బీజేపీ నేత కారులో ఈవీఎం..అసోంలో కాంగ్రెస్ ఆందోళన

అసోంలో రెండో దశ పోలింగ్ ముగిసిన తర్వాత ఓ ఈవీఎంను బీజేపీ ఎమ్మెల్యే కృష్ణేండు పాల్‌ భార్య కారులో స్ట్రాంగ్ రూమ్ కి తరలించిన సంఘటనపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.

బీజేపీ నేత కారులో ఈవీఎం..అసోంలో కాంగ్రెస్ ఆందోళన

Congress Assam

Congress అసోంలో రెండో దశ పోలింగ్ ముగిసిన తర్వాత ఓ ఈవీఎంను బీజేపీ ఎమ్మెల్యే కృష్ణేండు పాల్‌ భార్య కారులో స్ట్రాంగ్ రూమ్ కి తరలించిన సంఘటనపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో శనివారం రాజధాని గువహాటిలో పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు,నేతలు ధర్నాలో పాల్గొని ఈసీ తీరుపై విమర్శలు గుప్పించారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత సుస్మిత దేవ్ మాట్లాడుతూ ..బీజేపీ అభ్యర్థులందరూ అక్రమ మార్గాలను ఆశ్రయిస్తున్నారు. ప్రజలు మావైపే ఉన్నారని వారు భయపడుతున్నారు. క్రిష్ణేండు పాల్‌పై, ఈవీఎం తీసుకెళ్లిన ఆయన వాహనంపై ఈసీ ఏం చర్యలు తీసుకుందని ప్రశ్నించారు.

కాగా, గురువారం అసోంలో రెండో దశ ఎన్నికల పోలింగ్ ముగిసింది. రటబరి నియోజకవర్గం,ఇందిరా ఎంవీ స్కూల్‌లో 149వ పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ పూర్తయిన తర్వాత సిబ్బంది బయలుదేరుతుండగా.. ఈసీ కేటాయించిన వాహనం చెడిపోయింది. అప్పటికే రాత్రి 9 గంటల కావడంతో సెక్టార్ ఆఫీసర్‌కు ప్రిసైడింగ్ అధికారి సమాచారం ఇచ్చారు. కొద్దిసేపటి తర్వాత ఓ ప్రైవేట్ వాహనంలో ఈవీఎంను స్ట్రాంగ్ రూమ్‌‌లకు తరలించారు. దాని యజమాని ఎవరు అనేది పరిశీలించకుండా వాహనంలో ఎక్కారు. అయితే, ఆ కారు పథార్కండి నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన కృష్ణేందు పాల్ భార్య మధుమితా పాల్ కి చెందినది.

స్ట్రాంగ్ రూమ్ వద్దకు ఈవీఎంను చేర్చిన వాహానాన్ని బీజేపీ నేత భార్యదిగా గుర్తించిన ప్రతిపక్ష కార్యకర్తలు దాడిచేశారు. రాళ్లు విసరడంతో వారి నుంచి తప్పించుకోడానికి పోలీసులు పరుగులు పెట్టారు. వాహనంపై రాళ్లు రువ్వడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకుంది. ఆందోళనకారులను చెదరగొట్టడానికి భారీగా బలగాలను రప్పించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. వాహనంలోని సిబ్బందిని పోలీసులు సురక్షితంగా తరలించారు. ఈ విషయమై స్పందించిన ఎన్నికల కమిషన్.. నలుగురు పోలింగ్ సిబ్బందిని సస్పెండ్ చేసింది. ఆ ఈవీఎం భద్రంగానే ఉందని, దీనికి వేసిన సీలు చెక్కు చెదరలేదని వివరించింది.