ప్రయోగాల్లో దూసుకుపోతున్న వ్యాక్సిన్‌…మూడో దశ దాటితే కరోనాకు చెక్‌పెట్టినట్టే

  • Published By: venkaiahnaidu ,Published On : July 23, 2020 / 08:08 PM IST
ప్రయోగాల్లో దూసుకుపోతున్న వ్యాక్సిన్‌…మూడో దశ దాటితే కరోనాకు చెక్‌పెట్టినట్టే

కరోనా వ్యాక్సిన్‌పై ప్రయోగాలు వేగంగా జరుగుతున్నాయి. ఆస్ట్రాజెనికా, ఫైజర్‌ బయో ఎన్‌ టెక్‌, కాసినో వ్యాక్సిన్‌లు ప్రయోగాల్లో దూసుకుపోతున్నాయి. ఇవి ఇప్పటికే ఒకటి రెండు దశలు దాటాయి. ఆస్ట్రాజెనికా ప్రధానంగా ఇమ్యూనిటి పవర్‌ పెంచగా.. మిగతా రెండు వ్యాక్సిన్లు టీ సెల్స్‌ ఉత్పత్తిలో సత్ఫలితాలను ఇచ్చాయి. ప్రస్తుతానికి ఈ మూడు వ్యాక్సిన్లు సక్సెస్‌ఫుల్‌గానే ముందుకు సాగుతున్నాయి. ఆటంకాల్లేకుండా మూడో దశ కూడా దాటితే కరోనాకి చెక్‌పెట్టినట్టే. అయితే.. అదంత ఈజీ కాదు. ఇప్పటిదాకా కొంతమంది పైనే జరిగిన ప్రయోగాలు ఇప్పుడు వేలల్లో జరుగనున్నాయి. చివరి దశ ప్రయోగాల్లో ఎలాంటి రిజల్ట్ వస్తుందనేదే ఆసక్తికరంగా మారింది.

యాంటీ బాడీలు, టీ సెల్స్ ఉత్పత్తిలో ఫలితాలు.. ఒక్కటే వ్యాక్సిన్ అందరికీ చేరవేయడం కష్టమే

ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్‌తో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్సూ రాలేదు. ఫైజర్ బయో ఎన్‌టెక్‌, కాసినో వ్యాక్సిన్ ఇచ్చాక… బాడీలో యాంటీబాడీలు, టీ-సెల్స్ రెండూ ఉత్పత్తి అవ్వడం కరోనాను ఈ వ్యాక్సిన్ జయిస్తుందనే నమ్మకం కలుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా 150కి పైగా వ్యాక్సిన్లు తయారవుతున్నాయి. వీటిలో కొన్నయినా సక్సెస్ కావాలని పరిశోధకులు కోరుతున్నారు. ఒక్కటే వ్యాక్సిన్ తయారైతే దాన్ని ఉత్పత్తి చెయ్యడం.. అది ప్రపంచం మొత్తానికి చేరడానికి చాలా టైమ్ పడుతుందంటున్నారు నిపుణులు. ఒకే సమయంలో వేర్వేరు వ్యాక్సిన్లు తయారైతే… కరోనాకి బ్రేక్ వేయవచ్చంటున్నారు

తయారవడానికి ఎంత టైమ్ పడుతుంది?వ్యాక్సిన్ తయారైతే ప్రపంచంలో ఎలాంటి పరిస్థితి ఉంటుంది?

వ్యాక్సిన్లలో నాలుగు అంశాలు కీలకమైనవి. వ్యాక్సిన్ ఎంత ప్రభావవంతమైనది? అది తయారవ్వడానికి ఎంత టైమ్ పడుతుంది? ఎంత వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చెయ్యగలరు? వ్యాక్సిన్ తయారైతే… ప్రపంచంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి? స్మాల్‌పాక్స్ లాంటి వాటికి ఇచ్చే వ్యాక్సిన్ జీవితాంతం రక్షణ ఇవ్వగలదు. కానీ కరోనా రాకుండా ఇచ్చే వ్యాక్సిన్ ఎంతకాలం రక్షణ ఇవ్వగలదన్నది తేలాల్సి ఉంది. ఒకవేళ ఎక్కువ కాలం రక్షణ ఇవ్వకపోయినా… వ్యాక్సిన్ వాడకం తప్పదు. ఇతర వైరస్‌లతో పోల్చితే… కరోనా వైరస్ అంతగా రూపాంతరం చెందట్లేదట. దీంతో ఇప్పుడు తయారయ్యే వ్యాక్సిన్లు బాగానే, ఎక్కువ కాలమే రక్షణ కల్పిస్తాయని అంటున్నారు.

త్వరలో మూడో దశ ట్రయల్స్ ప్రారంభం

ఆక్స్‌ఫర్డ్ ఆస్ట్రాజెనికా, ఫైజర్ బయో ఎన్‌ టెక్‌, కాసినో వ్యాక్సిన్లు ఇప్పటికే రెండు దశలు దాటాయి. మూడో దశ ట్రయల్స్ కూడా త్వరలో జరపనున్నాయి. ఆస్ట్రాజెనికా శరీరంలోకి ఎదైనా బ్యాక్టిరియా, వైరస్ ఎంటరైతే వెంటనే గుర్తించి ఎటాక్ చేస్తోంది. ప్రధానంగా ఇమ్యూనిటీ పవర్‌ పెంచడంలో ఇది కీలకంగా వ్యవహరిస్తోంది. మొదటి దశలో ఇది మంచి రిజల్ట్ ఇచ్చింది. అయితే ఫైజర్ బయో ఎన్‌టెక్‌, కాసినోలు టీ సెల్స్‌ ఉత్పత్తిలో మంచి ఫలితాలు చూపించాయి. సాధారణంగా మొదటి దశలో ఆరోగ్యంగా ఉన్న వారిపైనే ప్రధానంగా ప్రయోగాలు జరుపుతారు. మూడో దశకు వచ్చే సరికి లక్షణాలు ఉన్న వారిలోనే కాకుండా లేనివారిలో కూడా ప్రయోగాలు జరపనున్నారు. వైరస్‌తో బాధపడేవాళ్లు, లక్షణాలు మధ్యస్థంగా ఉండేవారిపైనే కాకుండా ఆరోగ్యంగా ఉన్నవాళ్లపై కూడా ట్రయల్స్ నిర్వహిస్తారు

50శాతం మంచి ఫలితాలు వస్తే సక్సెస్ అయినట్టే

ఫేజ్ – 1,2 దశల్లో కొందరిపైనే ప్రయోగాలు జరుపుతారు. థర్డ్ ఫేజ్‌లో వేలాది మందికి వేర్వేరు ప్రాంతాల్లో ప్రయోగాలు చేస్తారు. అలాగే వైరస్‌ ఎవరిపై ఎటాక్‌ చేస్తుందో వారిపై కూడా ప్రయోగాలు చేస్తారు. వీరిలో 50శాతం మంచి ఫలితాలు వచ్చినా టీకా, లేదంటే వ్యాక్సిన్‌ సక్సెస్ అయినట్టే. ప్రయోగాలు ఎక్కువగా యువకులపైనే జరుపుతున్నారు. కానీ కరోనా మరణాల్లో వృద్దులే ఎక్కువగా ఉంటున్నారు. దీంతో 60ఏళ్లకు పైబడిన వారిపై కూడా ప్రయోగాలు చేయాలని పరిశోధన సంస్థలు భావిస్తున్నాయి.

ఈ ఏడాది చివరినాటికి వ్యాక్సిన్ తయారయ్యేనా?

వ్యాక్సిన్ తయారీ, పంపిణీ అనేది ఇప్పటివరకూ ఇంత భారీ స్థాయిలో ఎప్పుడూ జరగలేదు. ఈ ఏడాది చివరి నాటికి వ్యాక్సిన్ తయారైనా… కొన్ని కోట్ల మందికి అది అవసరం అవుతుందనీ… దీంతో డోసుల తయారీ, పంపిణీ అనేది చాలా పెద్ద సవాలేనని నిపుణులు అంటున్నారు. ఎక్కువ వ్యాక్సిన్లు కరోనాను జయిస్తే… అప్పుడు తయారీ కంపెనీల మధ్య పోటీ పెరిగి… తక్కువ ధరకు వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే… ఎక్కువ రకాల వ్యాక్సిన్లు తయారు చేయాలని కోరుతున్నారు