అర్థరాత్రి వరకు స్నేహితులతో తిరగొద్దని మందలించిన తల్లిని కిరాతకంగా చంపేసిన కొడుకు

  • Published By: naveen ,Published On : August 2, 2020 / 08:30 AM IST
అర్థరాత్రి వరకు స్నేహితులతో తిరగొద్దని మందలించిన తల్లిని కిరాతకంగా చంపేసిన కొడుకు

ఏ తల్లి అయినా బిడ్డ బాగుండాలనే కోరుకుంటుంది. బిడ్డ దారి తప్పకుండా చూసుకుంటుంది. అవసరమైతే మందలిస్తుంది, తిడుతుంది, కొడుతుంది. అదంతా అమ్మ ప్రేమలో భాగమే. కానీ ఆ నీచుడు తల్లి ప్రేమను, బాధను, మంచితనాన్ని అర్థం చేసుకోలేకపోయాడు. మందలించిందనే కోపంతో రగిలిపోయాడు. ఆ తల్లిని అతి దారుణంగా చంపేశాడు ఆ కొడుకు.

అర్ధరాత్రి వరకు బయట తిరగొద్దని మందలించడమే ఆ తల్లికి శాపమైంది:
అర్ధరాత్రి వరకు స్నేహితులతో కలిసి తిరగొద్దని మందలించడమే ఆ తల్లికి శాపమైంది. తనను మందలించిందనే కోపంతో కొడుకు ఆ తల్లిని అతి కిరాతకంగా హత్య చేశాడు. కర్ణాటకలోని మండ్య పట్టణంలో ఈ దారుణం జరిగింది. కాలేజీలో చదివే కొడుకు తరచూ స్నేహితులతో గడిపేవాడు. అర్ధరాత్రి వరకు ఇంటికి వచ్చేవాడు కాదు. ఈ విషయం అతడి తల్లికి నచ్చేది కాదు. కొడుకుని పలుమార్లు మందలించింది. గత బుధవారం కూడా ఇదే విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈసారి కొడుకుని తల్లి గట్టిగానే మందలించింది. నువ్వు నా మాటను లెక్క చేయడం లేదని మండిపడింది. దీంతో కొడుకు కోపంతో ఊగిపోయాడు. ఆ కోపంలో విచక్షణ కోల్పోయిన అతడు కత్తితో కన్న తల్లిని పొడిచి చంపేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. జులై 30న నిందితుడిని అరెస్టు చేశారు.

తల్లిదండ్రులు ఏం చెప్పినా పిల్లల మంచి కోసమే:
ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. కేవలం మందలించిందనే కోపంతో తల్లినే హతమార్చిన కొడుకుని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అమ్మ ప్రేమను అర్థం చేసుకోలేని ఇలాంటి వాడు బతికినా ఒక్కటే చచ్చినా ఒక్కటే అంటున్నారు. ఏ తల్లి అయినా తన బిడ్డ బతుకు బాగుండాలనే కోరుకుంటుంది. తల్లిదండ్రులు ఏం చెప్పినా అది పిల్లల మంచి కోసమే. అంతే కానీ వారికి పిల్లలపై ఎలాంటి కోపమూ ఉండదు. గట్టిగా మందలిస్తే అయినా మార్పు వస్తుందని ఆశించి కొన్ని సందర్భాల్లో పిల్లలపై సీరియస్ అవుతూ ఉంటారు. వారి బాధను అర్థం చేసుకోవాలి తప్ప ఆవేశానికి లోను కాకూడదు.