VC Jagdeep Dhankar: పార్లమెంట్ కాదు, రాజ్యాంగం సుప్రీం.. ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్కర్ వ్యాఖ్యలపై మండిపడ్డ కాంగ్రెస్
రాజ్యసభ చైర్మన్ చేసిన వ్యాఖ్యలు ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు. దేశంలో పార్లమెంటే సుప్రీం అని ఆయన అన్నారు. పార్లమెంట్ కాదు రాజ్యాంగం ఈ దేశానికి సుప్రీం అని గుర్తు పెట్టుకోవాలి. రాజ్యాంగంలో సవరణలు చేసే అధికారం పార్లమెంటుకు ఉన్నప్పటికీ, దాన్ని ప్రాథమిక రూపం మాత్రం చెరపకుండా చూసుకోవాలి. అది రాజ్యాంగ పాలకుడైన ఆయన బాధ్యత

VC Jagdeep Dhankar: చట్టాల రూపకల్పనలో న్యాయస్థానం జోక్యం తగదని, దేశంలో పార్లమెంటే సుప్రీం అంటూ ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్కర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో మండిపడింది. పార్లమెంట్ కాదు, రాజ్యాంగమే ఈ దేశంలో సుప్రీం అంటూ ఉపరాష్ట్రపతి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చింది. బుధవారం జగ్దీప్ ధన్కర్ చేసిన వ్యాఖ్యలను ఊటంకిస్తూ కాంగ్రెస్ అగ్రనేతలు విమర్శలు గుప్పించారు.
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందిస్తూ ‘‘విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్లను ఉపయోగించి రాజ్యాంగ విలువల్ని, ప్రజాస్వామ్యాన్ని కాలరాసేందుకు భారతీయ జనతా పార్టీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. బీజేపీకి గవర్నర్లు కార్యకర్తలుగా మారారు. దేశ సమాఖ్య స్ఫూర్తిపై కొందరు గవర్నర్లు దాడి చేస్తున్న ఘటనలు మనం చూస్తేనే ఉన్నాం. ఉప రాష్ట్రపతి సైతం రాజ్యాంగాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారు. గవర్నర్ అయినా, ఉప రాష్ట్రపతి అయినా రాజ్యాంగానికి అనుగుణంగా నడుచుకోవాలి’’ అని అన్నారు.
ఇక కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం స్పందిస్తూ ‘‘రాజ్యసభ చైర్మన్ చేసిన వ్యాఖ్యలు ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు. దేశంలో పార్లమెంటే సుప్రీం అని ఆయన అన్నారు. పార్లమెంట్ కాదు రాజ్యాంగం ఈ దేశానికి సుప్రీం అని గుర్తు పెట్టుకోవాలి. రాజ్యాంగంలో సవరణలు చేసే అధికారం పార్లమెంటుకు ఉన్నప్పటికీ, దాన్ని ప్రాథమిక రూపం మాత్రం చెరపకుండా చూసుకోవాలి. అది రాజ్యాంగ పాలకుడైన ఆయన బాధ్యత’’ అని అన్నారు. ఇక మరో సీనియర్ నేత జైరాం రమేష్ స్పందిస్తూ 1973లో కేశవానంద భారతి కేసుపై ఉప రాష్ట్రపతి చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. ‘‘8 ఏళ్లు పార్లమెంటు సభ్యుడిగా ఉన్నాను. ఇన్నేళ్లలో ఒక్కరు కూడా కేశవానంద భారతి కేసు మీద అభ్యంతరం చెప్పలేదు. బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ కూడా సుప్రీం తీర్పును సమర్ధించారు. కానీ ఉప రాష్ట్రపతి వ్యాఖ్యలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ఆయన న్యాయవ్యవస్థపై దాడికి దిగారు’’ అని అన్నారు.
సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించిన కొలీజియం వ్యవస్థపై కొద్ది రోజుల క్రితం ఏకంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎదుటే ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్కర్ విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. తాజాగా కొన్ని అంశాల్లో న్యాయవ్యవస్థ జోక్యంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు ఇది ప్రజాస్వామ్య దేశమా అనే ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టం అంటూ ఆయన తన విముఖతను వ్యక్తం చేశారు. 1973లో కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు నిర్ణయాన్ని ఊటంకిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
రాజస్థాన్ రాజధాని జైపూర్లో జరిగిన 83వ ఆల్-ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్‌లో మొదటిసారి ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్కర్ ప్రసంగించారు. ఈ సమావేశంలో పార్లమెంట్, న్యాయవ్యవస్థ మధ్య ఉండే అంతరాన్ని వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకు ఉందని ఆయన అన్నారు. పార్లమెంటరీ సార్వభౌమాధికారం, స్వయంప్రతిపత్తి విషయంలో రాజీపడటం కానీ, అనుమతి పొందాల్సిన అవసరం కానీ లేదని అన్నారు. అలా చేయాల్సి వస్తే అది ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదమని అన్నారు.
ఏ వ్యవస్థ పని ఆ వ్యవస్థ చేయాలని ఆయన పరోక్షంగా అన్నారు. న్యాయపరమైన ఉత్తర్వులు రాసే అధికారం శాసనసభకు ఎలా లేదో, అలాగే చట్టాలు చేసే అధికారం కూడా న్యాయవ్యవస్థకు ఉండదని అన్నారు. ఈయన ప్రసంగానికి ముందు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా చేసిన ప్రసంగంలో న్యాయశాఖ, శాసనసభ, కార్యనిర్వాహక శాఖలు ఒకరినొకరు గౌరవించుకోవాలని అన్నారు. న్యాయవ్యవస్థ అధికారాలను చట్టసభలు ఎప్పుడూ గౌరవిస్తాయని, రాజ్యాంగం ద్వారా నిర్దేశించిన అధికారాల విభజనను న్యాయవ్యవస్థ అనుసరించాలని భావిస్తున్నట్లు చెప్పారు. మూడు శాఖలు పరస్పర విశ్వాసం, సామరస్యంతో పని చేయాలని ఓం బిర్లా అన్నారు.