అంతా ఆన్‌లైన్, సీట్ డిస్టెన్సింగ్‌తో బొమ్మ పడుతుంది.. కొద్దిరోజుల్లోనే సినిమా షోలు

  • Published By: naveen ,Published On : July 28, 2020 / 10:22 AM IST
అంతా ఆన్‌లైన్, సీట్ డిస్టెన్సింగ్‌తో బొమ్మ పడుతుంది.. కొద్దిరోజుల్లోనే సినిమా షోలు

ఢిల్లీలోని సినిమా హాళ్లు రెడీ అవుతున్నాయి. తిరిగి కార్యకలాపాలు ప్రారంభించే పనిలో పడ్డాయి. కరోనా లాక్ డౌన్ కారణంగా దాదాపు 5 నెలలుగా సినిమా హాళ్లు, మల్టిప్లెక్స్ లు మూతపడిన సంగతి తెలిసిందే. కాగా అన్ లాక్ 3లో భాగంగా సినిమా హాళ్లకు కేంద్రం పరిష్మన్ ఇవ్వనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై కేంద్రం నుంచి తుది నిర్ణయం వెలువడాల్సి ఉంది. పర్మిషన్ వస్తుందనే నమ్మకంతో ఈలోపే సినిమా హాళ్లు, మల్టిప్లెక్స్ యాజమాన్యాలు సన్నద్ధం అవుతున్నాయి. సినిమాకు వచ్చే వారి భద్రత కోసం చర్యలు చేపట్టాయి.

అంతా ఆన్ లైన్, కరోనా కట్టడికి ప్రత్యేక చర్యలు:
పేపర్ లెస్ టికెట్స్, ఆన్ లైన్ బుకింగ్స్, సీటింగ్ అరేంజ్ మెంట్స్, షో టైమింగ్స్ కు సంబంధించి మల్టిప్లెక్స్ లు పూర్తి వివరాలతో కూడిన స్టాండర్ట్ ఆపరేటింగ్ ప్రొడీడర్స్(SOP) ని సిద్ధం చేశాయి. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేస్తున్నాయి. కరోనా కారణంగా ఢిల్లీలో మార్చి 12వ తేదీ నుంచి సినిమా థియేటర్లు, మల్టిప్లెక్స్ లు మూతపడిన సంగతి తెలిసిందే. చాలా సినిమా హాళ్లు, మరీ ముఖ్యంగా మల్టిప్లెక్స్ లు పేపర్ లెస్ టికెట్స్ అంటే ఆన్ లైన్ బుకింగ్స్ కు ప్రాధాన్యం ఇచ్చాయి. నేరుగా థియేటర్ కు వచ్చే వాళ్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. క్యూఆర్ కోడ్స్ ద్వారా ఆన్ లైన్ లో టికెట్స్ బుక్ చేసుకోవచ్చు.

”ఎక్కువ రద్దీ లేకుండా చేసేందుకు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అందుబాటులోకి తెచ్చాం. ఈ-వాలెట్స్, ఆన్ లైన్ సైట్లు ద్వారా టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. థియేటర్లలో క్యూర్ కోడ్స్ స్కాన్ చేయడం ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. క్యూఆర్ కోడ్స్ ను కస్టమర్ ఫోన్లకే పంపిస్తాం. స్కాన్ చేసి థియేటర్ లోకి ప్రవేశించవచ్చు” అని PVR సినిమాస్ సీఈవో గౌతమ్ దత్తా తెలిపారు.

కేంద్రం మార్గదర్శకాలకు అనుగుణంగా సీటింగ్ అరేంజ్ ఉంటుందని సినిమా థియేటర్ల యాజమాన్యాలు తెలిపాయి. కొన్ని థియేటర్లు సీటుకి సీటు మధ్య గ్యాప్ ఉండేలా ప్లాన్ చేశాయి. మరికొన్ని థియేటర్లు రెండు సీట్ల తర్వాత ఒక సీటుని ఖాళీ వదిలేశాయి. అంతేకాదు చాలా పకడ్బందీగా షో టైమింగ్స్ ప్లాన్ చేశారు. ఒక షో అయిపోయిన తర్వాత గ్యాప్ ఇచ్చి మరో షో వేయనున్నాయి.

మాస్కు మస్ట్, ప్రతి ఒక్కరికి థర్మల్ స్క్రీనింగ్:
”థియేటర్ కు వచ్చే వారిని థర్మల్ స్కానర్స్ ద్వారా స్క్రీనింగ్ చేస్తారు. థియేటర్ కు వచ్చే ప్రతి ఒక్కరు మాస్కు కచ్చితంగా ధరించాలి. ఇక ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు. అయితే స్వయంగా ఫుడ్ కౌంటర్ కి వెళ్లి వాళ్లే కలెక్ట్ చేసుకోవాలి. కాంటాక్ట్స్ ను తగ్గించడం కోసం డెలివరీ సర్వీస్ ని మల్టిప్లెక్స్ యాజమాన్యాలు తీసేశాయి” అని నిర్వాహాకులు తెలిపారు.

ప్రతి షో కి ముందు తర్వాత హాల్ పూర్తిగా శానిటైజ్:
హాల్ లో సురక్షిత వాతావరణం కల్పించేందుకు ప్రతి షో తర్వాత హాల్ ని పూర్తిగా శానిటైజ్ చేస్తారు. షో ప్రారంభం కావడానికి ముందు టచ్ పాయింట్స్ అయిన హ్యాండ్ డ్రిల్స్, డోర్ హ్యాండిల్ ను ఒకసారి, షో అయిపోయిన తర్వాత మరోసారి శానిటైజ్ చేస్తామన్నారు. షో అయిపోయిన తర్వాత అందరినీ ఒకేసారి బయటకు పంపేది లేదన్నారు. వరుసల వారీగా భౌతిక దూరం పాటిస్తూ బయటకు పంపుతామన్నారు. ఇందుకోసం ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసి వారికి ఆ బాధ్యత అప్పగిస్తామని సినీపోలిస్ సీఈవో దేవాంగ్ సంపత్ చెప్పారు. ఇక వాష్ రూమ్స్ ని రోజుమొత్తం శుభ్రంగా ఉంచుతామన్నారు. ప్రతి రెండు గంటలకు ఒకసారి వాష్ రూమ్స్ ని శానిటైజ్ చేస్తామన్నారు. క్రిమ సంహారకాలతో శుభ్రం చేస్తామన్నారు.

సిబ్బంది భద్రత కోసం ప్రత్యేక ఏర్పాట్లు:
సినిమా థియేటర్లు, మల్టిప్లెక్స్ లో పని చేసే సిబ్బంది భద్రత కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రతి ఒక్కరికి పీపీఈ కిట్లు, మాస్కులు అందజేయనున్నారు. అంతేకాదు సిబ్బంది ప్రతి రోజూ థియేటర్ లోనికి వచ్చే ముందు వారి ఆరోగ్య సేతు స్టేటస్ ను షేర్ చేయాల్సి ఉంటుంది. ఎంట్రీలో కచ్చితంగా సిబ్బందిని థర్మల్ స్క్రీనింగ్ చేస్తారు. అలాగే ఫేస్ మాస్కులు కూడా ఇవ్వనున్నారు.