కాఫీ ప్రియులకు షాకింగ్ న్యూస్, గుండెకి పొంచి ఉన్న ప్రమాదం

కాఫీ ప్రియులకు షాకింగ్ న్యూస్, గుండెకి పొంచి ఉన్న ప్రమాదం

coffee may effect your heart: మన దేశంలో కాఫీ ప్రియుల సంఖ్య ఎక్కువే. కొంతమందికి కాఫీ అంటే ప్రాణం. పొద్దున్నే లేవగానే మొదట కాఫీని టేస్ట్ చేయాల్సిందే. లేదంటే వారి డే స్టార్ట్ అవదు. ఏదో వెలితిగా ఉంటుంది. ఆ రోజంతా అన్ ఈజీగా ఫీల్ అవుతారు. కాఫీ తాగిన తర్వాతే తలనొప్పి తగ్గిపోతుందని ఫీల్ అయ్యే వారూ చాలామందే ఉన్నారు.

అయితే కొంతమంది అదే పనిగా ఎక్కువసార్లు కాఫీ తాగుతుంటారు. ఆ టేస్ట్ ని ఎంజాయ్ చేస్తుంటారు. అలాంటి వారికి ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. అతిగా కాఫీ తాగేవారికి ప్రమాదం పొంచి ఉంది. కాఫీ ప్రియులు దాన్ని తాగే విష‌యంలో అతిగా వ్య‌వ‌హ‌రించొద్ద‌ని ప‌రిశోధ‌కులు హెచ్చరిస్తున్నారు. కాఫీ అధికంగా తాగడం వల్ల గుండె జబ్బులు వస్తాయని తేల్చారు. రోజులో ఐదు కప్పుల‌కు మించి కాఫీ తాగేవారు గుండె జబ్బుల నుంచి త‌ప్పించుకోలేర‌ని పరిశోధకులు చెప్పారు. యూనివర్సిటీ ఆఫ్‌ సౌత్‌ ఆస్ట్రేలియా ప‌రిశోధ‌కులు ఇందుకు సంబంధించిన వివ‌రాలను వెల్ల‌డించారు.

చాలా కాలంగా ప్రతిరోజూ ఐదు కప్పులకు మించి కాఫీ తాగుతున్న వారిలో.. కాఫీలో ఉండే కఫెస్టోల్‌ అనే రసాయన మూలకం కార‌ణంగా కొవ్వు పేరుకుపోతోంద‌ని వివ‌రించారు. దీంతో వారిలో రక్త ప్రసరణ సరిగ్గా‌ జరగకపోవ‌డంతో గుండె సంబంధిత వ్యాధులు వ‌స్తున్నాయ‌ని వివరించారు.

ఫిల్టర్‌ చేయని కాఫీలో ఈ కఫెస్టోల్ అధికంగా ఉంటుందని చెప్పారు. కాఫీ ప్రియులు ఫిల్టర్‌ కాఫీకి ప్రాధాన్య‌త ‌ఇస్తే బాగుంటుంద‌ని చెప్పారు. ఆరోగ్యంపై కాఫీ ప్రభావం ఎలా ఉంటుందనే అంశంపై ఇంకా అధ్యయనం కొనసాగిస్తున్నట్లు పరిశోధకులు చెప్పారు. కాగా, ప్రపంచవ్యాప్తంగా ప్రజలు రోజుకు 300 కోట్ల కప్పుల కాఫీని తాగుతున్నారు. మ‌రోవైపు, హృద్రోగాల‌తో ఏడాదికి 1.79 కోట్ల మంది ప్రాణాలు కోల్పోతున్నారు.

కాఫీ.. ఆరోగ్యానికి మంచిదా? కాదా..? అనే ప్రశ్నకు కొన్నేళ్లుగా పరిశోధకులు సమాధానం వెతుకుతూనే ఉన్నారు. ఆ దిశగా ఎన్నో పరిశోధనలు చేశారు, చేస్తున్నారు. కాఫీ ఆరోగ్యానికి మంచిదని ఓసారి, హానికరమని మరోసారి తేల్చారు. కాఫీ తాగడం వల్ల క్యాన్సర్‌ వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని ఇంకోసారి చెప్పారు. ఇలా పరిశోధన ఫలితాలు రకరకాలుగా వెలువడుతూనే ఉన్నాయి.

తాజాగా నిర్వహించిన ఈ పరిశోధనలో కాఫీ ఎక్కువగా తాగడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు వస్తాయని పరిశోధకులు తేల్చడం కాఫీ ప్రియులను కలవరానికి గురి చేసింది. ఏది ఏమైనా, ఏ పరిశోధన ఫలితం ఎలా ఉన్నా, మన ఆహారపు అలవాట్లు హద్దులో ఉంటే ఏ సమస్యా రాదని డాక్టర్లు చెబుతున్నారు. ఏ అలవాటైనా.. హద్దు మీరితే అయితే ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఒక్కముక్కలో చెప్పాలంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందన్నమాట.