కాంగ్రెస్ లో జీ-23 టెన్షన్..”జమ్మూ సమావేశం” పార్టీలో చీలికలు తెస్తుందా?

కాంగ్రెస్ లో జీ-23 టెన్షన్..”జమ్మూ సమావేశం” పార్టీలో చీలికలు తెస్తుందా?

CONGRESS కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజురోజుకూ దయనీయంగా మారిపోతోంది. గతేడాది.. పార్టీలో సమూల సంస్కరణలు కోరుతూ గళమెత్తిన 23 మంది(జీ-23) తిరుగుబాటు నేతల్లో కొందరు శనివారం జమ్మూలో ప్రత్యేక సమావేశం నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామాన్ని… పార్టీ హైకమాండ్​పై తాజా తిరుగుబాటుగా పరిగణించొచ్చా? హస్తం పార్టీ రెండుగా మారడానికి జమ్ము కశ్మీర్ వేదిక అవుతోందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ అధిష్ఠానంపై తిరుగుబాటు చేసేందుకు ప్రత్యేక కూటమి ఏర్పాటు చేసుకున్నారని పరోక్షంగా సంకేతాలు ఇస్తున్నారనేందుకు ఇదో సూచన అని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.

దాదాపు ఏడాది తర్వాత కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ తన స్వస్థలమైన జమ్ముకశ్మీర్​లో పర్యటించారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం మధ్యాహ్నాం జమ్మూకి చేరుకున్న ఆజాద్ కు స్థానికంగా ఘన స్వాగతం లభించింది. పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు,నాయకులు ఆజాద్ కు ఘనస్వాగతం పలికారు. అయితే ఆజాద్.. తనతో పాటు కాంగ్రెస్ అధిష్ఠానానికి లేఖ రాసిన కొంతమందిని వెంట తీసుకెళ్లారు. శనివారం జమ్మూలో నిర్వహించిన “శాంతి సమ్మేళన్”కార్యక్రమానికి… జీ23 బృందంలోని కొందరు ముఖ్య సభ్యులు హాజరయ్యారు. గాంధీ గ్లోబల్‌ ఫ్యామిలీ అనే ఓ ప్రభుత్వేతర సంస్థ ఆధ్వర్యంలో గులాంనబీ ఆజాద్‌ ఈ ‘శాంతి సమ్మేళనాన్ని’ ఏర్పాటు చేశారు. ఆనంద్ శర్మ, కపిల్ సిబల్, రాజ్‌ బబ్బర్‌,భూపిందర్ హుడా, మనీశ్ తివారీ, వివేక్ తన్ఖా.. ఆజాద్​తో పాటు ఉన్నారు. ఈ వేదికగా అసంతృప్తి నేతలందరూ అధిష్ఠానానికి గట్టి సందేశాన్ని పంపడం మాత్రమే కాకుండా కాంగ్రెస్ కొత్త జనరేషన్ కు సంబంధించి సలహాలను ఇచ్చారు.

జీ-23 గ్రూప్ లో ముఖ్య నాయకుడైన ఆనంద్ శర్మ జమ్మూ సభలో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ గత వైభవాన్ని చూశాం. గడిచిన దశాబ్దాకాలంగా కాంగ్రెస్ బలహీనమవుతూ వచ్చింది. ఇంకా బలహీనం కావడాన్ని మేం చూడలేం. మాకు వయసు పైబడుతోంది. ఇక కొత్తతరం పార్టీకి అనుసంధానం కావాలి అని ఆనంద్‌ శర్మ అన్నారు. తమపై పార్టీలోనే విమర్శలు గుప్పిస్తున్న వారికి దీటుగా బదులిస్తూ.. మేం ఏదో ఆషామాషీగా పార్టీలోకి రాలేదు, కొనసాగలేదు. దొడ్డిదారిన వచ్చిన వాళ్లం కాదు. విద్యార్థి, యువ ఉద్యమాల్లో పాల్గొన్నవాళ్లం. మేం కాంగ్రె్‌సవాదులమా కాదా అని చెప్పే హక్కు ఎవ్వరికీ లేదు అని పేర్కొన్నారు. మేము పార్టీని బలోపేతం చేస్తాం. బలోపేతం,కాంగ్రెస్ ఐక్యమత్యాన్ని మేము నమ్ముతాము అని ఆనంద్ శర్మ పేర్కొన్నారు.

అసంతృప్త కాంగ్రెస్ నేతల్లో మరో ముఖ్య నేత కపిల్ సిబల్ మాట్లాడుతూ.. ఆజాద్ అనుభవాన్ని పార్టీ మరింతగా ఉపయోగించుకుంటే బాగుండేదన్నారు. ఆజాద్ రాజ్యసభ నుంచి పదవీ విరమణ చేసేందుకు పార్టీ అనుమతించాల్సింది కాదని అన్నారు. ప్రతి రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు సంబంధించి క్షేత్రస్థాయిలో వాస్తవిక పరిస్థితులు తెలిసిన కొద్దిమంది నేతల్లో ఆజాద్ ఒకరన్నారు. పార్లమెంట్ ను వదిలి ఆజాద్ వదిలివెళ్లిపోతున్నాడన్న విషయం తెలిసి తాము బాధపడ్డాం అని కపిల్ సిబల్ అన్నారు. పార్లమెంట్ నుంచి ఆాజద్ తాము వెళ్లిపోవాలనుకోవట్లేదంటూ ఆాజద్ పై ప్రశంసలు కురిపించారు కపిల్ సిబల్. కాంగ్రెస్ లో ఓ ఇంజనీర్ పాత్రని ఆజాద్ పోషించారన్నారు. గత కొన్నేళ్లుగా ప్రతిసారీ తమిళనాడులో డీఎంకే- కాంగ్రెస్‌ పొత్తు, సీట్ల సర్దుబాటును ఆజాదే చూస్తూ వచ్చారు. అయితే విశేషానుభవం ఉన్న ఆజాద్‌ను ఇప్పుడు ఎందుకు పట్టించుకోరని కపిల్‌ సిబల్ హైకమాండ్‌ను ప్రశ్నించారు. అందరూ మమ్మల్ని జీ-23 అంటున్నారు. నేను దాన్ని గాంధీ-23 అంటాను. మహాత్మాగాంధీ సంకల్పం, ఆలోచనలతో ఈ దేశ రాజ్యాంగం, చట్టాలు రూపుదిద్దుకున్నాయి. కాంగ్రెస్‌ బలంగా ఉండాలని జీ-23 కోరుకుంటోంని రాజ్‌బబ్బర్‌ అన్నారు.

ఇక, రాహుల్ గాంధీ ఇటీవల తన కేరళ పర్యటన సందర్భంగా కేరళ ప్రజలను ఉత్తరాది ఓటర్లతో పోల్చుతూ చేసిన ఉత్తర-దక్షిణ వ్యాఖ్యలపై కూడా ఆనందర్ శర్మ,కపిల్ సిబల్ ప్రశ్నలను లేవనెత్తారు. రాహుల్ చేసిన ‘ఉత్తర-దక్షణ భారత దేశ’ వ్యాఖ్యలను కపిల్ సిబల్, ఆనంద్ శర్మ పరోక్షంగా తప్పుబట్టారు. అసెంబ్లీ ఎన్నికలపై వీటి ప్రభావం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా,ఇటీవల కేరళకు వెళ్లిన రాహుల్..ఇక్కడికి రావడం తనకు రిఫ్రెషింగ్‌గా ఉందన్నారు. ఇక్కడి ప్రజలు సమస్యలపై ఎక్కువ దృష్టి సారిస్తారని రాహుల్ చెప్పారు. ఈ ప్రాంత ప్రజలు రాజకీయాలను చూసే విధానం వేరుగా ఉంటుందన్నారు. ఉత్తర- దక్షిణ భారతావని మధ్య అంతరాన్ని వివరిస్తూ రాహుల్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై రేగిన దుమారాన్ని ఆజాద్‌ తగ్గించే యత్నం చేశారు. జమ్మూ కశ్మీర్‌, లడఖ్‌.. దేశంలోని ఏ ప్రాంతమైనా కావొచ్చు. కాంగ్రెస్‌ పార్టీ అన్ని ప్రాంతాల వారిని సమానంగా గౌరవిస్తుందని ఆజాద్‌ వివరణ ఇచ్చారు. విశేషమేమంటే జమ్మూ సమావేశానికి హాజరైనవారంతా ఉత్తరాదికి చెందిన కాంగ్రెస్‌ నేతలే.

రెబల్స్ మీటింగ్ పై స్పందించిన కాంగ్రెస్

రెబెల్స్‌ కశ్మీర్ సమావేశాన్ని సానుకూలంగానే స్వీకరించింది కాంగ్రెస్. ఈ విషయంపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వీ పార్టీ వైఖరిని వెల్లడించారు. జమ్ములో ఉన్న సీనియర్ నేతలందరూ గౌరవనీయులేనని స్పష్టం చేశారు. పార్టీకి వారెంతో కీలకమని చెప్పారు. పార్టీలో వారు ఉండటం తమకు గర్వకారణమని, పార్టీని చూసి వారు కూడా గర్వపడుతున్నారని భావిస్తున్నామని అన్నారు. కాంగ్రెస్ కుటుంబంలో వారూ ఒకరని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా గులాం నబీ ఆజాద్ సేవలను గుర్తు చేశారు. ఆజాద్ ఎప్పుడూ ఫిర్యాదులు చేయలేదు. కొందరు ఇస్తెమాల్(వాడుకోవడం) అనే పదాన్ని వాడుతున్నారు. ఈ పదాన్ని ఉపయోగించేవారికి సమకాలీన కాంగ్రెస్ చరిత్ర తెలియకపోవచ్చు. ఏడు దఫాలుగా కాంగ్రెస్ జెండాను ఎగురవేసిన ఆజాద్​ను చూసి గర్విస్తున్నాం. ఆయన ఓ విజయవంతమైన ముఖ్యమంత్రి. ఇందిరాగాంధీ కాలం నుంచి దాదాపు మూడు దశాబ్దాల పాటు కేంద్ర మంత్రిగా గౌరవం అందుకున్నారని అన్నారు. జీ23 సభ్యులు నిర్వహించిన సమావేశంపై పార్టీ సానుకూలంగానే స్పందించినప్పటికీ.. పలువురు నేతల నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి. ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతున్న వేళ ఇలాంటి బహిరంగ ప్రకటనలు చేయాల్సిన అవసరం ఏముందని పార్టీ నేత తెహ్సీన్ పూనెవాలా ప్రశ్నించారు. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో వీరు ఎందుకు ప్రచారాలు చేయడం లేదని నిలదీశారు.

రెబల్స్ కి ఇందుకే కోపం వచ్చిందా?
కాగా, రాజ్యసభ సభ్యుడిగా పదవీ విరమణ చేసిన సమయంలో గులాం నబీ ఆజాద్​ను ఉద్దేశించి మోదీ చేసిన భావోద్వేగ ప్రసంగం, ఆజాద్​కు కాంగ్రెస్ మరోసారి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వకపోవడం, ఆనంద్ శర్మను కాదని మల్లికార్జున ఖర్గేకు రాజ్యసభలో విపక్షనేత హోదా ఇవ్వడం వంటి కారణాలు జీ23 నేతల సెంటిమెంట్​ను దెబ్బతీసినట్లు తెలుస్తోంది. ఎగువసభలో ఉప ప్రతిపక్ష నేతగా ఉన్న తనకు ఈ పదవి ఇవ్వనందువల్ల ఆనంద్ శర్మ పలువురి వద్ద అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సన్నద్ధత గురించి తమను పార్టీ సంప్రదించకపోవడంపైనా ఈ సీనియర్ నేతలు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. తమిళనాడులో సీట్ల పంపకాల విషయంలో డీఎంకేతో సన్నిహిత సంబంధాలు ఉన్న ఆజాద్​ను కాదని రణదీప్ సింగ్ సుర్జేవాలాకు బాధ్యతలు అప్పగించడంపైనా విభేదాలు నెలకొన్నాయి.