మోడీ మాటకు ముందే: జాతిని ఉద్దేశించి సోనియా గాంధీ సందేశం

  • Published By: vamsi ,Published On : April 14, 2020 / 03:43 AM IST
మోడీ మాటకు ముందే: జాతిని ఉద్దేశించి సోనియా గాంధీ సందేశం

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ మహమ్మారి భారత్‌లో కూడా శరవేగంగా విస్తరిస్తుంది. ఈ క్రమంలో లాక్ డౌన్ సడలింపు.. లాక్ డౌన్ పొడగింపు విషయాల్లో కీలక ప్రకటన చెయ్యబోతున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. అంతకుముందుగానే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ జాతిని ఉద్దేశించి ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.

కరోనా వైరస్ మహమ్మారిపై పోరులో భాగమైన “నా ప్రియమైన దేశ ప్రజలారా..” అంటూ ప్రారంభమైన ఆమె సందేశంలో, కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా చూసేందుకు ప్రతి పౌరుడూ సహకరించాలని ఆమె కోరారు. వైరస్ భయాందోళనలు తగ్గేంతవరకు ప్రజలు ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని కోరారు.

ఇటువంటి సమయంలో ప్రజలంతా శాంతి, సహనం, సంయమనం పాటిస్తున్నారని ఆమె అన్నారు. ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటిచాలని, చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని అభ్యర్థించారు. వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు తమ భార్యా పిల్లలనూ, తల్లిదండ్రులనూ వదిలి కరోనాపై పోరాడుతున్నారని, వారందరికీ థ్యాంక్స్ అని చెప్పారు. 

ఇక, జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని గుర్తు చేసిన కాంగ్రెస్ అధ్యక్షురాలు, ప్రజలందరికీ ఉచితంగా ఆహార ధాన్యాలు అందించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్రం తీసుకుంటున్న చర్యలను ప్రశంసించిన సోనియా గాంధీ..  ముందస్తు సన్నాహాలు లేకుండా దేశంలో లాక్‌ డౌన్ అమలు చేస్తుండడం వల్ల దేశం నష్టపోతోందని అన్నారు.

Also Read | మే ఫస్ట్ వీక్ లో 10th ఎగ్జామ్స్..మే చివర్లో ఎంసెట్‌!