మావోయిస్టుల మెరుపుదాడి.. 20మంది జవాన్లు మృతి

మావోయిస్టుల మెరుపుదాడి..  20మంది జవాన్లు మృతి

Chhattisgarh Encounter

Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లో తారేరంలో మావోయిస్టులు, సీఆర్ఫీఎఫ్ సిబ్బందికి జరిగిన కాల్పుల్లో ఐదుగురు చనిపోగా.. 22మంది మిస్ అయినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ విషయాన్ని అధికారులు అధికారికంగా ప్రకటించవల్సి ఉంది. నిన్న ఎన్‌కౌంటర్‌ తర్వాత మొత్తం 22మంది భద్రతా సిబ్బంది అదృశ్యమైనట్టు సీఆర్ఫీఎఫ్ డీజీ తెలిపారు. ఇప్పటి వరకు 20 మంది జవాన్లు మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. ఐదుగురు ఇప్పటికే ప్రాణాలు కోల్పోగా.. మరో 15 మంది మృతదేహాలను గుర్తించారు. ఎదురుకాల్పుల్లో 31 మంది భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి.

అయితే భద్రతా బలగాల కాల్పుల్లో 15 మంది మావోయిస్టులు చనిపోయినట్లు తెలుస్తుంది. అలాగే మరో 20 మంది మావోయిస్టులు గాయాల పాలై ఉంటారని సీఆర్ఫీఎఫ్ డీజీ వెల్లడించారు. ఈ ఘటన వివరాలు తెలసుకున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఛత్తీస్‌గఢ్‌ సీఎంతో ఫోన్‌లో మాట్లాడారు. డీజీని సంఘటనా స్థలానికి వెళ్లాల్సిందిగా హోంశాఖ ఆదేశించింది. అక్కడి పరిస్థితులు పరిశీలించి ఎప్పటికప్పుడు తెలియజేయాల్సిందిగా చెప్పారు.

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల మెరుపుదాడిపై సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. యూ ఆకారంలో మావోయిస్టులు మాటువేసి దాడి చేసినట్టు గుర్తించారు. దాడిలో 600 మందికి పైగా పాల్గొన్నట్లు సమాచారం. 100-200 మీటర్ల దూరం నుంచి మావోయిస్టుల కాల్పులు జరిపారని…ఐఈడీలు, రాకెట్‌ లాంచర్లు, ఏకే-47తో మావోయిస్టుల మెరుపుదాడికి దిగినట్టు తెలుస్తోంది.

మావోయిస్టుల కదలికలపై నిఘా వర్గాలు కీలక సమాచారం సేకరించాయి. దీంతో సీఆర్ఫీఎఫ్ బలగాలు కూంబింగ్ నిర్వహించాయి. బీజాపూర్‌, సుక్మా, కంకేర్‌లో క్యాప్ నిర్వహిస్తున్నట్టు కీలక సమాచారం తెలుసుకున్నారు. రెండు వందల నుంచి మూడు వందల మంది సమావేశం కానున్నట్టు గుర్తించారు. మావోయిస్టు కీలక నేతలు, దళ కమాండోలు బీజాపూర్‌ క్యాంపులో పాల్గొంటున్నట్టు తెలుసుకున్నారు. పక్కా సమాచారంతో క్యాంప్ స్థలాన్ని గుర్తించారు.

దీంతో సీఆర్ఫీఎఫ్ జవాన్లను భారీ సంఖ్యలో అక్కడికి తరలించారు. అయితే కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో మావోయిస్టులు కాల్పులకు దిగారు… ఇరు వర్గాల మధ్య మూడు గంటల పాటు కాల్పులు జరిగాయి.