ఢిల్లీ కాంగ్రెస్ నాయకుల రాజీనామా…మొత్తం షీలా దీక్షిత్ తప్పే

  • Published By: venkaiahnaidu ,Published On : February 12, 2020 / 09:54 AM IST
ఢిల్లీ కాంగ్రెస్ నాయకుల రాజీనామా…మొత్తం షీలా దీక్షిత్ తప్పే

ఢిల్లీ కాంగ్రెస్ లో రాజీనామాల పర్వం మొదలైంది. దశాబ్దాలపాటు ఏకఛత్రాధిపత్యంగా ఢిల్లీని పాలించిన కాంగ్రెస్ వరుసగా రెండుసార్లు ఆమ్ ఆద్మీ పార్టీ చేతుల్లో చావుదెబ్బ తినింది. 2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయిన కాంగ్రెస్,2020లో జరిగిన ఎన్నికల్లో కూడా ఒక్క సీటు కూడా దక్కించుకోలేక ఆప్ ప్రభంజనంలో కనుమరుగైపోయింది. ఈ సమయంలో ఢిల్లీ కాంగ్రెస్ ఇన్ ఛార్జ్, సీనియర్ కాంగ్రెస్ లీడర్ పీసీ చాకో మంగళవారం దివంగత షీలాదీక్షిత్ పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమవడంతో ఆయన పార్టీకి రాజీనామా చేయనున్నట్లు తెలిపారు.

2013లో షీలాదీక్షిత్ ఢిల్లీ సీఎంగా ఉన్న సమయంలోనే పార్టీ పతనం ప్రారంభమైందని,కొత్త పార్టీ ఉద్భవించిందని,మొత్తం కాంగ్రెస్ ఓటు బ్యాంకును ఆప్ ఎత్తుకెళ్లిపోయిందని,ఆ ఓటు బ్యాంకును కాంగ్రెస్ తిరిగి పొందలేదని,అది ఇప్పటికీ ఆప్ తోనే ఉందని పీసీ చాకో మంగళవారం మీడియాతో అన్నారు. అయితే చాకో వ్యాఖ్యలపై సొంతపార్టీ నేతల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి.

మహారాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ లీడర్ మిలింద్ డియోరా మొదటగా చాకో వ్యాఖ్యలను విమర్శించారు. షీలాదీక్షిత్ చెప్పుకోదగిన పొలిటీషన్ మరియు అడ్మినిస్ట్రేటర్ అని,సీఎంగా ఆమె ఉన్న సమయంలో ఢిల్లీ పురోగతి సాధించిందని,కాంగ్రెస్ అంతకుముందుకన్నా చాలా బలమైన శక్తిగా మారిందని,అలాంటిది ఆమె మరణం తర్వాత ఆమెను ఢిల్లీలో పార్టీ పతనానికి బాధ్యురాలిని చేస్తూ నిందించడం దురదృష్టకరమని డియోరా అన్నారు. షీలా దీక్షిత్ తన జీవితాన్నిఢిల్లీ ప్రజలకు,కాంగ్రెస్ కు అంకితం చేశారని మిలింద్ డియోరా తెలిపారు. షీలా దీక్షిత్ మూడుసార్లు వరుసగా ఢిల్లీ సీఎంగా పనిచేసిన విషయం తెలిసిందే. గతేడాది ఆమె అనారోగ్యంతో కన్నుమూసింది.

సొంత పార్టీ నుంచే తను చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తమవుతున్న సమయంలో ఇవాళ తన రాజీనామాను ఆఫర్ చేశారు పీసీ చాకో. అయితే పీసీ చాకోతోపాటుగా ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ సుభాష్ చోప్రా కూడా రాజీనామాను ప్రకటించారు. ఇక కాంగ్రెస్ లో రాజీనామాల పర్వం ఇంతటితో ముగుస్తుందా లేక ముందుకెళ్తుందా అన్నది చూడాలి. ఫిబ్రవరి-8,2020న జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 70స్థానాల్లో ఆప్ కు 62సీట్లు,బీజేపీ 8సీట్లలో విజయం సాధించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలువక పోగా 63స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు.