కల్నల్ సంతోష్ బాబు తలపై రాళ్లతో దాడి…గాల్వాన్ వ్యాలీలో ఆ రాత్రి ఇదే జరిగింది

  • Published By: venkaiahnaidu ,Published On : June 22, 2020 / 01:29 PM IST
కల్నల్ సంతోష్ బాబు తలపై రాళ్లతో దాడి…గాల్వాన్ వ్యాలీలో  ఆ రాత్రి ఇదే జరిగింది

తూర్పు లడఖ్ ‌లోని గల్వాన్ లోయలో ఈ నెల 15న చైనా బలగాలు దొంగ దాడి చేసిన సంగతి తెలిసిందే. వారితో జరిగిన హింసాత్మక ఘర్షణలో తెలంగాణ లోని సూర్యాపేట కు చెందిన కల్నల్‌ సంతోష్‌ బాబు సహా 20 మంది సైనికులు అమరులైన విషయం తెలిసిందే. చైనాకు చెందిన ఓ సీనియర్ కమాండింగ్ ఆఫీసర్ కూడా ఈ ఘర్షణలో చనిపోయారు.  

16 బీహార్ రెజిమెంట్ కమాండింగ్ ఆఫీసర్ కల్ సంతోష్ బాబుతో సహా 20 మంది భారతీయ సైనికులు చనిపోయిన ఘోర ఘర్షణలో తమ కమాండింగ్ అధికారిని కోల్పోయినట్లు చైనా వైపు ధృవీకరించినట్లు విదేశాంగ మంత్రి గత శుక్రవారం నిర్వహించిన  అఖిలపక్ష సమావేశంలో నాయకులకు తెలియజేశారు. ప్రధాని మోడీ వ్యాఖ్యలతో పాటు, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మరియు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అఖిల పక్ష సమావేశంలో రెండు ప్రెజెంటేషన్లు చేశారు.  జైశంకర్ వాస్తవాధీన  రేఖ(LAC) మరియు భారత భూభాగం గురించి వివరించాడు. 
 

జూన్ 17 న చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యితో మాట్లాడినట్లు జై శంకర్ ప్రస్తావించారని, పిఎల్‌ఎ కమాండింగ్ అధికారి కూడా హత్యకు గురైనట్లు చైనా పక్షం తనకు సమాచారం  ఆయన చెప్పారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి ఒక రిపోర్ట్  ప్రకారం, చైనా వైపు కూడా గణనీయమైన ప్రాణనష్టం జరిగింది. 

సోమవారం సాయంత్రం …కల్నల్‌ సంతోష్‌ బాబు‌  40 మందితో కూడిన ఒక చిన్న పార్టీతో కలిసి గాల్వాన్ వాలీ దగ్గర పర్యవేక్షణలో ఉన్నారు. అప్పటికే అక్కడ బాగా చీకటి పడింది. గల్వాన్‌ నది ఒడ్డున, పర్వతంపైన మాటు వేసిన చైనా బలగాలు అక్కడికి వచ్చాయి. వస్తూనే భారత సైనికులపై పెద్ద రాళ్లతో దాడి చేశాయి. కల్నల్‌ సంతోష్‌ బాబు‌ తలపై ఒక పెద్ద రాయి పడింది. దీంతో ఆయన గల్వాన్‌ నదిలోకి పడిపోయారు. సంతోష్ బాబుని చైనా ఆర్మీ  ప్రత్యేకంగా టార్గెట్ చేసిందా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియదు.  తమ కమాండింగ్‌ అధికారి నేలకొరగడంతో భారత సైనికులు ఊగిపోయారు. చైనా సైనికులు 350 మంది. తాము వంద మంది. అయినా లెక్కచేయక వారిపై విరుచుకుపడ్డారు. 

గల్వాన్‌ లోయలో దాదాపు 3 గంటల పాటు భీకర పోరాటం సాగింది. పోరు ఆగేసరికి భారత్‌, చైనాలకు చెందిన అనేక మంది సైనికుల మృతదేహాలు నదిలో ఉన్నాయి. సంతోష్‌ సహా పలువురు భారత జవాన్ల మృతదేహాలను మన సైన్యం వెనక్కి తీసుకొచ్చింది. మిగతా బృందం మాత్రం ఘటనా స్థలంలో ఉండి పరిస్థితిని సమీక్షించింది.

మరుసటి రోజు ఉదయానికి ఉద్రిక్తతలు కొద్దిగా తగ్గాయి. చైనా సైనికుల మృతదేహాలు 17 ఇంకా అక్కడే పడి ఉన్నాయి. వీటిని మన సైనికులు పొరుగు దేశానికి అప్పగించారు. సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ పెట్రోలింగ్ పాయింట్ 14 దగ్గర చైనా శిబిరాన్ని సంతోష్‌ బృందం విజయవంతంగా తొలగించింది.  మన సైనికుల్ని ముందుండి నడిపించిన సంతోష్ లోని నాయకత్వ లక్షణాలు, శౌర్య పరాక్రమాలు తీవ్ర ఉద్వేగానికి గురి చేస్తాయి. రాళ్ల దెబ్బలు తగిలి నిలువెల్లా గాయాలైనా పోరాటస్ఫూర్తిని మరిచిపోని ఆ వీరుడికి ప్రతీ భారతీయుడు పిడికిలి బిగించి సెల్యూట్ చేయాలి.