Punjab New CM : పంజాబ్‌ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ

పంజాబ్‌ నూతన సీఎంగా చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 11 గంటలకు గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్.. చరణ్‌జిత్‌ తో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.

10TV Telugu News

Punjab CM Charanjit Singh Channy : పంజాబ్‌ నూతన సీఎంగా చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 11 గంటలకి పంజాబ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్.. చరణ్‌జిత్‌ తో ప్రమాణం చేయించనున్నారు. చరణ్‌జిత్‌ తో పాటు ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ప్రమాణం చేయనున్నారు. మొదటిసారి పంజాబ్ కి దళిత సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రి గా చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

చరణ్ జిత్ చన్నీ..రామదాసియా సిక్కు సమాజానికి చెందిన వారు. చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పంజాబ్ ప్రభుత్వంలో సాంకేతిక విద్యా మరియు పారిశ్రామిక శిక్షణ మంత్రిగా పనిచేశారు. 2007 నుండి చంకౌర్ సాహిబ్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే గా కొనసాగుతున్నారు. 2015 నుండి 2016 వరకు పంజాబ్ విధాన సభలో చరణ్ జిత్ సింగ్ చన్నీ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు.

కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ స్థానంలో తొలుత సీనియర్‌ మహిళా నేత అంబికా సోనీకి అవకాశం ఇచ్చినా.. ఆమె తిరస్కరించారు. పంజాబ్‌ తదుపరి సీఎంగా సిక్కు నాయకుడే ఉండాలని పేర్కొన్నారామె. ఆ తర్వాత సిద్ధూ, సుఖ్‌జిందర్‌ సింగ్‌ రంధావా పేర్లు పరిశీలనకు వచ్చాయి. సుఖ్‌జిందర్‌ సింగ్‌ పేరు దాదాపు ఖరారైందనే ప్రచారం కూడా జరిగింది. ఈలోపు సాయంత్రానికి చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ పేరును ప్రకటించింది కాంగ్రెస్‌ అధిష్టానం. పంజాబ్‌ సీఎంగా ఆయన కొద్ది నెలలే కొనసాగే అవకాశాలున్నాయి. వచ్చే ఏడాది ప్రారంభంలోనే ఆ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి.

Punjab CM : పంజాబ్ సీఎంగా ఎన్నికైన చరణ్​జీత్ సింగ్ చన్నీ

హిందూ నేతను ఎంపిక చేయాల్సి వస్తే రాజ్యసభ సభ్యురాలు అంబికా సోని పేరు ప్రతిపాదించే అవకాశాలున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఆమెను ఎంపిక చేశారనే వార్తలు కూడా వచ్చాయి. కానీ, సిక్కు నేతకే సీఎం పగ్గాలు ఇవ్వాలని అంబికా సోని అధిష్టానానికి చెప్పారు. నవజ్యోత్ సింగ్ సిద్ధూ పేరు అంతగా ప్రచారంలోకి రాకపోయినా, ఆయనను కానీ, ఆయన అనుయాయులను కానీ సీఎంగా ప్రకటిస్తే అసెంబ్లీలో బలపరీక్షకు కెప్టెన్ అమరీందర్ డిమాండ్ చేసే అవకాశాలను కూడా అధిష్ఠానం పరిశీలనలోకి తీసుకున్నట్టు చెబుతున్నారు. ఈ క్రమంలోనే చరణ్‌జిత్ సింగ్ చన్నీ వైపు అధిష్టానం మొగ్గు చూపిందని అంటున్నారు.

ఏప్రిల్‌ 2, 1973లో జన్మించిన చరణ్‌జిత్‌ చన్నీ.. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. పంజాబ్‌ జనాభాలో మూడింట ఒక వంతున్న దళిత వర్గానికి చెందిన నాయకుడాయన. అమరీందర్‌ సింగ్‌పై తిరుగుబావుటా ఎగురవేసిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల్లో చన్నీ కూడా ఒకరు. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్ని లెక్కలు వేసుకొని, కాంగ్రెస్‌ పార్టీ చన్నీకి అవకాశం కల్పించినట్టుగా భావిస్తున్నారు. చన్నీని ఎంపిక చేసి ప్రకటించే ముందు… దళిత సిక్కు నాయకుడిని సీఎంగా గానీ, డిప్యూటీ ముఖ్యమంత్రులుగా గానీ నియమిస్తారనే వార్తలొచ్చాయి. కులాల సమతౌల్యాన్ని పాటించేందుకు ఈ చర్యలు తీసుకున్నట్టుగా చెబుతున్నారు.

2000లో జరిగిన స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి గెలిచారు చన్నీ. 2007 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థికి వ్యతిరేకంగా రెబల్‌గా పోటీ చేసి ఇండిపెండెంట్‌గా తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత శిరోమణి అకాళీదళ్‌కు మద్దతు పలికారు. తన కారును తాను స్వయంగా నడుపుతూ టోల్‌ ట్యాక్సులు కూడా చెల్లిస్తూ సంచలనం సృష్టించారు. 2010లో అమరీందర్‌ సింగ్‌ సహకారంతో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు చన్నీ. కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు సీపీ జోషికి సన్నిహితంగా మెలుగుతూ వచ్చారు. అప్పుడే రాహుల్‌ గాంధీకి చన్నీని పరిచయం చేశారు జోషి.

Mu Covid Variant : ఆ దేశంలో కరోనా కొత్త వేరియంట్ కలకలం, తొలి కేసు నమోదు, 40 దేశాలకు వ్యాప్తి

పీపీసీసీ మాజీ అధ్యక్షుడు ప్రతాప్‌సింగ్‌ బజ్వా, అమరీందర్‌ మధ్య వివాదంలో చన్నీ న్యూట్రల్‌గా వ్యవహరించారు. 2018 అక్టోబరులో చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ మంత్రిగా ఉంటూ మహిళా ఐఏఎస్‌ ఆఫీసర్‌ పట్ల అనుచితంగా ప్రవర్తించారనే విమర్శలు వచ్చాయి. ఆమెకు అసభ్యకరమైన మెసేజ్‌లు పంపించారనే విషయం అప్పట్లో సంచలనంగా మారింది. మంత్రి చన్నీ వ్యవహార శైలిపై రాష్ట్ర ప్రభుత్వ వర్గాలకు ఆ మహిళా ఐఏఎస్‌ అధికారి ఫిర్యాదు చేశారు. రాష్ట్ర పరిపాలనలో సీనియర్‌గా ఉన్న వ్యక్తికి సమాచారం చేరవేశారు. ఆ తర్వాత విషయం అప్పటి సీఎం కెప్టెన్‌ అమరీందర్‌సింగ్‌ దృష్టికి వెళ్లింది.

ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఆయన.. తర్వాత ఆ అధికారితో చర్చించి, ఆమెకు సంతృప్తికరమైన రీతిలో పరిష్కరించారు. ఈ విషయం తన దృష్టికి రాగానే మంత్రి చన్నీతో మాట్లాడి.. ఆ మహిళా అధికారికి క్షమాపణలు చెప్పి సెటిల్‌ చేసుకోవాలని సూచించానని అప్పట్లో కెప్టెన్‌ చెప్పారు. చన్నీపై ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ నాడు అమరీందర్‌ను, రాహుల్‌ను ప్రశ్నించారు శిరోమణి అకాళీదళ్‌ అధ్యక్షుడు సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌. కింది స్థాయి నుంచి ఎమ్మెల్యేగా, ఆ తర్వాత మంత్రిగా పనిచేసిన చరణ్‌సింగ్‌ చన్నీ ఇప్పుడు ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా చాన్స్‌ కొట్టేశారు.

10TV Telugu News