బెంగాల్ ఎన్నికల ప్రచారానికి G-23నేతలను దూరం పెట్టిన కాంగ్రెస్

బెంగాల్ ఎన్నికల ప్రచారానికి G-23నేతలను దూరం పెట్టిన కాంగ్రెస్

Congress Keeps G 23 Leaders Out Of Bengal Polls Campaigning

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ.. స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల విడుదల చేసింది. మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా 30 మందితో కూడిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాను కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ కేసీ వేణుగోపాల్ ఇవాళ అధికారికంగా విడుదల చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహా.. లోక్‌సభా, రాజ్యసభా కాంగ్రెస్ నేతలు, సీనియర్ కాంగ్రెస్ నేతలు స్టార్ క్యాంపెయినర్ల లిస్ట్ లో ఉన్నారు.

అయితే,ఇవాళ కాంగ్రెస్ విడుదల చేసిన వెస్ట్ బెంగాల్ స్టార్ క్యాంపెయినర్ల లిస్ట్ లో.. గులాంనబీ ఆజాద్,ఆనంద్ శర్మ,ఇతర G23(గతేడాది పార్టీలో వ్యవస్థాపక సంస్కరణలు కోరుతూ అధిష్ఠానానికి లేఖలు రాసినవాళ్లు)లీడర్లు పేర్లు లేకపోవడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. గడిచిన కొన్ని దశాబ్దాలుగా పార్టీ క్రమంగా బలహీనపడుతోందని,పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరముందని ఇటీవల కాలంలో G-23 లీడర్లు గా పేరుపొందిన 23మంది సీనియర్ కాంగ్రెస్ నేతలు బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తున్నారు.

ఇటీవల జమ్మూలో జీ-23లో ముఖ్యమైన పలువురు కాంగ్రెస్ నేతలు ప్రత్యేకంగా సమావేశం కూడా పెట్టుకున్నారు. జమ్మూ వేదికగా పార్టీ వ్యవహారశైలి,బెంగాల్,అసోంలో ఎన్నికల పొత్తులకు సంబంధించి విమర్శలు గుప్పించారు. గాంధీ-నెహ్రూ సిద్దాంతాలకు వ్యతిరేకంగా పార్టీ ముందుకెళ్తుందని జీ-23నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే పార్టీపై బహిరంగంగా విమర్శలు గుప్పించడంతో పాటు,బీజేపీపై ప్రశంసలు కురిపిస్తున్న సీనియర్ నేతలను బెంగాల్ ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ దూరంగా పెట్టడం ఇప్పుడు కీలకంగా మారింది.

బెంగాల్ లో..లెఫ్ట్ పార్టీలు, ఇండియన్ సెక్యూలర్ పార్టీతో కలిసి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగుతోంది కాంగ్రెస్. మార్చి 27 నుంచి ఏప్రిల్ 29 వరకు ఎనిమిది దశల్లో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలు మే 2న విడుదల కానున్నాయి.

Image