సుమలతకి హ్యాండ్ ఇచ్చిన కాంగ్రెస్

  • Published By: venkaiahnaidu ,Published On : February 22, 2019 / 02:05 PM IST
సుమలతకి హ్యాండ్ ఇచ్చిన కాంగ్రెస్

2019 సార్వత్రిక ఎన్నికల్లో కర్ణాటకలోని మండ్యా లోక్ సభ స్థానం నుంచి మాజీ మంత్రి అంబరీష్ భార్య,నటి సుమలత కాంగ్రెస్ తరపున బరిలోకి దిగబోతున్నట్లు కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఆమెకు కాంగ్రెస్ టికెట్ నిరాకరించినట్లు తెలుస్తోంది. మండ్య లోక్ సభ స్థానాన్ని జేడీఎస్ కు ఇచ్చేందుకు కాంగ్రెస్ అంగీకరించినట్లు తెలుస్తోంది.

 గురువారం(ఫిబ్రవరి-21,2019) కాంగ్రెస్ నేత, మాజీ సీఎం సిద్దరామయ్యతో సుమలత సమావేశమై తన రాజకీయ ప్రవేశం గురించి చర్చించారు. సమావేశం అనంతరం మాట్లాడిన సుమలత..మండ్యా లోక్ సభ స్థానం నుంచి తానను  పోటీ చేయమని అంబరీష్ అభిమానులు కోరుతున్నారని, తనకు టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ ని కోరినట్లు ఆమె తెలిపారు. అయితే జేడీఎస్-కాంగ్రెస్ కూటమిలోని కొందరు ముఖ్య నాయకులు ఆమెకు కూటమి తరపున సీటు ఇవ్వడం లేదని తెలిపారు.

సార్వత్రిక ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్న సమయంలో సీట్ల సర్దుబాటు విషయమై జేడీఎస్ అధినేత దేవేగౌడ, సీఎం కుమారస్వామితో కాంగ్రెస్ నేతలు సిద్దరామయ్య, పరమేశ్వర, డీకే శివకుమార్,దినేష్ గుండూరావ్ లు సమావేశమై చర్చలు జరిపారు. ఈ సమావేశంలో మండ్యా సీటుని జేడీఎస్ కు ఇచ్చేందుకు కాంగ్రెస్ అంగీకరించింది. దీంతో సుమలతకి కాంగ్రెస్ హ్యాండ్ ఇచ్చినట్లు అయింది.

ఎలాగైనా మండ్యా నుంచి కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగాలని భావించిన సుమలత ఆదివారం సీఎం కుమారస్వామితో సమావేశమై తన అభ్యర్థిత్వంపై  చర్చించనున్నట్లు తెలుస్తోంది. అయితే మండ్యా టికెట్ ని ఆశిస్తున్న వారి సంఖ్య తక్కువేమీ లేదు. దేవెగౌడ పెద్ద కుమారుడు హెచ్ డీ రేవణ్ణ తన భార్యను మండ్యా నుంచి బరిలోకి దించేందుకు ప్రయత్నిస్తున్నాడు. సీఎం కుమారస్వామి కొడుకు నిఖిల్ గౌడ కూడా మండ్యా నుంచి జేడీఎస్ తరపున బరిలోకి దిగబోతున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా సుమలత మొదటగా కాంగ్రెస్ నేతలను సంప్రదించడం పట్ల కూడా కొందరు జేడీఎస్ నేతలు కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కూటమి తరపున సుమలతకి టికెట్ దక్కకపోవచ్చని ఆయా పార్టీలోని నేతలు చెబుతున్నారు.