Five States Elections 2022 : మోగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల నగారా.. ముఖ్య తేదీలు ఇవే

ఉత్తరప్రదేశ్‌లో ఏడు దశల్లో ఎన్నికలు జరగనుండగా.. మణిపూర్ లో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.. మిగతా రాష్ట్రాల్లో ఒకే దశలో ఎన్నికలు నిర్వహించనున్నారు.

Five States Elections 2022 : మోగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల నగారా.. ముఖ్య తేదీలు ఇవే

Five States Elections

Five States Elections 2022: ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ ఎన్నికల నగారా మోగింది. భారత ఎన్నికల సంఘం (ECI) శనివారం గోవా, పంజాబ్, మణిపూర్, ఉత్తరాఖండ్ మరియు ఉత్తరప్రదేశ్ శాసనసభలకు సాధారణ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ ఏడాది మొత్తం ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరగనుండగా.. మొత్తం 690 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి (పంజాబ్ 117, గోవా 40, మణిపూర్ 60, ఉత్తర్ ప్రదేశ్ 403, ఉత్తరాఖండ్ 70). ఈ ఐదు రాష్ట్రాల్లో 18.34 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు వివరించారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుశీల్ చంద్ర. కరోనా ఉధృతి నేపథ్యంలోనే ఎన్నికలు సజావుగా నిర్వహిస్తామని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుశీల్ చంద్ర తెలిపారు. ఈ రాష్ట్రాల్లో 100 శాతం రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తి చేయాలనీ అధికారులకు ఆదేశాలు జారీచేసినట్లు తెలిపారు.

మహిళల కోసం ప్రత్యేక పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని సుశీల్ చంద్ర తెలిపారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఎన్నికలు నిర్వహిస్తామని వివరించారు. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల కమిషన్ సభ్యులు పర్యటించారని ఆయన వెల్లడించారు. ఇక ఈ ఎన్నికల్లో ఐదు రాష్ట్రాల్లో కొత్త ఓటర్ల సంఖ్య 24.5 లక్షలు పెరిగిందని తెలిపారు. ఐదు రాష్ట్రాల్లో 2 లక్షల 15వేల 368 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని వివరించారు సుశీల్ చంద్ర. ఇక ఎన్నికల పర్యవేక్షణ కోసం ఐదు రాష్ట్రాల్లో 900 మంది ఎలక్షన్ అబ్జర్వర్లను నియమించినట్లుగా వివరించారు. కరోనా వలన పోలింగ్ స్టేషన్‌లో ఓటర్ల సంఖ్య తగ్గించినట్లు తెలిపారాయన. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నందున కొత్త నిబంధనల ప్రకారం ఎన్నికలు నిర్వహణ ఉంటుందని సుశీల్ చంద్ర వివరించారు.

ఇక కేంద్ర ఎన్నికల సంఘం అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా నామినేషన్ వేసేందుకు అవకాశం కల్పించింది. కరోనా నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుశీల్ చంద్ర తెలిపారు. గత 6 నెలలుగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని.. వివిధ రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరిపామని తెలిపారు సుశీల్ చంద్ర. డీజీపీలు, చీఫ్ సెక్రటరీలు, జిల్లా అధికారులతో సమీక్షలు నిర్వహించాం.. కోవిడ్-19 పరిస్థితిపై కేంద్ర ఆరోగ్యశాఖ, హోంశాఖ అభిప్రాయాలు కూడా తీసుకున్నామన్నారు. 2022 జనవరి 5న ఓటర్ల తుది జాబితా ప్రచురించాం.. మొత్తం 18.3 కోట్ల మంది ఓటర్లు ఈ ప్రక్రియలో భాగమవుతున్నారని వివరించారు. 24.9 లక్షల మంది కొత్త ఓటర్లు ఈ జాబితాలో చేరినట్లు.. కొత్త ఓటర్లలో 11.4 లక్షల మంది మహిళా ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. పోలింగ్ స్టేషన్లలో అన్ని మౌలిక వసతులు ఉండేలా చర్యలు చేపట్టామని సుశీల్ వివరించారు. కోవిడ్-19 వ్యాప్తి నిరోధించే సదుపాయాలు కూడా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు.

ప్రతి పోలింగ్ స్టేషన్‌లో గతంలో గరిష్టంగా 1,500 ఓటర్లు ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్యను 1,250కు కుదించినట్లు వివరించారు. ఓటర్ల సంఖ్యను తగ్గించడంతో పోలింగ్ స్టేషన్ల సంఖ్య పెరిగినట్లు అయన వివరించారు. వైకల్యంతో బాధపడేవారి కోసం వీల్ చైర్ సహా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అభ్యర్థులపై ఉన్న క్రిమినల్ కేసుల వివరాలతో పాటు ఎందుకు అభ్యర్థిగా ఎన్నుకున్నారో కారణాలను పార్టీలు తమ వెబ్‌సైట్లలో పొందుపర్చాలని ఈ సందర్బంగా రాజకీయ పార్టీలకు సుశీల్ చంద్ర సూచించారు. అభ్యర్థుల ఎన్నికల ఖర్చుపై మాట్లాడుతూ.. ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్నికల ఖర్చును రూ.28 లక్షల నుంచి రూ.40 లక్షలకు పెంచినట్లు వివరించారు. ఏడు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు.   జనవరి 14న యూపీలో తొలిదశ నోటిఫికేషన్, ఉత్తరప్రదేశ్‌లో ఫిబ్రవరి 10 నుండి మార్చి 7 వరకు 7 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 10 తేదీన మొదటి విడత ఎన్నికలు, రెండో దశ పోలింగ్ ఫిబ్రవరి 14,

 

ఉత్తరప్రదేశ్‌ : ఏడు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. ఫిబ్రవరి 10న మొదటి దశ, ఫిబ్రవరి 14న రెండవ దశ, ఫిబ్రవరి 20న మూడవ దశ, ఫిబ్రవరి 23న నాలుగవ దశ, ఫిబ్రవరి 27న ఐదవ దశ, మార్చి 03న ఆరవ దశ, మార్చి 7న చివరగా ఏడవదశ ఎన్నికలు జరగనున్నాయి.

మణిపూర్‌ : రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి దశ ఫిబ్రవరి 27న జరగనుండగా.. రెండవ దశ మార్చి 3వ తేదీన జరగనుంది.

పంజాబ్‌ : ఫిబ్రవరి 14న ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి.

ఉత్తరాఖండ్ : ఫిబ్రవరి 14న ఒకే దశలో పోలింగ్ జరగనుంది.

గోవా : ఫిబ్రవరి 14న ఒకే దశలో పోలింగ్ జరగనుంది.

 

ఇక అన్ని రాష్ట్రాల ఓట్ల లెక్కింపు మార్చి 10న జరగనుంది. అదే రోజు ఫలితాలు వెల్లడిస్తారు.