Punjab : దళిత నేతను వరించిన పంజాబ్‌ ముఖ్యమంత్రి పదవి

పంజాబ్‌ సీఎం పదవి ఓ దళిత నేతను వరించింది. పంజాబ్‌ నూతన సీఎంగా చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఉ.11 గం.లకు జరిగే ఈకార్యక్రమానికి అధికారులు ఏర్పాట్లు చేశారు.

10TV Telugu News

Charanjit Singh Channy : పంజాబ్‌ ముఖ్యమంత్రి పదవి ఓ దళిత నేతను వరించింది. పంజాబ్‌ నూతన సీఎంగా చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 11 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మరి పంజాబ్‌లో ఏర్పడిన రాజకీయ సంక్షోభాన్ని తెర దించేందుకు కాంగ్రెస్‌ అధిష్టానం తీసుకున్న నిర్ణయం సరైనదేనా? అంత వరకూ ప్రచారంలో లేని చరణ్‌జిత్‌ సింగ్‌ పేరును సడన్‌గా తెర మీదకు ఎలా వచ్చింది? చన్నీ ముందున్న సవాళ్లేంటి?

పంజాబ్‌లో కాంగ్రెస్‌ రాజకీయ సంక్షోభానికి తెర పడింది. కొత్త సీఎంగా చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీని ఖరారు చేసింది కాంగ్రెస్‌ అధిష్టానం. సుదీర్ఘ చర్చల తర్వాత చరణ్‌జిత్‌ సింగ్‌ను ఖరారు చేసింది. తొలుత సుఖ్‌జిందర్‌ సింగ్‌ రంధావా పేరు ఖరారైనట్టు ప్రచారం జరిగింది. ఆయన గవర్నర్‌ను కలవబోతున్నారని, కొత్త సీఎంగా బాధ్యతలు చేపడతారని వార్తలొచ్చాయి. కానీ, అందరి అంచనాలకు భిన్నంగా చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ పేరును ప్రకటించింది కాంగ్రెస్‌ అధిష్టానం. పంజాబ్‌ ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టబోతున్న తొలి దళితుడిగా చన్నీ నిలిచారు.

Punjab CM : పంజాబ్ సీఎంగా ఎన్నికైన చరణ్​జీత్ సింగ్ చన్నీ

అమరీందర్‌సింగ్‌ ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ. గత ఎన్నికల్లో మూడో సారి ఎమ్మెల్యేగా గెలిచి, రాష్ట్ర సాంకేతిక విద్య, పారిశ్రామిక శిక్షణ శాఖ మంత్రిగా పని చేశారు చన్నీ. 2015, 2016లో విధాన సభలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. ఇప్పటి వరకు సీఎంగా ఉన్న అమరీందర్‌ సింగ్‌, పీపీసీసీ చీఫ్‌ సిద్ధూ మధ్య వివాదం తీవ్రమయ్యాయి. ఈ నేపథ్యంలో అమరీందర్‌తో పార్టీ అధిష్టానం రాజీనామా చేయించింది.

కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ స్థానంలో తొలుత సీనియర్‌ మహిళా నేత అంబికా సోనీకి అవకాశం ఇచ్చినా.. ఆమె తిరస్కరించారు. పంజాబ్‌ తదుపరి సీఎంగా సిక్కు నాయకుడే ఉండాలని పేర్కొన్నారామె. ఆ తర్వాత సిద్ధూ, సుఖ్‌జిందర్‌ సింగ్‌ రంధావా పేర్లు పరిశీలనకు వచ్చాయి. సుఖ్‌జిందర్‌ సింగ్‌ పేరు దాదాపు ఖరారైందనే ప్రచారం కూడా జరిగింది. ఈలోపు సాయంత్రానికి చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ పేరును ప్రకటించింది కాంగ్రెస్‌ అధిష్టానం. పంజాబ్‌ సీఎంగా ఆయన కొద్ది నెలలే కొనసాగే అవకాశాలున్నాయి. వచ్చే ఏడాది ప్రారంభంలోనే ఆ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి.

హిందూ నేతను ఎంపిక చేయాల్సి వస్తే రాజ్యసభ సభ్యురాలు అంబికా సోని పేరు ప్రతిపాదించే అవకాశాలున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఆమెను ఎంపిక చేశారనే వార్తలు కూడా వచ్చాయి. కానీ, సిక్కు నేతకే సీఎం పగ్గాలు ఇవ్వాలని అంబికా సోని అధిష్టానానికి చెప్పారు. నవజ్యోత్ సింగ్ సిద్ధూ పేరు అంతగా ప్రచారంలోకి రాకపోయినా, ఆయనను కానీ, ఆయన అనుయాయులను కానీ సీఎంగా ప్రకటిస్తే అసెంబ్లీలో బలపరీక్షకు కెప్టెన్ అమరీందర్ డిమాండ్ చేసే అవకాశాలను కూడా అధిష్ఠానం పరిశీలనలోకి తీసుకున్నట్టు చెబుతున్నారు. ఈ క్రమంలోనే చరణ్‌జిత్ సింగ్ చన్నీ వైపు అధిష్టానం మొగ్గు చూపిందని అంటున్నారు.

Punjab New CM : పంజాబ్‌ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ

ఏప్రిల్‌ 2, 1973లో జన్మించిన చరణ్‌జిత్‌ చన్నీ.. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. పంజాబ్‌ జనాభాలో మూడింట ఒక వంతున్న దళిత వర్గానికి చెందిన నాయకుడాయన. అమరీందర్‌ సింగ్‌పై తిరుగుబావుటా ఎగురవేసిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల్లో చన్నీ కూడా ఒకరు. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్ని లెక్కలు వేసుకొని, కాంగ్రెస్‌ పార్టీ చన్నీకి అవకాశం కల్పించినట్టుగా భావిస్తున్నారు. చన్నీని ఎంపిక చేసి ప్రకటించే ముందు… దళిత సిక్కు నాయకుడిని సీఎంగా గానీ, డిప్యూటీ ముఖ్యమంత్రులుగా గానీ నియమిస్తారనే వార్తలొచ్చాయి. కులాల సమతౌల్యాన్ని పాటించేందుకు ఈ చర్యలు తీసుకున్నట్టుగా చెబుతున్నారు.

2000లో జరిగిన స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి గెలిచారు చన్నీ. 2007 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థికి వ్యతిరేకంగా రెబల్‌గా పోటీ చేసి ఇండిపెండెంట్‌గా తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత శిరోమణి అకాళీదళ్‌కు మద్దతు పలికారు. తన కారును తాను స్వయంగా నడుపుతూ టోల్‌ ట్యాక్సులు కూడా చెల్లిస్తూ సంచలనం సృష్టించారు. 2010లో అమరీందర్‌ సింగ్‌ సహకారంతో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు చన్నీ. కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు సీపీ జోషికి సన్నిహితంగా మెలుగుతూ వచ్చారు. అప్పుడే రాహుల్‌ గాంధీకి చన్నీని పరిచయం చేశారు జోషి.

Most Expensive Pet : ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన జంతువులు ఇవే!

పీపీసీసీ మాజీ అధ్యక్షుడు ప్రతాప్‌సింగ్‌ బజ్వా, అమరీందర్‌ మధ్య వివాదంలో చన్నీ న్యూట్రల్‌గా వ్యవహరించారు. 2018 అక్టోబరులో చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ మంత్రిగా ఉంటూ మహిళా ఐఏఎస్‌ ఆఫీసర్‌ పట్ల అనుచితంగా ప్రవర్తించారనే విమర్శలు వచ్చాయి. ఆమెకు అసభ్యకరమైన మెసేజ్‌లు పంపించారనే విషయం అప్పట్లో సంచలనంగా మారింది. మంత్రి చన్నీ వ్యవహార శైలిపై రాష్ట్ర ప్రభుత్వ వర్గాలకు ఆ మహిళా ఐఏఎస్‌ అధికారి ఫిర్యాదు చేశారు. రాష్ట్ర పరిపాలనలో సీనియర్‌గా ఉన్న వ్యక్తికి సమాచారం చేరవేశారు. ఆ తర్వాత విషయం అప్పటి సీఎం కెప్టెన్‌ అమరీందర్‌సింగ్‌ దృష్టికి వెళ్లింది.

ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఆయన.. తర్వాత ఆ అధికారితో చర్చించి, ఆమెకు సంతృప్తికరమైన రీతిలో పరిష్కరించారు. ఈ విషయం తన దృష్టికి రాగానే మంత్రి చన్నీతో మాట్లాడి.. ఆ మహిళా అధికారికి క్షమాపణలు చెప్పి సెటిల్‌ చేసుకోవాలని సూచించానని అప్పట్లో కెప్టెన్‌ చెప్పారు. చన్నీపై ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ నాడు అమరీందర్‌ను, రాహుల్‌ను ప్రశ్నించారు శిరోమణి అకాళీదళ్‌ అధ్యక్షుడు సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌. కింది స్థాయి నుంచి ఎమ్మెల్యేగా, ఆ తర్వాత మంత్రిగా పనిచేసిన చరణ్‌సింగ్‌ చన్నీ ఇప్పుడు ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా చాన్స్‌ కొట్టేశారు.

10TV Telugu News