం అయ్యింది. మరోసారి చంద్రగ్రహణం కనువిందు చేసింది. అయితే చంద్రగ్రహణం అన్ని దేశాల్లో కనిపించ లేదు. ముఖ్యంగా మన దేశంలో దీని ప్రభావం లేదు. కేవలం ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, యూరప్, ఆఫ్రికాలోని పశ్చిమ ప్రాంతంలోని ప్రజలకు కనిపించింది. గురుపౌర్ణమి రోజు చంద్రగ్రహణం ఏర్పడటం వరుసగా ఇది మూడోసారి. ఇప్పటేకి 30 రోజుల వ్యవధిలో 2 గ్రహణాలు(ఒకటి చంద్ర, మరొకటి సూర్య) రాగా.. తాజాగా ఇది మూడోది. ఇప్పటివరకు మొత్తంగా 4వ గ్రహణం. కాగా, ఈ విధంగా 30 రోజుల వ్యవధిలో మూడు చంద్రగ్రహణాలు ఏర్పడటం 58 సంవత్సరాల క్రితం సంభవించింది.

మన దేశంలో గ్రహణం ప్రభావం లేదు:
భారత కాలమానం ప్రకారం చంద్రగ్రహణం ఆదివారం ఉదయం 8.37 గంటలకు మొదలైంది. 11.22 గంటలకు ముగుస్తుంది. 9.59 గంటలకు గరిష్ఠ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. దాదాపు 2 గంటల 43 నిమిషాల 24 సెకండ్ల పాటు కొనసాగుతుంది. భారత్ లో ఈ గ్రహణం ప్రభావం లేదు కాబట్టి ధార్మిక, మతపరమైన అంశాలకు ఇబ్బంది లేదని పండితులు చెబుతున్నారు. ఈ గ్రహణానికి సూతక కాలం చెల్లుబాటు కాదన్నారు.

ధనస్సు రాశిలో చంద్రగ్రహణం:
ఈ సారి చంద్రగ్రహణం ధనస్సు రాశిలో సంభవించింది. ఈ కారణంగా ధనస్సు రాశి ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతుందని పండితులు అంటున్నారు. పంచాంగం ప్రకారం ఈ రోజున సూర్యుడు మిథునంలో ఉంటాడు. అంతేకాకుండా ఆ రోజు పౌర్ణమి. ఉపఛాయ గ్రహణం ఏర్పడిన కారణంగా దీనికి సూతక కాలం చెల్లదన్నారు. జ్యోతిషశాస్త్రం ప్రకారం సూతకకాలాన్ని పవిత్రంగా పరిగణించరు. ఈ సమయంలో ధార్మిక, శుభకార్యకలపాలు జరగవు. అయితే ఈ సారి చంద్రగ్రహణంలో ఇలాంటి పరిమితులేమీ లేవన్నారు. పండితులు వెర్షన్ ఇలా ఉంటే, ఇదంతా మూడనమ్మకం అని, గ్రహణం వల్ల ఎలాంటి ప్రభావం, ఇబ్బందులు ఉండవని సైంటిస్టులు అంటున్నారు. గ్రహణాలను ఖగోళ అద్భుతాలుగా మాత్రమే చూడాలంటున్నారు. వాటిని చూసి ఎంజాయ్ చేయాలే కానీ అనవసరపు అనుమానాలతో భయాలు పెట్టుకోకూడదన్నారు. గ్రహణాలు ఏర్పడినప్పుడల్లా కొందరు వ్యక్తులు తెరపైకి వచ్చి అరిష్టం పేరుతో ప్రజల బలహీనతలను క్యాష్ చేసుకునే పని చేస్తున్నారని ఆరోపించారు.

కొన్ని ప్రదేశాల్లో మాత్రమే చూడొచ్చు:
సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సరళరేఖపై వచ్చినపుడు చంద్రబింభం భూమిపై పూర్తిగా కనిపించకపోయినట్లయితే దాన్ని సంపూర్ణ చంద్రగ్రహణం అని అంటారు. పాక్షికంగా కనిపిస్తే దాన్ని పాక్షిక లేదా ఉపఛాయ చంద్రగ్రహణం అని అంటారు. ఈ పాక్షిక చంద్రగ్రహణం అంత ప్రభావం చూపదు. ఇది కేవలం భూమిపై కొన్ని ప్రదేశాల్లోనే కనిపిస్తుంది. అంతేకాకుండా ఎక్కువ సమయం కూడా ఉండదు. ఈ ఏడాదిలో(2020) ఇప్పటివరకు రెండు చంద్రగ్రహణాలను (Lunar Eclipse) ప్రజలు వీక్షించారు. ఇటీవలే సూర్యగ్రహణం (Solar Eclipse) కూడా ఏర్పడింది. ఇది నాల్గవ గ్రహణం.