ఈ ఏడాది ఛార్ ధామ్ యాత్ర రద్దు

ఈ ఏడాది ఛార్ ధామ్ యాత్ర రద్దు

Char Dham Yatra Suspended This Year

Char Dham Yatra కరోనా రెండో దశ విజృంభణ నేపథ్యంలోఈ ఏడాది ఛార్ ధామ్( బద్రీనాథ్, కేదార్‌నాథ్, యమునోత్రి, గంగోత్రి) యాత్రను రద్దు చేస్తున్నట్లు గురువారం(ఏప్రిల్-29,2021)ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఓ ఆర్డర్ జారీ చేసింది ప్రభుత్వం. మే 14 నుంచి యాత్ర ప్రారంభం కావాల్సి ఉండగా.. కరోనా కేసులు పెరుగుతుండడంతో యాత్రను నిలిపివేస్తున్నట్లు ఆ ఆదేశాల్లో ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది బద్రీనాథ్, కేదార్‌నాథ్, యమునోత్రి, గంగోత్రి ఆలయాల్లో కేవలం అర్చకులు మాత్రమే పూజలు, ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తారని సీఎం తీరథ్ సింగ్ రావత్ తెలిపారు

కాగా, క‌రోనా సెకండ్ వేవ్ వేళ హరిద్వార్‌లో కుంభ‌మేళాను నిర్వహించింది ఉత్తరాఖండ్. కుంభ్ తర్వాత అక్కడ భారీగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఉత్తరాఖండ్‌తో పాటు కేంద్రంపైనా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ఛార్ ధామ్ యాత్రను ఉత్తరాఖండ్ ప్రభుత్వం రద్దుచేసింది. ఉత్తరాఖండ్‌లో గడిచిన 24 గంటల్లో 6054 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. 3595 మంది కోలుకోగా.. 108 మంది మరణించారు. తాజా లెక్కలతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,68,616 కి చేరింది. వీరిలో 1,20,816 మంది కోలుకున్నారు. కరోనా బారినపడి ఇప్పటి వరకు 2,417 మంది మరణించారు. ప్రస్తుతం ఉత్తరాఖండ్లో 45,383 యాక్టివ్ కేసులున్నాయి.

మరోవైపు, ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. డెహ్రాడూన్‌, హల్ద్వానీ, హరిద్వార్‌లో టెస్టులు పెంచాలని.. రోజుకు 30-50 వేల కరోనా టెస్టులు చేయాలని ఆదేశించింది. కోవిడ్ చికిత్స కోసం 2500 మంది రిజిస్టర్డ్ డెంటిస్టుల సేవలను వినియోగించుకోవాలని సూచించింది.