US Defence Report : అరుణాచల్ ప్రదేశ్ లో 100 ఇళ్ల చైనా గ్రామం..యూఎస్ రిపోర్ట్

వాస్తవాధీనరేఖ వెంట చైనా కుట్రలు కొనసాగుతూనే ఉన్నాయి. భారత్‌-చైనా వివాదాస్పద సరిహద్దు ప్రాంతంలో చైనా 100 ఇళ్లు నిర్మించినట్లు తాజాగా అమెరికా ర‌క్షణ‌ శాఖ గుర్తించింది.

US Defence Report : అరుణాచల్ ప్రదేశ్ లో 100 ఇళ్ల చైనా గ్రామం..యూఎస్ రిపోర్ట్

China Village (1)

US Defence Report  వాస్తవాధీనరేఖ వెంట చైనా కుట్రలు కొనసాగుతూనే ఉన్నాయి. భారత్‌-చైనా వివాదాస్పద సరిహద్దు ప్రాంతంలో చైనా 100 ఇళ్లు నిర్మించినట్లు తాజాగా అమెరికా ర‌క్షణ‌ శాఖ గుర్తించింది. ఈ మేరకు అగ్రరాజ్యం ఓ రిపోర్ట్ ను అమెరికా కాంగ్రెస్(పార్లమెంట్)కు సమర్పించింది.

యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్ నివేదికలో.. “సరిహద్దు ఉద్రిక్తతలను తగ్గించడానికి భారత్-చైనా మధ్య దౌత్య, సైనిక సంప్రదింపులు కొనసాగుతున్నప్పటికీ నియంత్రణ రేఖ దగ్గర పెరుగుతున్న వాదనలను తొక్కిపట్టేందుకు చైనా వ్యూహాత్మక చర్యలను కొనసాగించింది’’ అని పేర్కొంది.

మెక్ మెహ‌న్ రేఖ‌కు ద‌క్షిణాన భార‌త స‌రిహ‌ద్దుల్లో 100 ఇళ్లతో కూడిన గ్రామాన్ని 2020 మ‌ధ్యలో చైనా నిర్మించినట్లు యూఎస్ నివేదిక పేర్కొంది. అరుణాచ‌ల్‌లోని అప్పర్ సుబాన్‌సిరి జిల్లాలోని సారిచు న‌ది ఒడ్డున ఈ గ్రామ నిర్మాణం చేప‌ట్టడం వివాదాస్పదంగా మారింది. 1962కు ముందు కూడా ఈ ప్రాంతంలోనే రెండు దేశాల సైనికుల మధ్య ఘ‌ర్షణలు జరిగాయి. ఈ గ్రామం ఏర్పాటు చేసిన ప్రాంతం భౌగోళికంగా భారత భూభాగంలో ఉన్నప్పటికీ.. 1959 నుంచి ఆ ప్రాంతం చైనా ఆధీనంలో ఉంది. దశాబ్దం క్రితం వరకు దీన్ని చిన్న మిలిటరీ ఔట్‌ పోస్టుగా పేర్కొంటూ వచ్చిన చైనా.. 2020నాటికల్లా చిన్న సైనిక పోస్టును ఏకంగా ఓ గ్రామంగా అభివృద్ధి చేసింది.

అంతేకాదు భారత భూభాగంలోనే రోడ్డు నిర్మాణ పనులు కూడా చేస్తున్నట్లు సమాచారం. అరుణాచల్‌ ప్రదేశ్‌‌లో సరిహద్దు వెంట భారత భూభాగంలోకి 4.5 కిలోమీటర్ల మేర చైనా చొచ్చుకువచ్చినట్లు శాటిలైట్ ఫొటోల ఆధారంగా ఓ ఇంగ్లిష్ టీవీ ఛానెల్ ఈ ఏడాది ఆరంభంలో ఓ వార్తా కథ‌నం ప్రసారం చేసిన విషయం తెలిసిందే.

ఇక, తాజా యూఎస్ నివేదికలో.. గతేడాది జూన్‌లో జరిగిన గల్వాన్‌ ఘర్షణను కూడా అమెరికా రక్షణ శాఖ ప్రస్తావించింది. నలుగురు పీఎల్​ఏ సైనికులకు చైనా అవార్డులు ప్రకటించినట్లు పేర్కొంది. అయితే చైనా వైపు ఎంతమంది చనిపోయారన్నదానిపై స్పష్టత లేదని తెలిపింది. భారత్‌ వైఖరి వల్లే తాము ఎల్‌ఏసీ వెంట సైనిక మోహరింపులు చేపట్టినట్లు చైనా చెబుతోందని అమెరికా రక్షణశాఖతెలిపింది.

వాస్తవాధీన రేఖ వెంట మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు నిలిపివేయటం సహా భారత్‌ తన సైన్యాన్ని ఉపసంహరించుకునే వరకు తాము వెనక్కి వెళ్లేదిలేదని చైనా పేర్కొన్నట్లు తెలిపింది. అయితే, సైనిక సామర్థ్యం పెంచుకోవటం సహా బహుళ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పెద్దఎత్తున ఎల్​ఏసీ వెంట మౌలిక సదుపాయాలను చైనా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపింది.

ALSO READ China : భారత్ మాపై సైబర్ దాడులు చేస్తోంది!