కేంద్రం సరిగ్గా పని చేస్తలే.. డబ్బులిస్తలే : సీఎం కేసీఆర్

  • Published By: sreehari ,Published On : January 25, 2020 / 12:44 PM IST
కేంద్రం సరిగ్గా పని చేస్తలే.. డబ్బులిస్తలే : సీఎం కేసీఆర్

కేంద్రంలో ఉన్న సర్కార్ సరిగ్గా పనిచేయడం లేదని, ఢిల్లీ పెద్దల తీరు సరిగ్గా లేదని తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్రానికి GST కింద సుమారు రూ. 5 వేల కోట్లు రావాల్సి ఉందన్నారు. IGST కింద రూ. 2 వేల 812 కోట్లు రావాల్సి ఉందని వివరించారు. బీజేపీ నేతల మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయని విమర్శించారు.

 

కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై తమ పార్టీకి చెందిన ఎంపీలు గాంధీ బొమ్మ దగ్గర లోక్ సభ, రాజ్యసభల్లో ఆందోళన చేపట్టడం జరిగిందన్నారు. దీనిపై తాను స్వయంగా కేంద్రానికి లేఖ రాస్తామని వెల్లడించారు. కేంద్ర పాలనపై కాగ్ నివేదిక ఇస్తే..అన్నీ విషయాలు బయటకు వస్తాయన్నారు సీఎం కేసీఆర్. 

మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. ఈ సందర్భంగా 2020, జనవరి 25వ తేదీ శనివారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్‌ను గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు, గెలిచిన అభ్యర్థులకు అభినందనలు తెలిపారు. దేశ వ్యాప్తంగా వృద్ధి రేటు మరింత తగ్గే అవకాశం ఉందని, ఆర్థిక పరిస్థితి కాస్త ఇబ్బందికరంగానే ఉందని వ్యాఖ్యానించారు.

దేశ ఆర్థిక వ్యవస్థ దిగజారుతుందని ఆర్థిక వేత్తలు చెబుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఐదు సంవత్సరాల్లో ఇండియాలో నెంబర్ వన్ స్టేట్ తెలంగాణ. ఇది నా లెక్క కాదు..కాగ్ లెక్క అన్నారు. 21 శాతం పెరుగుదల ఉండే..కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని, చాలా విపత్కరపరిస్థితి ఉందన్నారు. కొంత పుంజుకుని ఇప్పుడు 9.5 శాతం గ్రోత్ వచ్చిందని..ఇది చాలా తక్కువని సీఎం కేసీఆర్ అన్నారు.