పౌరసత్వ సవరణ చట్టానికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా

  • Published By: chvmurthy ,Published On : December 21, 2019 / 04:20 PM IST
పౌరసత్వ సవరణ చట్టానికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు  వెల్లువెత్తుతున్నాయి. రోజు రోజుకూ ఆందోళనలు హింసాత్మకంగా మారుతున్నాయి. సీఏఏ, ఎన్‌ఆర్‌సీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆదివారం  డిసెంబర్ 22న రాజ్‌ఘాట్ వద్ద ధర్నా నిర్వహిస్తోంది.  ఈ ధర్నాలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీతో సహా  పార్టీకి చెందిన పలువురు ముఖ్య నేతలంతా ఈ ధర్నాలో పాల్గొంటున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ ఈ ధర్నా జరుగుతుంది. 

శనివారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, పార్టీ ప్రధాన కార్యదర్శులు ప్రియాంక గాంధీ వాద్రా, జ్యోతిరాదిత్య సింధియా తదితరులు సమావేశమై రాజ్‌ఘాట్ వద్ద ఆదివారం ధర్నా చేపట్టాలనే నిర్ణయం తీసుకున్నారు. సోనియాగాంధీ సైతం శుక్రవారం బీజేపీపై విమర్శలు సంధిస్తూ, విద్యార్థులు, పౌరులకు సంఘీభావం తెలిపారు. సీఏఏపై పార్టీకి అభ్యంతరాలున్నాయని, దేశవ్యాప్తంగా శాంతియుతంగా జరిగే ఎలాంటి ప్రదర్శనలకైనా తమ మద్దతు ఉంటుందని ఓ వీడియో సందేశంలో సోనియాగాంధీ పేర్కొన్నారు.

కాగా ……పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా శుక్రవారం డిసెంబర్20న ఓల్డ్ ఢిల్లీలో భారీ నిరసన ప్రదర్శనకు దిగిన భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్‌కు తీస్ హజారీ కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఈ చట్టానికి వ్యతిరేకంగా దాదాపు ఆరు రాష్ట్రాల్లో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. నిరసనకారులు హింసాత్మక సంఘటనలకు పాల్పడుతున్నారు.  సుమారు రూ.88 కోట్లకు పైగా రైల్వేలకు నష్టం జరిగింది. ఉత్తర ప్రదేశ్‌లో జరిగిన హింసలో సుమారు 10 మంది మరణించారు

కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కలిగించే ఆర్టికల్‌ 370 రద్దు, ముస్లిం మహిళల కోసం ట్రిపుల్‌ తలాఖ్ తదితర బిల్లులను ఆమోదించిన తర్వాత  కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పౌరసత్వ చట్టం- 1955కు కొన్ని సవరణలు ప్రతిపాదిస్తూ బిల్లును రూపొందించింది. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పార్లమెంటులో బిల్లు  ప్రవేశపెట్టగా అనేక చర్చల అనంతరం బిల్లు లోక్‌సభ, రాజ్యసభ సభ్యుల ఆమోదం పొందింది.

పౌరసత్వ సవరణ బిల్లుపై  జరిగిన చర్చ సందర్భంగా… ముస్లింలను ఈ బిల్లు నుంచి మినహాయించడం పట్ల ప్రతిపక్ష సభ్యులు విమర్శలు చేశారు.  ఇందుకు స్పందించిన  హోంమంత్రి అమిత్‌ షా.. ఇతర దేశాల నుంచి వచ్చి భారత పౌరసత్వం పొందాలనుకునే ముస్లింలు ప్రస్తుతమున్న చట్టాల ప్రకారం దరఖాస్తు చేసుకునే అవకాశముందని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 566 మంది ముస్లింలు అలా పౌరసత్వం పొందారన్నారు. పాక్, బంగ్లా, అఫ్గాన్‌ల్లో మత వివక్షను ఎదుర్కొన్న మైనారిటీలకు భారతీయ పౌరసత్వం కల్పించడమే ఈ బిల్లు లక్ష్యం కాబట్టి, ఆ దేశాల్లో మెజారిటీలైన ముస్లింలను బిల్లులో చేర్చలేదని అమిత్ షా వివరణ ఇచ్చారు.