రాముడు అందరివాడు : అయోధ్య కార్యక్రమంపై ఎట్టకేలకు మౌనం వీడిన కాంగ్రెస్

  • Published By: venkaiahnaidu ,Published On : August 4, 2020 / 04:02 PM IST
రాముడు అందరివాడు : అయోధ్య కార్యక్రమంపై ఎట్టకేలకు మౌనం వీడిన కాంగ్రెస్

అయోధ్యపై ఎట్టకేలకు కాంగ్రెస్ మౌనం వీడింది. రామాలయ భూమిపూజ విషయంలో ఇప్పటివరకు మౌనం పాటిస్తూ వచ్చిన కాంగ్రెస్ పై సర్వత్రా విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ యువనేత ప్రియాంకా గాంధీ ఇవాళ స్పందించారు. అయోధ్యలో రామాలయ భూమిపూజకు సరిగ్గా ఒక్కరోజు ముందు ఈ విషయంపై కాంగ్రెస్ యువనేత ప్రియాంక గాంధీ ట్విట్టర్ వేదికగా స్పందించారు.



అయోధ్య అంశంపై పార్టీ వైఖరికి సంకేతంగా రాముడు అందరివాడని, అందరి హృదయాల్లో రాముడు ఉన్నాడంటూ మంగళవారం ప్రియాంక ట్వీట్‌ చేశారు. అయోధ్యలోని రామజన్మభూమిలో బుధవారం జరిగే భూమిపూజ కార్యక్రమం జాతీయ ఐక్యతను చాటే సాంస్కృతిక సమ్మేళనంగా నిలిచిపోతుందని ఆమె వ్యాఖ్యానించారు.



నిరాడంబరత, ధైర్యం, సహనం, త్యాగం, అంకితభావాలకు ప్రతీక అయిన రాముడు అందరితో ఉంటాడని ప్రియాంక ట్వీట్‌ చేశారు. కాగా, అయోధ్యలో బుధవారం జరగనున్న రామ మందిర నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమానికి కాంగ్రెస్ నేతల‌కు ఆహ్వానం అందలేదు. ఈ నేపథ్యంలో ప్రియాంక గాంధీ ఈ ట్వీట్లు చేయడం గమనార్హం.