సీబీఐ కస్టడీకి చిదంబరం…కోర్టులో వాదనలు సాగాయి ఇలా

  • Published By: venkaiahnaidu ,Published On : August 22, 2019 / 12:07 PM IST
సీబీఐ కస్టడీకి చిదంబరం…కోర్టులో వాదనలు సాగాయి ఇలా

INX మీడియా కేసులో మాజీ కేంద్రమంత్రి,సీనియర్ కాంగ్రెస్ లీడర్ పి.చిదంబరంను ఇవాళ సీబీఐ కోర్టులో హాజరుపర్చారు అధికారులు. ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూలో ఉన్న సీబీఐ ప్రత్యేక కోర్టుకు తీసుకొచ్చారు. సీబీఐ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టులో వాదనలు వినిపించగా..చిదంబరం తరపున కపిల్ సిబల్,అభిషేక్ మను సింగ్వీ వాదనలు వినిపించారు. అంతకుముందు కోర్టు హాల్లో నిలబడి ఉన్న చిదంబరాన్ని కుర్చీలో కూర్చోవాలని తుషార్‌మెహతా సూచించగా.. ఆయన సున్నితంగా తిరస్కరించారు. కోర్టు సంప్రదాయాల ప్రకారమే తాను నడుచుకుంటానని ఈ సందర్భంగా చిదంబరం వ్యాఖ్యానించినట్లు తెలిసింది. కోర్టులో ప్రవేశపెట్టడానికి ముందు చిదంబరాన్ని సీబీఐ మూడు గంటలపాటు ప్రశ్నించింది.

విచారణ సందర్భంగా సీబీఐ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ…చిదంబరం ఫెమా నిబంధనలు ఉల్లంఘించారన్నారు. విచారణకు సహకరించడం లేదన్నారు. ఆర్థికమంత్రిగా ఉన్న సమయంలో చిదంబరం అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్నారు. పదవిలో ఉన్న సమయంలో ఎలాంటి డీల్ అయినా ప్రభావితం చేసే అవకాశముంటుందన్నారు. చిదంబరంను 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరారు.  ఇది అతి ముఖ్యమైన మనీలాండరింగ్ కేసు. ప్రీ చార్జిషీట్ దశలో తాము ఉన్నామని,చిదంబరం విచారణకు సహకరించడం లేదన్నారు. నాన్ బెయిలబుల్ ఆధారంగానే చిదంబరంను అరెస్ట్ చేశామన్నారు. పెద్ద పెద్ద మేధావులు ఇన్వాల్వ్ అయిన ఒక సీరియస్ కేసు ఇది అని,ఈ కేసులో చిదంబరంను మరింత విచారించాల్సిన అవసరముందని,దీనికి కోర్టు అనుమతి ఇవ్వాలని తుషార్ మెహతా కోరారు.

చిదంబరం తరపున కోర్టులో కపిల్ సిబల్ వాదనలు వినిపిస్తూ…. చిదంబరం ఎప్పుడూ విచారణకు గైర్వాహజరు కాలేదు. ఇప్పటివరకు సీబీఐ 12 ప్రశ్నలే అడిగారు. కార్తీకి సంబంధించిన ప్రశ్నలే అడిగారు. తనకు తెలిసిన ప్రశ్నలన్నింటికీ ఆయన సమాధానం చెప్పారు. ఈ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్తీ చిదంబరంకు బెయిల్ ఇచ్చారు. ఈ కేసులో మరికొందరికి కూడా బెయిల్ ఇచ్చారు. బెయిల్ ఇవ్వడం రూల్. కాలయాపన కోసమే చిదంబరంను సీబీఐ కస్టడీకి కోరుతుందని సిబల్ అన్నారు. సాక్ష్యాలతో సంబంధం లేకుండా వేరే దానితో సంబంధం ఉన్న కేసు ఇది. ఒక న్యాయమూర్తి తీర్పు ఇవ్వడానికి ఏడు నెలలు తీసుకుంటే (చిదంబరం ముందస్తు బెయిల్‌ను తిరస్కరించిన ఢిల్లీ హైకోర్టు తీర్పు) అప్పుడు చిదంబరంకు కాపాడే గొడుగు లభించిందా? మేము బాధపడుతున్నాము. చిదంబరంకు బెయిల్ మంజూరు చేయాలని వాదనలు వినిపించారు.  

చిదంబరం తరపున అభిషేక్ మను సింగ్వీ వాదనలు వినిపిస్తూ…కేవలం ఇంద్రాణీ ముఖర్జీ ఎవిడెన్స్,కేసు డైరీ ఆధారంగానే మొత్తం సీబీఐ కేసు నడుస్తుంది. సహకరించకపోవడం అంటే.. దర్యాప్తు సంస్థ నన్ను ఐదుసార్లు పిలిస్తే నేను వెళ్ళకపోవడం,సహకరించకపోవడం అంటే వారు వినడానికి ఇష్టపడే సమాధానం ఇవ్వడం లేదని. అధికారులు చిదంబరంను ఒకసారి పిలిచారు, అతను వెళ్ళాడు. సహకరించకపోవడం ఎక్కడ ఉందని ఆయన ప్రశ్నించారు. చిందబరంకు బెయిల్ ఇవ్వాలన్నారు.

అయితే కోర్టులో వాదనలు కొనసాగుతున్న సమయంలో తాను మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని కోర్టుని చిదంబరం కోరారు. అయితే చిదంబరం మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకూడదంటూ సీబీఐ తరపున వాదనలు వినిపిస్తున్న సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి మాట్లాడే హక్కు ఉందన్న చిదంబరం తరపున వాదనలు వినిపిస్తున్న సింగ్వీ అన్నారు. దీంతో కోర్టు చిదంబరం మాట్లాడే అవకాశం ఇచ్చింది. 

కోర్టు అనుమతితొ చిదంబరం మాట్లాడుతూ…. విదేశాల్లో బ్యాంక్ అకౌంట్ ఉందా అని అడిగారు. లేదని చెప్పాను. కార్తీకి విదేశాల్లో బ్యాంక్ అకౌంట్ ఉందా అని అడిగారు. ఉందని చెప్పాను. కేసు విచారణకు సహకరిస్తున్నాను. అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పానన్నారు.

వాదనలు విన్న కోర్టు…చిదంబరం ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేసింది. చిదంబరంను 5 రోజుల సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ తీర్పు వెల్లడించింది. ఆగస్టు-26,2019 వరకు చిదంబరంను సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ తీర్పు చెప్పింది. రోజులో 30నిమిషాల పాటు కుటుంబసభ్యులు,లాయర్లు చిదంబరంను కలుసుకోవచ్చునని కోర్టు తెలిపింది. కోర్టు తీర్పు తర్వాత చిదంబరంను సీబీఐ హెడ్ క్వార్టర్స్ కు అధికారులు తీసుకెళ్లారు.