జార్ఖండ్ కు కొత్త లోగో…ప్రజల సూచనలు కోరిన సీఎం

  • Published By: venkaiahnaidu ,Published On : January 26, 2020 / 04:15 PM IST
జార్ఖండ్ కు కొత్త లోగో…ప్రజల సూచనలు కోరిన సీఎం

భారత 71వ రిపబ్లిక్ డే పురస్కరించుకుని జార్ఖండ్ రాష్ట్రానికి కొత్త లోగో తీసుకురావాలని హేమంత్ సోరెన్ నిర్ణయించింది. కొత్త లోగో రూపకల్పనకు సలహాలు, సూచనలు ఇవ్వాలని ప్రజలను ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కోరారు. ఈ మేరకు ఆదివారం ఒక అధికార ప్రకటన విడుదలైంది. ఫిబ్రవరి 11లోగా ప్రజలు తమ సూచనలు,సలహాలను ‘jharkhandstatelogo@gmail.com’కు తెలియజేయాలని ఆ ప్రకటన కోరింది. 

జార్ఖాండ్ కొత్త బాట పట్టింది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రానికి కొత్త లోగో ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. జార్ఖండ్ సమున్నత సంస్కృతి, వారసత్వాన్ని ప్రతిబిబించేలా లోగో ఉండబోతోందని ప్రభుత్వ ప్రకటన తెలిపింది. లోగో రూపకల్పనలో తమవంతుగా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరింది
 
హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత ఏర్పాటు చేసిన తొలి మంత్రివర్గ సమావేశంలో కొత్త లోగో ఏర్పాటు నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా డుంకాలోని పోలీస్ లైన్‌ దగ్గర జాతీయ జెండాను ఎగురవేశారు హేమంత్ సోరెన్.

గతేడాది డిసెంబర్ లో జరిగిన జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం-కాంగ్రెస్-ఆర్జేడీ కూటమి ఘన విజయం సాధించి హేమంత్ సోరెన్ నాయకత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు అయింది. 81 అసెంబ్లీ స్థానాలున్న జార్ఖండ్‌లో జేఎంఎం 29 స్థానాలు గెలుపొందగా, కాంగ్రెస్‌ 16, ఆర్జేడీ 1 స్థానం గెలుచుకున్నాయి. ఇక అప్పటివరకు అధికారంలో కొనసాగిన  బీజేపీ 25సీట్లకు మాత్రమే పరిమితమై ఇంటిదారి పట్టింది. సీఎం రఘుబర్ దాస్ సైతం ఓటమి పాలయ్యారు.