కాంగ్రెస్ నేత శివకుమార్ కు 10 రోజుల ఈడీ కస్టడీ

  • Published By: chvmurthy ,Published On : September 4, 2019 / 03:29 PM IST
కాంగ్రెస్ నేత శివకుమార్ కు 10 రోజుల ఈడీ కస్టడీ

బెంగళూరు : మనీ లాండరింగ్‌ కేసులో మంగళవారం సెప్టెంబర్ 3వ తేదీ సాయంత్రం అరెస్టయిన కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత డికె శివకుమార్‌ను 14 రోజుల పాటు తమ కస్టడీకీ  ఇవ్వాలని ఈడీ అధికారులు చేసిన విజ్ఞప్తిని ఢిల్లీ ట్రయల్‌ కోర్టు తోసిపుచ్చింది. ఈ కేసుకు సంబంధించి శివకుమార్‌ను10 రోజుల(సెప్టెంబర్‌ 13 వరకు) కస్టడీకి మాత్రమే అనుమతినిస్తూ ఈడీకి ఉత్తర్వులు జారీ చేసింది.

మంగళవారం రాత్రి అరెస్టు చేసినప్పుడు చాతీ నొప్పి వచ్చి, బీపీ, షుగర్‌ లెవల్స్‌ పడిపోవడంతో శివకుమార్ ను బెంగుళూరులోని ఆర్‌ఎల్‌ఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం ఈడీ అధికారులు శివకుమార్‌ను అక్కడినుంచి కోర్టుకు తరలించారు. తన కుటుంబ సభ్యులకు కలిసేందుకు శివకుమార్ కు కోర్టు అనుమతి ఇచ్చింది. ఏడాది క్రితం ఆదాయపన్ను అధికారులు శివకుమార్ ఇంట్లో దాడి చేసి రూ.8.9కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. 

కాంగ్రెస్‌ ట్రబుల్‌ షూటర్‌గా పేరు పొందిన డికె శివకుమార్‌ను మనీలాండరింగ్‌ కేసుకు సంబంధించి ఆగస్టు 30 నుంచి విచారిస్తున్నప్పటికీ,  సహకరించకపోవటంతో మరింత లోతుగా విచారించడానికే ఆయనను అరెస్టు చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు. శివకుమార్‌ అరెస్టును నిరసిస్తూ బుధవారం కర్నాటక కాంగ్రెస్‌ నేతలు  రాష్ట్ర వ్యాప్తంగా  బంద్‌  పాటించారు. బంద్ హింసాత్మకంగా మారింది. పలుచోట్ల ఆందోళనకారులు బస్సు అద్దాలను ద్వంసం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలను, కళాశాలలను బలవంతంగా మూసివేయించారు.