డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే క్యారెక్టర్ సర్టిఫికేట్ తప్పనిసరి..!

డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే క్యారెక్టర్ సర్టిఫికేట్ తప్పనిసరి..!

ఇప్పుడు ప్రతి ఒక్కరికి డ్రైవింగ్ లైసెన్స్ అనేది ముఖ్యం అయిపోయింది. ఏదో ఒక సమయంలో బండి నడపడం.. దానికి లైసెన్స్ అవసరం అవుతూనే ఉంటోంది. ఈ క్రమంలో 18ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు కచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవలసిన పరిస్థితి. ఈ క్రమంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం డ్రైవిండ్ లైసెన్స్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. మహిళలపై నేరాలకు పాల్పడిన వారి డ్రైవింగ్ లైసెన్స్‌లను రద్దు చేయనున్నట్లు ఓ ఉత్తర్వు ఇచ్చింది అక్కడి ప్రభుత్వం.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మాఫియాలను, మహిళలపై నేరాలకు పాల్పడే వ్యక్తులను విడిచిపెట్టబోమని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించిన తరువాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర రవాణా కమిషనర్ ఎంకే జైన్ తెలిపారు. ఈ ఉత్తర్వు ప్రకారం, “పోలీసు ప్రధాన కార్యాలయం, పోలీసు శిక్షణ మరియు పరిశోధనా సంస్థ (పిటిఆర్ఐ) నుంచి వచ్చిన సూచనల ప్రకారం, ప్రాంతీయ మరియు జిల్లా రవాణా అధికారులందరికీ పోలీసు శాఖ నుండి సమాచారం వచ్చిన తరువాత మహిళలపై నేరాలకు పాల్పడిన నిందితుల లైసెన్సులను నిలిపివేయాలని నిర్ణయించారు.”

అదేవిధంగా, దరఖాస్తుదారుడు ఒక పోలీసు అధికారి ధృవీకరించిన క్యారెక్టర్ సర్టిఫికేట్‌ని కచ్చితంగా సమర్పించవలసి ఉంటుంది. రవాణా మంత్రి గోవింద్ సింగ్ రాజ్‌పుత్ మాట్లాడుతూ “ఇది ఖచ్చితంగా మహిళలపై నేరాలను తగ్గిస్తుంది. ఇప్పుడు, అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ మరియు ప్రభుత్వ వాహనాల డ్రైవర్ల క్యారెక్టర్ ధృవీకరించబడుతుంది. ఈ నిర్ణయం మహిళలకు ప్రజా రవాణాలో ప్రయాణాన్ని సురక్షితంగా చేస్తుంది. ”

రాష్ట్రవ్యాప్తంగా మహిళలు ఈ నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నారు. కాని ఇది మహిళలపై నేరాలను తగ్గించడంలో ఎక్కువ ప్రభావాన్ని చూపదని మహిళా సంఘాలు అభిప్రాయపడుతున్నాయి.