గల్వాన్ ఘర్షణకు కారణమైన చైనా కమాండర్ కు అత్యున్నత పదవి

గల్వాన్ ఘర్షణకు కారణమైన చైనా కమాండర్ కు అత్యున్నత పదవి

China గతేడాది గల్వాన్ లో భారత-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణకు మూలకారకుడైన టాప్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(PLA) అధికారి జనరల్ జావో జోంగ్కికి చైనా ప్రభుత్వం అత్యున్నత పదవిని కట్టబెట్టింది. పీఎల్‌ఏ నిబంధనల ప్రకారం. సైన్యం యొక్క టాప్ జనరల్ పదవీ విరమణ వయస్సు 65 సంవత్సరాలు. జనరల్ జావో జోంగ్కి వయస్సు 65 సంవత్సరాలకు చేరిన నేపథ్యంలో..చైనా పార్లమెంట్ (నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్)లో ప్రభావవంతమైన విదేశీ వ్యవహారాల కమిటీకి డిప్యూటీ చైర్మన్‌గా జావో జోంగ్కిని జిన్ పింగ్ ప్రభుత్వం నియమించింది.

కాగా, విదేశీ వ్యవహారాల కమిటీ.. చైనా పార్లమెంట్ లో ఓ ప్రభావవంతమైన బాడీ. మార్చి-5నుంచి ఎన్పీసీ(National People’s Congress)వార్షిక సమావేశం ప్రారంభం కానున్న సమయంలో చైనా ఈ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. ఎన్‌పీసీ, దాని సలహా సంస్థ అయిన చైనీస్ పీపుల్స్ పొలిటికల్ కన్సల్టేటివ్ కాన్ఫరెన్స్ (సీపీపీసీసీ) సంవత్సరానికి ఒకసారి సమావేశమవుతాయి.

ఇక, 65ఏళ్ల జనరల్‌ జావో.. రెండు దశాబ్దాలుగా భారత్‌-టిబెట్ సరిహద్దు వెంబడి విధుల్లో ఉన్నారు. 2017 లో డోక్లాం ఘర్షణ సమయంలో వెస్ట్రన్ కమాండ్‌కు అధిపతిగా, 2020 లో లడఖ్ సైనిక ప్రతిష్ఠంభణలో ఉన్నారు. గల్వాన్ లోయలో దాడి చేయాలని చైనా సైన్యాన్ని ఆదేశించినది జనరల్‌ జావో కావడం విశేషం. జనరల్ జావో జోంగ్కి ఇప్పటికే భారత్‌తో గతంలో చాలా ఘర్షణలకు దిగిన ఆనవాళ్లు ఉన్నాయి. జావోతో పాటు ఇప్పటివరకు సాయుధ పోలీసు దళాలకు అధిపతిగా ఉన్న జనరల్ వాంగ్ నింగ్.. రాజ్యాంగం, చట్టంపై ఎన్‌పీసీ కమిటీకి డిప్యూటీ చైర్మన్‌గా నియమితులయ్యారు. గల్వాన్‌లో చైనాతో జరిగిన ఘర్షణలో భారత్ చెందిన 20 మంది సైనికులు అమరులవ్వగా..చైనాకు చెందిన 40 మంది సైనికులు చనిపోయారని అమెరికా పత్రికలు పేర్కొన్నాయి.