వికాస్ లేని 100 రోజుల మోడీ సర్కార్ కు అభినందనలు

  • Published By: venkaiahnaidu ,Published On : September 8, 2019 / 01:57 PM IST
వికాస్ లేని 100 రోజుల మోడీ సర్కార్ కు అభినందనలు

మోడీ 2.0 వంద రోజుల పాలన పూర్తి చేసుకోవడంపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. ఎటువంటి అభివృద్ధి లేకుండా 100 రోజుల పాలన పూర్తి చేసుకున్న మోడీ ప్రభుత్వానికి అభినందనలు అంటూ రాహుల్ ట్వీట్ చేశారు. నిరంతర ప్రజాస్వామ్యం అణచివేత, ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపే మీడియా గొంతు నొక్కుతూ పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. భారత ఆర్థిక వ్యవస్థ నానాటికీ క్షీణించడానికి మోడీ నాయకత్వ లేమి, ప్రణాళిక లోపం, దిక్సూచి కొరవడటమే కారణమని ఆరోపిస్తూ రాహుల్ ట్వీట్ లో తెలిపారు.

ప్రభుత్వ అహంకార ధోరణి కారణంగా పలు సమస్యలు ఏర్పడ్డాయని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా రాజకీయకక్షతో దర్యాప్తులు చేపట్టడం వంటివి జరుగుతున్నాయని మోడీ సర్కార్ 100రోజుల పాలనపై కాంగ్రెస్ ఫైర్ అయింది.

మోడీ ప్రభుత్వ 100 రోజుల పాలనలో ఆర్థికవ్యవస్థ గాడితప్పిందని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకగాంధీ ఆరోపించారు. పలు కంపెనీలు ప్రమాదంలో పడ్డాయన్నారు. ప్రస్థుత ఆర్థిక పరిస్థితులు దాచడానికి అబద్దాలు చెబుతూ..నాటకాలు ఆడుతున్నారని మోడీ సర్కార్ 100రోజుల పాలనపై ప్రియాంక సెటైర్లు వేశారు. 

మరోవైపు 100 రోజుల పాలనలో దేశ ప్రజలు అనేక పెద్ద మార్పులు చూశారని ప్రధాని మోడీ అన్నారు. ఆర్టికల్ 370  రద్దు చేశామని,కఠినమైన చట్టాలు అమల్లోకి తీసుకొచ్చామన్నారు. ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజల కోసమేనని మోడీ సృష్టం చేశారు. అది ట్రిపుల్ తలాఖ్ అయినా లేక జమ్మూకశ్మీర్ విషయంలోనైనా లేక ఆర్థికవ్యవస్థను బలోపేతం చేయడం ఇలా ఏదైనా ప్రజల ఆలోచనలకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకుంటున్నట్లు మోడీ తెలిపారు.