CM MK Stalin : 2లక్షల 50 వేల పుస్తకాలతో అధునాతన లైబ్రరీ నిర్మిస్తున్న సీఎం స్టాలిన్ | CM MK Stalin

CM MK Stalin : 2లక్షల 50 వేల పుస్తకాలతో అధునాతన లైబ్రరీ నిర్మిస్తున్న సీఎం స్టాలిన్

చిరిగిన చొక్కా అయినా తొడుక్కో...ఓ పుస్తకం కొనుక్కో....అన్నారు....కందుకూరి వీరేశలింగం పంతులు....పుస్తకానికి, పఠనానికి ఎంత ప్రాధాన్యత ఉందో చెప్పడానికి ఈ ఒక్క మాట చాలు.

CM MK Stalin : 2లక్షల 50 వేల పుస్తకాలతో అధునాతన లైబ్రరీ నిర్మిస్తున్న సీఎం స్టాలిన్

CM MK Stalin :  చిరిగిన చొక్కా అయినా తొడుక్కో…ఓ పుస్తకం కొనుక్కో….అన్నారు….కందుకూరి వీరేశలింగం పంతులు….పుస్తకానికి, పఠనానికి ఎంత ప్రాధాన్యత ఉందో చెప్పడానికి ఈ ఒక్క మాట చాలు. జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని పంచడమే కాదు…పుస్తకం జీవితానికి దారి చూపిస్తుంది. ఆలోచనను పెంచుతుంది. సమస్యలకు పరిష్కార మార్గం చూపిస్తుంది. మంచి పుస్తకం విశాల దృక్పథం అలవరుస్తుంది. స్పందించే గుణం కల్పిస్తుంది. సామాజిక చైతన్యం అలవరుస్తుంది.

పుస్తకం వెంట ఉంటే అదే మంచి స్నేహితుడు అవుతుంది. స్వాతంత్ర్యోద్యమంపై పుస్తకాల ప్రభావం ఎంతగానో ఉంది. తెలుగునాట గ్రంథాలయోద్యమం రాజకీయాల తీరు తెన్నులు మార్చివేసింది. సమాజ పురోగతిని, తిరోగమనాన్ని పుస్తకం నిర్దేశించిదనడంలో సందేహం లేదు. 30,40 ఏళ్ల క్రితం అభివృద్ధిదాయక ఆలోచనలు చేసిన సమాజంలో ఇప్పుడు చైతన్యం తగ్గడానికి, మూఢ నమ్మకాలు ప్రబలడానికి కారణం…. పుస్తకాలు చదివేవారి సంఖ్య తగ్గడం, లైబ్రరీలు అవశేష స్థితికి చేరడమే కారణమన్న ఆరోపణలున్నాయి.

ఈ సంగతి పక్కనపెడితే..డిజిటలైజేషన్‌తో ఇప్పుడిప్పుడే చదువరుల సంఖ్య పెరుగుతోంది. పుస్తకాలు కొనేవారి సంఖ్యా ఎక్కువగానే ఉంటోంది. అయితే సరైన లైబ్రరీ, మంచి పుస్తకాలు అందుబాటులో ఉండడం లేదనీ అనేకమంది అంటున్నారు. ఈ కొరత తీర్చేందుకు స్వయంగా ఓ ముఖ్యమంత్రి రంగంలోకి దిగారు. వందలకోట్లు వెచ్చించి అధునాతన లైబ్రరీని అందుబాటులోకి తెస్తున్నారు. సమస్త సౌకర్యాల మధ్య కోరిన పుస్తకం చదువుకునే వీలు కల్పిస్తున్నారు.

కావల్సిన పుస్తకం కోరుకున్న క్షణంలో ముందుండే అవకాశం కల్పిస్తున్నారు. ఇవన్నీ చేస్తోంది ఎవరో తెలుసా..? సాహిత్య ప్రభావం, నాస్తిక ఉద్యమాలతో తమ రాజకీయాల గతిని మార్చుకున్న తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే. స్టాలిన్. గత ఏడాది ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి స్టాలిన్ అంచనాలకు అందని రీతిలో, ఊహాతీత నిర్ణయాలతో తన మార్క్ పాలన సాగిస్తున్నారు.

ఇప్పుడు సరికొత్తగా, దేశంలో ఏ ముఖ్యమంత్రీ చేయని విధంగా తమ రాష్ట్ర ప్రజలను మరింత చైతన్యం పరిచేందుకు, పఠనం అలవాటును జీవితంలో భాగం చేసేందుకు వందల కోట్లు వెచ్చించి లైబ్రరీ నిర్మిస్తున్నారు. తమిళనాడు సాంస్కృతిక రాజధాని మధురైలో అధునాతన హంగులతో ఈ గ్రంథాలయం నిర్మితమైంది. అతిత్వరలో ప్రారంభం కానుంది.

లైబ్రరీ అంటే ఏదో ఆటవిడుపుకోసమో……కాలక్షేపం కోసమో కాదు…..అలా వచ్చి..ఏదో పుస్తకం..ఇలా మొక్కుబడిగా తిరగేసి వెళ్లడం కాదు. అక్కడే గంటల తరబడి కూర్చోవచ్చు. నచ్చిన పుస్తకం రోజంతా చదువుకోవచ్చు. ఇంటి నుంచి అయినా టిఫిన్, లంచ్ వంటివి తెచ్చుకోవచ్చు. లేదా అక్కడే ఉన్న కెఫెటేరియాలో కావాల్సినవి తినొచ్చు. చెప్పాలంటే అదొక విజిటింగ్ స్పాట్.

ఏడంతస్తుల భవనం. సెంట్రలైజ్డ్‌ ఏసీ..ఎక్కీ దిగడానికి ఎస్కలేటర్లు. ఆ లైబ్రరీలో ఉండే మొత్తం పుస్తకాల సంఖ్య ఎంతో తెలుసా…? అక్షరాలా 2లక్షల 50వేల పుస్తకాలు. ఈ పుస్తకాల కోసమే 10 కోట్లు ఖర్చుపెట్టారు. మరి ఇన్ని పుస్తకాల్లో మనకు కావాల్సిన పుస్తకం కనుక్కునేదెలా..? ఏ పుస్తకం ఎక్కడ ఉందో తెలుసుకునేదెలా..అంటే దానికి సమాధానం డిజిటల్ ఓపెన్ యాక్సెస్ ఇన్‌ఫర్మేషన్ సెంటర్. ఈ టెక్నాలజీతో అర సెకనులో మనకు కావాల్సిన పుస్తకం ఎక్కడుందో తెలుసుకోవచ్చు. చేతిలోకి తీసుకుని చదువుకోవచ్చు.

విస్తృత పాఠకాదరణ పొందిన తమిళ సాహిత్యంతో పాటు ఇంగ్లీష్ సాహిత్యం, ఇతర పుస్తకాలూ అధునాతన లైబ్రరీలో కొలువు తీరుతున్నాయి. అలాగే సాహిత్యం, ఫిక్షన్, నాన్ ఫిక్షన్ వంటివే కాదు…కాంపిటీటివ్ పరీక్షలకు సన్నద్ధమయ్యే నిరుద్యోగులకు కావాల్సిన పుస్తకాలతో పాటు అన్ని విభాగాల విద్యార్ధులకు కావాల్సిన పుస్తకాలు ఈ లైబ్రరీలో దొరుకుతాయి.

ఇంజనీరింగ్, మెడిసన్, లా, ట్రావెలాగ్, బయోగ్రఫీ, ఆటోబయోగ్రఫీ, చారిత్రక మ్యాగజైన్లు వంటివి బ్రెయిలీలిపిలో లభిస్తాయి. అంధ, మూగ విద్యార్ధుల కోసం డిజిటల్ స్టూడియో ఉంటుంది. పిల్లల కోసం ప్రత్యేకంగా కిడ్స్ థియేటర్ ఉంటుంది. 27 గదులు, పెర్‌ఫార్మింగ్ సెంటర్ వంటివీ ఉంటాయి. విద్యార్ధులు, ఉద్యోగులు, సాధారణ ప్రజలు ఎవరైనా తమకు కావాల్సిన పుస్తకాలు చదువుకోవచ్చు.
Also Read : AP Corona Cases : ఏపీలో కరోనా తగ్గుముఖం.. కొత్తగా 425 కేసులు, రెండు మరణాలు
అక్కడున్న పుస్తకాలే కాదు..ఇంటి నుంచి పుస్తకాలు తెచ్చుకుని కూడా అక్కడ కూర్చొని చదువుకోవచ్చు. ఆన్‌లైన్‌ స్టడీ అందుబాటులో ఉంటుంది. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్ధులకయితే నిజంగా ఈ లైబ్రరీ ఒక వరం లాంటిదే. 30వేల పుస్తకాలు, ఆడియో, వీడియో రూపంలో అందుబాటులో ఉంటాయి. తమిళ సాహిత్యానికి సంబంధించి 63వేల పుస్తకాలు, ఇంగ్లీషు పుస్తకాలు 96వేల పుస్తకాలు, పిల్లల పుస్తకాలు 20వేలు ఉన్నాయి.

2.04 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఏడంతస్తుల భవనం నిర్మిస్తున్నారు. వంద కార్లు, 200 టూ వీలర్లు పార్క్ చేసుకోవచ్చు. PWD విభాగానికి చెందిన వందేళ్ల భవనం కూల్చి..ఈ కొత్త లైబ్రరీ నిర్మిస్తున్నారు. అయితే ఈ స్థలం మీద ఓ వివాదం ఉంది. ఇది ముళ్లపెరియార్ డ్యామ్ నిర్మించిన బ్రిటిష్ ఇంజనీర్‌ది అని స్థానిక రైతులు భావిస్తుంటారు.
Also Read : Viral News in Bihar: బాలిక కోసం ఊరు ఊరంతా పరీక్షా కేంద్రానికి తరలి వచ్చారు, ఎందుకంటే?
కానీ అధికారులు చెప్పే వివరాల ప్రకారం ఆయన 1911లో మరణించారు. 1912 నుంచి 1915 మధ్య పాత భవనం నిర్మించారని చెబుతున్నారు. గత నెలలో పనులు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం 99 కోట్లు మంజూరుచేసింది. ఈ భవనం నిర్మాణం సైతం ప్రత్యేకంగా సాగుతోంది. సివిల్ ఇంజనీరింగ్ విద్యార్ధులకు ఇది ఫీల్డ్ స్టడీగా భావిస్తున్నారు. ఎన్నో విషయాల్లో తండ్రి కరుణానిధి అడుగుజాడల్లో నిలుస్తున్న స్టాలిన్…ఆయన బాటలోనే అధునాతన లైబ్రరీ నిర్మిస్తున్నారు. చెన్నైలో కరుణానిధి నెలకొల్పిన అన్నా సెంటెనరీ లైబ్రరీ…దేశంలో ప్రముఖ గ్రంథాలయాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది.

×