రిజర్వేషన్ల రగడ : బీజేపీది మనువాద ప్రభుత్వం – కాంగ్రెస్

  • Published By: madhu ,Published On : February 10, 2020 / 06:44 PM IST
రిజర్వేషన్ల రగడ : బీజేపీది మనువాద ప్రభుత్వం – కాంగ్రెస్

రిజర్వేషన్ల అంశం పార్లమెంట్‌ను కుదిపేసింది. రిజర్వేషన్ల అమలును కేంద్రం నీరుగారుస్తోందని కాంగ్రెస్‌ ధ్వజమెత్తింది. బీజేపీది మనువాది ప్రభుత్వమని ఆరోపించింది. సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయంతో ప్రభుత్వానికి సంబంధం లేదని కేంద్రం స్పష్టం చేసింది.

ఉద్యోగ నియామకాలు, పదోన్నతుల్లో రిజర్వేషన్లు ప్రాథమిక హక్కు కాదంటూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై 2020, ఫిబ్రవరి 10వ తేదీ సోమవారం లోక్‌సభ అట్టుడికింది. సభ ప్రారంభం కాగానే ఈ అంశంపై చర్చ చేపట్టాలంటూ కాంగ్రెస్ పట్టుబట్టింది. మనువాదంపై విశ్వాసంతోనే ఈ ప్రభుత్వం రిజర్వేషన్లను నీరు గారుస్తోందని ఆరోపించింది.

సుప్రీం తీర్పును సమీక్షించాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్ల అంశంపై పార్లమెంట్‌లో రగడ ఎక్కువ కావడంతో ప్రభుత్వం తరపున సామాజిక న్యాయశాఖ మంత్రి వచ్చి సభకు సమాధానం చెబుతారని….అంతవరకు ఓపిక పట్టాలని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ సూచించారు. 

ఉద్యోగాల పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించవద్దన్న నిర్ణయంతో తమకు సంబంధం లేదని  కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి థావర్‌ చంద్‌ గెహ్లాట్‌ స్పష్టం చేశారు. 2012లో ఉత్తరాఖండ్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌  ప్రభుత్వమే ఈ నిర్ణయం తీసుకుందన్నారు. ప్రభుత్వం తీరుకు నిరసనగా కాంగ్రెస్‌ సభ నుంచి వాకౌట్‌ చేసింది.

రిజర్వేషన్లు అంశాన్ని అటు రాజ్యసభలోనూ కాంగ్రెస్‌ సభ్యులు గులాంనబీ ఆజాద్‌ ప్రస్తావించగా..ఛైర్మన్ చర్చకు అంగీకరించలేదు. మరోవైపు సుప్రీంకోర్టు తీర్పును ఎన్డీయే భాగస్వామ్య పార్టీలు లోక్‌జనశక్తి , అప్నాదళ్‌  కూడా వ్యతిరేకించాయి.

పార్లమెంట్‌లోఇంత దుమారం రేగడానికి కారణం.. షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగల వారికి పదోన్నతుల్లో రిజర్వేషన్లను అమలు చేయాల్సి న అవసరం లేదంటూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పడమే. ప్రమోషన్లలో రిజర్వేషన్లను అమలు చేయాలా..వద్దా అన్న నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయమని కోర్టు స్పష్టం చేసింది. 

2012 సెప్టెంబర్‌ 5న ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు అందులో పేర్కొనలేదు. ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేయగా, ఉత్తరాఖండ్‌ హైకోర్టు ప్రభుత్వ నోటిఫికేషన్‌ను కొట్టివేసింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు – ఉత్తరాఖండ్‌ ప్రభుత్వ నోటిఫికేషన్‌ను సమర్ధించింది. హైకోర్టు ఆదేశాలను కొట్టివేసింది.