కాంగ్రెస్ మేనిఫెస్టో చాలా ప్రమాదకరం

  • Published By: venkaiahnaidu ,Published On : April 2, 2019 / 12:00 PM IST
కాంగ్రెస్ మేనిఫెస్టో చాలా ప్రమాదకరం

కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో లో కొన్ని ప్రమాదకర వాగ్దానాలు ఉన్నాయని,మేనిఫెస్టోలో భారత్ ను విడగొట్టే ఆలోచన కనిపిస్తోందని విమర్శించారు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోను రాహుల్ గాంధీ మంగళవారం(ఏప్రిల్-2,2019) విడుదల చేశారు.

కాంగ్రెస్ మేనిఫెస్టోపై జైట్లీ మాట్లాడుతూ…రాహుల్ గాంధీ ఇచ్చిన కొన్ని హామీలు ప్రమాదకరమైనవి.దేశ ప్రజలు ఆయనను నమ్మే పరిస్థితిలో లేరు.దేశద్రోహం చట్టాన్ని ఎత్తివేస్తామని వారు చెబుతున్నారు, ఇందుకు సిద్ధమవుతున్న పార్టీకి ఒక్క ఓటు కూడా పొందే అర్హత లేదు.టుక్డే టుక్డే గ్యాంగ్ లోని కాంగ్రెస్ అధ్యక్షుడి మిత్రులు ఈ మేనిఫెస్టోకు డ్రాఫ్టింగ్ చేసినట్టుంది.భారత్ ను విడదేసే ఆలోచనలు మేనిఫెస్టోలో కనిపిస్తున్నాయి.ఉగ్రవాదంపై పోరు 26/11తో ప్రారంభం కాలేదు.ఇండియాను విడగొట్టాలని చూస్తున్న శక్తులు చాలాకాలంగా దేశంలో చురుకుగా పనిచేస్తున్నాయి.

70 ఏళ్ల పాటు సాగించిన తప్పిదాలే ఇవాళ కశ్మీర్ పరిస్థితికి కారణం. చట్టబద్ధ పాలనను మేము ఏర్పాటు చేస్తుంటే, ఉగ్రవాదుల, చొరబాటుల రూల్స్‌ కోసం కాంగ్రెస్ పాటుపడుతోంది.కశ్మీర్ పండిట్ల ప్రస్తావనే కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో లేదు.కాంగ్రెస్ ప్రకటించిన జీఎస్టీ సింగిల్ శ్లాబ్ ను అర్థం లేని హామీ అని జైట్లీ అన్నారు.ప్రతి వస్తువుపై ఒకే రేటు (సింగిల్ శ్లాబ్) ఎలా వేయగలమని ఆయన ప్రశ్నించారు.