డీకేకు బెంగుళూరులో ఘన స్వాగతం

  • Published By: chvmurthy ,Published On : October 26, 2019 / 03:59 PM IST
డీకేకు బెంగుళూరులో ఘన స్వాగతం

మనీ ల్యాండరింగ్ కేసులో అరెస్టై తీహార్ జైలు నుంచి విడుదలైన కర్ణాటక కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ కు బెంగుళూరులోకార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.  అక్టోబరు 26న బెంగుళూరు విమానాశ్రయానికి   చేరుకున్న డీకేకు  కాంగ్రెస్ పార్టీ  శ్రేణులు పూల మాలలతో పెద్ద ఎత్తున స్వాగతం​ పలికారు. 250 కేజీల యాపిల్‌ పండ్లతో తయారు చేసిన భారీ దండను క్రేన్‌ సహాయంతో గాల్లోకి లేపి ఆయనకు అలంకరించారు. పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి  ఆనందం వ్యక్తం చేశారు. పూలతో ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో ఊరేగింపుగా కేపీసీసీ కార్యాలయం వరకు తీసుకెళ్లారు. అక్కడ తన మద్దతుదారులను ఉద్దేశించి శివకుమార్‌ ప్రసంగించారు.

కర్ణాటకలో స్పెషల్ యాపిల్ దండ నయా ట్రెండ్
యాపిల్స్‌ దండలతో స్వాగతం పలకడం ప్రస్తుతం  కర్ణాటకలో ట్రెండ్‌గా మారింది. గతంలో మాజీ ప్రధాని దేవెగౌడ, మాజీ ముఖ్యమంత్రులు సిద్ధరామయ్య, కుమారస్వామిలతో పాటు పలువురు అగ్రనేతలకు ఆయా పార్టీ కార్యకర్తలు అభిమానులు భారీ యాపిల్‌ దండలతో స్వాగతం చెప్పారు. బాదం పప్పు దండలతో కూడా రాజకీయ నాయకులను స్వాగతించడం కన్నడిగులు మొదలుపెట్టారు.

మనీ ల్యాండరింగ్ కేసుకు సంబంధించి ఈడీ అధికారులు సెప్టెంబరు 3న డీకే ని అరెస్టు చేశారు. కాంగ్రెస్ పార్టీ లో డీకే ట్రబుల్ షూటర్‌గా పేరు పొందారు. ఢిల్లీ హై కోర్టు ఆయనకు బుధవారం అక్టోబరు  23న షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. వక్కలింగ సామాజిక వర్గానికి చెందిన 57 ఏళ్ల శివకుమార్ కు  బెంగళూరు రూరల్‌, రామనగర, మాండ్య ప్రాంతాల్లో గట్టి పట్టుంది. ఆయనను ఈడీ అధికారులు అరెస్ట్‌ చేసినప్పుడు ఈ ప్రాంతాల్లలో ఆయన సామాజిక వర్గానికి చెందిన వారు  పెద్ద ఎత్తున ర్యాలీలు, ధర్నాలు చేసారు.