పెట్రో బాంబు : లీటర్ పెట్రోల్‌పై రూ.10 పెంపు

  • Published By: veegamteam ,Published On : April 24, 2019 / 01:39 AM IST
పెట్రో బాంబు : లీటర్ పెట్రోల్‌పై రూ.10 పెంపు

దేశంలో ఇంధన కొరత ఏర్పడనుందా. పెట్రోల్ ధరలు పెరగనున్నాయా. మే 23వ తేదీ తర్వాత లీటర్ పెట్రోల్ పై రూ.10 పెంచనున్నారా. అంటే అవుననే అంటున్నారు కాంగ్రెస్ నేతలు. జనాల నెత్తిన పెట్రో బాంబు పేలడం ఖాయమని చెబుతున్నారు. ఎన్నికల రిజల్ట్స్ వచ్చే మే 23వ తేదీన పెట్రో ధరలు అమాంతం ప్రజలపై రుద్దడం ఖాయమని వారంటున్నారు. అప్పటివరకు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచొద్దని ఆయిల్ కంపెనీలను ప్రధాని మోడీ ఆదేశించారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.

మే 23వ తేదీ సాయంత్రంకల్లా పెట్రోల్, డీజిల్ ధరలను రూ.5 నుంచి రూ.10 వరకూ పెంచడానికి సన్నాహాలు జరుగుతున్నాయని, ఈ విషయం మాత్రం దేశ ప్రజలకు చెప్పకుండా దాచిపెడుతున్నారని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా ట్వీట్‌ చేశారు. దేశ చమురు అవసరాలు, భద్రతపై ప్రధాని మోడీ మౌన ప్రేక్షకుడిలా ఎందుకు ఉండిపోతున్నారని ఆయన ప్రశ్నించారు.

ఇరాన్ నుంచి చమురు దిగుమతులు నిలిపేయకుంటే ఆంక్షలు విధిస్తామని భారత్‌ సహా పలు దేశాలను అమెరికా హెచ్చరించింది. దీంతో ఇరాన్ నుంచి చమురు దిగుమతులు ఆగిపోనున్నాయి. అమెరికా ఆంక్షలతో ప్రపంచ మార్కెట్ లో క్రూడాయిల్ ధరలు అమాంతం పెరిగాయి. భారత్ లోనూ పెట్రోల్ ధరలు పెంచాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికిప్పుడు కాకుంండా ఎన్నికల ఫలితాలు వెలువడే మే 23వరకూ ఓపిక పట్టాలని ఆయిల్ కంపెనీలను మోడీ కోరినట్టు కాంగ్రెస్ తెలిపింది.

”తన సాహసాలను ప్రతిరోజూ కథలు కథలుగా చెప్పుకునే మోడీజీ ఎందుకు మౌనంగా ఉండిపోయారు. ప్రజలను మభ్యపెట్టి ఓట్లు సొంతం చేసుకునేందుకే ఆయన పెట్రో ఆంక్షలు, ధరలపై నోరు మెదపడం లేదు. మే 23 వరకూ ధరలు పెంచొద్దంటూ ఆయిల్ కంపెనీలను ఆదేశించారు” అని రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా ట్వీట్‌ చేశారు. మే 23న దేశవ్యాప్తంగా లోక్‌సభ, కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ, ఉపఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.