టీ షర్ట్ ధరించి అసెంబ్లీకి కాంగ్రెస్ ఎమ్మెల్యే..సభ నుంచి గెంటేసిన స్పీకర్

గుజరాత్‌ అసెంబ్లీ సమావేశాలకు కాంగ్రెస్ ఎమ్మెల్యే విమల్‌ చూడసమా.. జీన్స్‌, టీషర్ట్‌ ధరించి రావడంతో స్పీకర్ రాజేంద్ర త్రివేది అతన్ని అసెంబ్లీ నుండి బయటకు పంపించేశారు. సోమనాథ్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న విమల్ చూడసమా.. బ్లాక్ కలర్‌ టీషర్ట్‌ ధరించి సోమవారం అసెంబ్లీకి వచ్చారు.

టీ షర్ట్ ధరించి అసెంబ్లీకి కాంగ్రెస్ ఎమ్మెల్యే..సభ నుంచి గెంటేసిన స్పీకర్

Mla

Congress MLA గుజరాత్‌ అసెంబ్లీ సమావేశాలకు కాంగ్రెస్ ఎమ్మెల్యే విమల్‌ చూడసమా.. జీన్స్‌, టీషర్ట్‌ ధరించి రావడంతో స్పీకర్ రాజేంద్ర త్రివేది అతన్ని అసెంబ్లీ నుండి బయటకు పంపించేశారు. సోమనాథ్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న విమల్ చూడసమా.. బ్లాక్ కలర్‌ టీషర్ట్‌ ధరించి సోమవారం అసెంబ్లీకి వచ్చారు. అయితే ఎమ్మెల్యే వస్త్రధారణపై స్పీకర్ రాజేంద్ర త్రివేది అభ్యంతరం వ్యక్తం చేశారు. సభ గౌరవాన్ని అందంగా తీర్చిదిద్దే దుస్తులు ధరించి రావాలని ఎమ్మెల్యేను ఆదేశించారు. తాను ధరించిన దుస్తులు తగినవి కావని తెలిపే చట్టాలేమైనా ఉన్నాయా? ఉంటే చూపాలని అని విమల్ చూడాసమా స్పీకర్ తో వాగ్వాదానికి దిగారు.

స్పీకర్‌ ఆదేశాలను ఎమ్మెల్యే అంగీకరించకపోవడంతో ఆయనను మూడు రోజుల పాటు సభ నుంచి సస్పెండ్ చేయాలని హోంమంత్రి ప్రదీప్సింగ్ జడేజా ప్రతిపాదించారు. దీంతో స్పీకర్‌..ఎమ్మెల్యేను మూడు రోజుల పాటు సభ నుంచి సస్పెండ్ చేశారు. సభను వీడి వెళ్లాలని చూడాసమాను స్పీకర్‌ సూచించారు. అందుకు ససేమిరా అనడంతో మార్షల్స్‌ రంగప్రవేశం చేసి విమల్‌ చూడాసమాను సభ నుంచి బయటకు తీసుకెళ్లారు.

కాగా, మార్చి-1నుంచి గుజరాత్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభలో సభ్యులు సంస్కృతి, సాంప్రదాయాలకు అనుగుణంగా ఉండే దుస్తులు ధరించి అసెంబ్లీ గౌరవాన్ని కాపాడాలని స్పీకర్‌ రాజేంద్ర త్రివేది బడ్జెట్ సమావేశాల తొలిరోజునే సభ్యులకు సూచించారు. అయితే, స్పీకర్‌ సూచనలను పక్కనపెట్టిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే టీషర్ట్‌, జీన్స్‌ ధరించి సోమవారం అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. ఈ వ్యవహారంలో గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ కలుగజేసుకుని ఎమ్మెల్యే సభ గౌరవాన్ని కాపాడేలా దుస్తులు ధరించి రావడం మంచిదని హితవు పలికారు. కొన్ని నిబంధనలు రాతపూర్వకంగా ఉండవని ఆయన చెప్పారు.

సస్పెండ్ అయిన అనంతరం ఎమ్మెల్యే విమల్ చూడసమా అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ.. సభలో ఎలాంటి దుస్తులు ధరించాలో వారెవరు? అలాంటి చట్టం ఏమైనా ఉన్నదా? ఈ జీన్స్‌, టీ షర్ట్‌ ధరించడం వల్లనే కాంగ్రెస్‌ పార్టీ టిక్కెట్‌ ఇచ్చింది. ఇలాంటి దుస్తులు ధరించడాన్ని చూసే ప్రజలు ఓటేసి అసెంబ్లీకి పంపారు. ఇలా దుస్తుల పేరుతో సభ నుంచి బయటకు పంపడం విచారకరం. ఎందరో టీషర్టులు, జీన్స్‌ ధరించి అసెంబ్లీకి వస్తున్నారు. వారిని కాదని నాపై చర్యలు తీసుకోవడం కేవలం నేను బీసీనని. నా దుస్తులను టార్గెట్‌గా చేసుకుని బీజేపీ ప్రభుత్వం తన సమాజాన్ని అవమానించిందని అన్నారు.