సుప్రీంకోర్టు ప్రత్యక్ష ప్రసారాలకి సిద్దం..జర్నలిస్టుల కోసం ప్రత్యేక యాప్ ఆవిష్కరించిన సీజేఐ

కరోనా వైరస్ నేపథ్యంలో సుప్రీంకోర్టు వర్చువల్ విధానంలో విచారణలు చేపడుతున్న విషయం తెలిసిందే.

సుప్రీంకోర్టు ప్రత్యక్ష ప్రసారాలకి సిద్దం..జర్నలిస్టుల కోసం ప్రత్యేక యాప్ ఆవిష్కరించిన సీజేఐ

Chief Justice Nv Ramana Launches Mobile App For Journalists

Chief Justice కరోనా వైరస్ నేపథ్యంలో సుప్రీంకోర్టు వర్చువల్ విధానంలో విచారణలు చేపడుతున్న విషయం తెలిసిందే. అయితే, ఈ విధానంలో కీలక కేసుల విచారణ కవరేజీ ఇవ్వడం జర్నలిస్టులకు ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో మొబైల్ ద్వారా సుప్రీం కోర్టు కేసుల విచారణను రిపోర్ట్ చేసేందుకు జర్నలిస్టుల కోసం సుప్రీంకోర్టు ప్రత్యేక యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

గురువారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(CJI) జస్టిస్ ఎన్.వి.రమణ ఈ యాప్ ను ఆవిష్కరించారు. సుప్రీంకోర్టు రోజువారి కార్యకలాపాలు ఇకపై ఉన్న చోటు నుంచే పొందవచ్చని ఆయన అన్నారు. జస్టిస్ కన్విల్ కర్, జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ ధనుంజయ్‌లతో కూడిన కమిటీ కేవలం మూడు రోజుల వ్యవధిలోనే ఈ యాప్ రూపకల్పన చేసినట్లు ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు. ఈ యాప్ తో పాత్రికేయులు అనుసంధానం అవడం ద్వారా సుప్రీంకోర్టు చేపట్టే వర్చువల్ విచారణల కవరేజీ ఇవ్వవచ్చు. కీలక తీర్పులకు సంబంధించిన సంక్షిప్త సమాచారాన్ని పొందవచ్చు.

న్యాయ సమాచారాన్ని ప్రజల వద్దకు తీసుకువెళ్ళడంలో జర్నలిస్టుల పాత్ర ముఖ్యమని సీజేఐ అన్నారు. ఒక జర్నలిస్టుగా తాను బస్సులో తిరిగి వార్తలు సేకరించిన రోజులు ఇప్పటికీ తనకు గుర్తు ఉన్నాయన్నారు. ప్రస్తుత ఇబ్బందికర పరిస్థితుల్లో కోర్టు వార్తల కోసం జర్నలిస్టులు పడుతున్న బాధలు తమకు తెలుసన్నారు. సాంకేతిక పరిజ్ఞానం ఇంతగా అభివృద్ధి చెందిన నేపథ్యంలో ఇక నుంచి జర్నలిస్టులు కోర్టు కార్యకలాపాల కోసం ఎటువంటి సమస్యను ఎదుర్కోకూడదన్న దృష్టితోనే ఈ యాప్ రూపకల్పనకు శ్రీకారం చుట్టామన్నారు.

మీడియా, సుప్రీంకోర్టు మధ్య అనుసంధానం, వారధిగా వ్యవహరించేందుకు ప్రత్యేక అధికారిని నియమించనున్నట్లు పేర్కొన్నారు. జర్నలిస్టులకు సుప్రీం కోర్టు అక్రిడేషన్ కూడా అందచేస్తామని..అక్రిడేషన్ల మంజూరులో ఎవరికి అన్యాయం జరగకుండా హేతుబద్ధతతో వ్యవరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. కాగా, ఈ యాప్ ను విడుదల చేసిన సమయంలోనే, జస్టిస్ ఎన్వీ రమణ సుప్రీంకోర్టు వెబ్ సైట్ లో ‘ఇండికేటివ్ నోట్స్’ అనే ఫీచర్ ను కూడా ఆవిష్కరించారు. రానున్న రోజుల్లో సాంకేతిక పరిజ్ఞానం మరింత వినియోగంలోకి తీసుకురానున్నట్లు సీజేఐ తెలిపారు.

ఈ సందర్భంగా సీజేఐ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారాలకు తాను సిద్ధంగా ఉన్నట్లు సీజేఐ తెలిపారు. ప్రత్యక్ష ప్రసారాలపై సహ న్యాయమూర్తులతో చర్చిస్తానన్నారు. రానున్న రోజుల్లో కోర్టు కార్యకలాపాలు అన్నీ ప్రత్యక్ష ప్రసారం చేసే దిశగా తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తామని చెప్పారు. ఇక, కోవిడ్ బారిన పడి మృతి చెందిన న్యాయమూర్తులు, న్యాయవాదులు, సిబ్బందికి సీజేఐ, ఇతర న్యాయమూర్తులు సంతాపం తెలిపారు.