మహా రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్న రాహుల్ వ్యాఖ్యలు

  • Published By: venkaiahnaidu ,Published On : May 26, 2020 / 12:23 PM IST
మహా రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్న రాహుల్ వ్యాఖ్యలు

ఓ వైపు కరోనా మహమ్మారితో మహారాష్ట్ర అల్లాడుతున్న సమయంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇవాళ(మే-26,2020)జర్నలిస్ట్ లతో రాహుల్ గాంధీ వీడియోకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.

ఈ సమయంలో మహారాష్ట్రలో ప్రస్తుత పరిస్థితిపై ఓ జర్నలిస్ట్ అడిగన ప్రశ్నకు సమాధానంగా రాహుల్ మాట్లాడుతూ…మహారాష్ట్రలో మేము ప్రభుత్వానికి మద్దుతు తెలుపుతున్నాము కానీ మహారాష్ట్రలో మేం ముఖ్యమైన నిర్ణయ కర్తలం కాదు. పంజాబ్,ఛత్తీస్ ఘడ్,రాజస్థాన్,పాండిచ్చేరిలో మేం నిర్ణయ కర్తలం అని రాహుల్ అన్నారు. దేశంలోనే మోస్ట్ వెల్-కనెక్టెడ్ రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఒకటని అందువల్లే మహారాష్ట్రలో కరోనా విజృంభణ ఉందని, ఢిల్లీ మాదిరిగా ముంబై-పూణే వెల్ కనెక్టడ్ అని,ప్రతి ఒక్కరూ దీనిని పరిగణలోకి తీసుకోవాలని వయనాడ్ ఎంపీ అన్నారు.

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలంటూ బీజేపీ గోల చేస్తున్న సమయంలో రాహుల్ నోటి నుంచి వచ్చిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు మంటపై మరింత పెట్రల్ పోసినట్లు ఉంది. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరుతూ బీజేపీ నాయకుడు,మాజీ సీఎం నారాయన్ రాణే సోమవారం ఆ రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కొశ్యారీని కలిసిన విషయం తెలిసిందే. మరోవైపు వలసకూలీల సంక్షోభం విషయంలో ఉద్దవ్ ఠాక్రే ప్రభుత్వంపై రైల్వేశాఖ మంత్రి పియూష్ గోయల్ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో చిక్కుకుపోయిన వలసకూలీల పూర్తి డేటా గురించి మహారాష్ట్ర ప్రభుత్వం చెప్పలేదని,దీనివల్ల శ్రామిక్ రైళ్ల ద్వారా వలసకూలీల తరలింపు ఆలస్యం అయిందని ఉద్దవ్ ప్రభుత్వంపై గోయల్ ఫైర్ అయ్యారు.

ప్రస్తుతం మహారాష్ట్రలో శివసేన,ఎన్సీపీ,కాంగ్రెస్ తో కూడిన మహా వికాస్ అఘాడి(MVA)ప్రభుత్వం అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. మహారాష్ట్ర కేబినెట్ లో NCP 12కేబినెట్ మంత్రులు,నలుగురు డిప్యూటీ మంత్రులను కలిగి ఉంది. శివసేన 10కేబినెట్ మంత్రులు,నలుగురు డిప్యూటీ మంత్రులను కలిగి ఉంది. కాంగ్రెస్ 10కేబినెట్ మంత్రులు,ఇద్దరు డిప్యూటీ మంత్రులను కలిగి ఉంది.

మరోవైపు మహావికాస్ అఘాడి ప్రభుత్వ ఏర్పాటులో తెరవెనుక మంత్రాంగం నడిపిన ఎన్సీపీ నాయకుడు శరద్ పవార్ మహారాష్ట్రలోని తాజా రాజకీయ పరిణామాలపై మాట్లాడుతూ..మాజీ ముఖ్యమంత్రి,బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ తమ ప్రభుత్వాన్ని కూల్చాలని చాలా ఆశక్తిగా ఉన్నాడన్నారు. అయితే ఉద్దవ్ ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. ఎమ్మెల్యేలు అందరూ తమ వెంటే ఉన్నారన్నారు.

ఈ సమయంలో వాళ్లని విచ్ఛిన్నం చేసే ఏ ప్రయత్నమైనా జరిగితే ప్రజలు తమని కొడతారని పవార్ అన్నారు. సోమవారం సాయంత్రం సీఎం ఉద్దవ్ తో పవార్ మీటింగ్ లో కాంగ్రెస్ గెర్హాజరుపై పవార్ మాట్లాడుతూ…సంకీర్ణ ప్రభుత్వంలోని ముగ్గురు భాగస్వామ్య పార్టీలు కలిసికట్టుగా ఉన్నాయని,కరోనా మహమ్మారిపై పోరాటంలో కలిసి పనిచేస్తున్నట్లు చెప్పారు. మరోవైపు తాను ఇవాళ గవర్నర్ ని కలవడం కేవలం మర్యాదపూర్వకంగానే జరిగినట్లు పవార్ చెప్పారు. గవర్నర్ తో రాజకీయాలు లేదా కరోనా గురించి చర్చించలేదన్నారు.

కాగా,దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 52వేలు దాటింది. ఒక్క ముంబైలోనే 31వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య కూడా మహారాష్ట్రలో ఎక్కువగానే ఉంది. ఇప్పటివరకు 1700కరోనా మరణాలు మహారాష్ట్రలో నమోదయ్యాయి.