ఫేస్ బుక్, వాట్సప్ లను బీజేపీ, ఆర్ఎస్ఎస్ నియంత్రిస్తున్నాయి…రాహుల్ గాంధీ

  • Published By: murthy ,Published On : August 17, 2020 / 08:16 AM IST
ఫేస్ బుక్, వాట్సప్ లను బీజేపీ, ఆర్ఎస్ఎస్ నియంత్రిస్తున్నాయి…రాహుల్ గాంధీ

భారత దేశంలో ఫేస్ బుక్, వాట్సప్ లను బీజేపీ, ఆర్ఎస్ఎస్ లు నియంత్రణలో ఉంచుతున్నాయని వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించిన కధనం రాజకీయ వర్గాల్లో దుమారం లేపుతోంది. సోషల్ మీడియా వేదికలైన ఫేస్ బుక్,వాట్సప్ లను మన దేశంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ లు తమ గుప్పిట్లో పెట్టుకుని నియంత్రిస్తున్నాయని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్రంగా దుయ్యబట్టారు. ఇలాంటి సోషల్ మీడియా ప్లాట్ ఫాంల ద్వారా దేశంలో తప్పడు వార్తలను, విద్వేషాలను, దుష్ప్రచారం చేస్తున్నాయని ట్విట్టర్లో పేర్కోన్నారు.



బీజేపీ ఆర్ ఎస్ ఎస్ లు సోషల్ మీడియా ద్వారా ఓటర్లను ప్రభావితం చేయాలని చూస్తున్నాయి. చివరకు అమెరికా మీడియా ఈ బండారాన్ని బయటపెట్టింది’అని రాహుల్‌ ట్వీట్‌ చేశారు. విద్వేష పూరిత ప్రసంగాల విషయంలో ఏం చేయదలచుకున్నారో ఫేస్‌బుక్‌ చెప్పాలన్నారు. భారత్ లో బీజేపీ నేతల విద్వేషపూరిత ప్రసంగాలను ఫేస్ బుక్ చూసీ చూడనట్లు వదిలిస్తోందని వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించిన వార్తను ఉదహరిస్తూ..రాహుల్ గాంధీ ట్విట్టర్ లో ఈ పోస్టు చేశారు.



వివాదాస్పద రాజకీయ నాయకుడిపై నిషేధం విధించడానికి ఫేస్‌బుక్‌ ఎగ్జిక్యూటివ్‌ నిరాకరించారు. బీజేపీ నేతల ఉల్లంఘనలను చూసీచూడనట్లు వదిలేస్తోంది. వారిపై చర్యలకు దిగితే భారత్‌లో కంపెనీ వ్యాపారావకాశాలు దెబ్బతింటాయని ఆయన భావిస్తున్నారు. బీజేపీ వైపు ఫేస్‌బుక్‌ మొగ్గుచూపుతోంది’అని ఫేస్ బుక్ సంస్థ ప్రస్తుత, మాజీ ఉద్యోగులను, ఉటంకిస్తూ వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ తన కథనంలో రాసింది.



కాగా రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కౌంటరిచ్చారు. ఎన్నికలకు ముందు కేంబ్రిడ్జి అనల్టికా, ఫేస్‌బుక్‌‌తో కాంగ్రెస్ కుమ్మక్కై డాటాను ఉపయోగించుకోవడం అందరికీ తెలిసిందేనని, ఇప్పుడు అదే పని తాము చేశామంటూ బీజేపీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.




తమ సొంత పార్టీ వారిని కూడా ప్రభావితం చేయలేని వారు, ప్రపంచం మొత్తం బీజేపీ, ఆరెస్సెస్‌లు ప్రభావం చేస్తున్నాయని సణుగుతున్నారని ఆయన రాహుల్ గాంధీని విమర్శించారు. “కేంబ్రిడ్జ్‌ ఎనలిటికా, ఫేస్‌బుక్‌ నుంచి సమాచారం తీసుకుని ఎన్నికల్లో ఉపయోగించుకోడానికి ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయిన మీరు ఇప్పుడు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారా ?” అని రవిశంకర్ ప్రసాద్‌ కాంగ్రెస్‌ పార్టీపై ట్వీట్ చేశారు.

చేయాల్సిందంతా కాంగ్రెస్ చేసి ఇప్పుడు ఏమీ తెలియనట్లు బీజేపీకి ఆ పాపాన్ని అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని రవిశంకర్ ప్రసాద్ మండిపడ్డారు. నిజానికిసమాచార వ్యవస్ధ, భావ ప్రకటనాస్వేఛ్చ ఇప్పుడు ప్రజాస్వామ్య బధ్దంగా నడుస్తున్నాయని… ఇవి గాంధీ ఫ్యామిలీ గుప్పిట్లో కొనసాగకపోవటంతో వారకి మనస్తాపం కలుగుతోందని రవిశంకర్ ప్రసాద్ అన్నారు. బెంగుళూరు అల్లర్లును మీరు ఎందుకు ఖండించలేక పోయారు? మీ ధైర్యం ఏమైంది ? అని రాహుల్ ను రవిశంకర్ ప్రసాద్ ప్రశ్నించారు.

కాగా ఇంతటి వివాదానికి కారణమైన వాల్ స్టీట్ జర్నల్ కధనంలో తెలంగాణకు చెందిన ఏకైక బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రస్తావన ఉంది. అంఖీ దాస్‌ అనే ఫేస్‌బుక్‌ సంస్థ ప్రతినిధి తమ సంస్థ ఉద్యోగులతో మాట్లాడినట్లు చెబుతున్న వ్యాఖ్యలను ‘ది వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌’ తన కథనంలో రాసింది. బీజేపీ నాయకుల విద్వేష పూరిత ప్రసంగాలపై చర్యలు తీసుకోవడం వల్ల భారత్ లో మన బిజినెస్‌ దెబ్బతినే ప్రమాదముందని అంఖీ దాస్‌, తమ ఉద్యోగులతో అన్నట్లు ఆ కథనంలో రాశారు.

తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌తోపాటు మరో ముగ్గురు బీజేపీ నేతలు చేసిన విద్వేష పూరిత ప్రసంగాలు చర్యలు తీసుకునే స్థాయిలో ఉన్నాయని, ఆ విషయాన్ని ఫేస్‌బుక్‌ సంస్థ ప్రస్తుత ఉద్యోగులు, మాజీ ఉద్యోగులు కూడా గుర్తించారని.. అయినా చర్యలు తీసుకోలేక పోయిందదని ఆ వార్తా కథనంలో వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది. నేటికీ ఆ నలుగురు నేతల ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్లు ఇప్పటికీ యాక్టివ్‌గానే ఉన్నాయని అందులో వివరించారు.

భారతదేశంలో ఫేస్‌బుక్‌ సంస్థ తరఫున వ్యాపార లావాదేవీలకు సంబంధించి లాబీయింగ్‌ కూడా చేసే ఫేస్‌బుక్‌ ప్రతినిధి అంఖీదాస్‌, బీజేపీ నేతలపై చర్యలు తీసుకుంటే ఇండియాలో మన బిజినెస్‌ మీద ప్రభావం పడే అవకాశం ఉంటుందని, అందువల్ల అలాంటి వారికి హేట్‌ స్పీచ్‌ రూల్స్‌ను అమలు చేయవద్దని పేర్కొన్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ తన కధనంలో వెల్లడించింది.