యుద్ధ విమానానికి మతం ఎందుకు: రాఫెల్ ఆయుధ పూజపై వివాదం

యుద్ధ విమానానికి మతం ఎందుకు: రాఫెల్ ఆయుధ పూజపై వివాదం

ఇండియన్ ఎయిర్‌ ఫోర్స్ డే పురస్కరించుకుని భారీ ఎత్తున గగన విన్యాసాలు జరిగాయి. మంగళవారం జరిగిన ఈ కార్యక్రమాలతో పాటు ప్రత్యేకంగా భారత తొలి యుద్ధ విమానాన్ని ఫ్రాన్స్ నుంచి భారత్ అందుకుంది. సుదీర్ఘ కాల నిరీక్షణ తర్వాత భారత ఎయిర్ ఫోర్స్‌కు ప్రధాన ఆయుధం చిక్కింది. మోడీ ప్రభుత్వం హయాంలో ఈ యుద్ధ విమానం రావడంతో.. దసరా రోజు విమానాన్ని చేజిక్కించుకున్న అధికారులు పూజలు నిర్వహించారు. 

కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దసరా పండుగ పురస్కరించుకుని ఆయుధ పూజ చేశారు. ఇందులో భాగంగా రాఫెల్ యుద్ధ విమానంపై ఓం గుర్తు రాసి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఈ క్రమంలో బీజేపీ పాలనలో కేవలం ఒక మతానికే ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. 

కాంగ్రెస్ నాయకురాలు సందీప్ దీక్షిత్.. రాఫెల్ యుద్ధ విమానాన్ని అందుకున్న పద్ధతిలో మోడీ ప్రభుత్వంపై విమర్శలకు దిగారు. ‘రాఫెల్ యుద్ధ విమానం అందుకోవడం ఆ సందర్భంగా విజయ దశమి సంస్కృతి పాటించడం సరైంది కాదు.  పండుగ అనేది అందరూ జరుపుకునేది దానిని ఎయిర్ క్రాఫ్ట్‌కు ఎందుకు లింక్ చేశారు. సరైన పనులు చేయకుండా ప్రతి దానిని ఓ డ్రామాలా చిత్రీకరిస్తుందీ ప్రభుత్వం’ అని విమర్శించారు. 

ఈ ఘటనపై ట్విట్టర్ వేదికగా నెటిజన్ల నుంచి పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అందులో ఒకరు ఇలా ట్వీట్ చేశారు. ‘ప్రజలు ఇది సంప్రదాయం, మతాచరణ అని ఎవరైతే చెప్తున్నారో.. వారికి ఇలా చెప్తాను. ఇది భారతదేశం. ముస్లిం, క్రైస్తవులు, జైనులు, సిక్కులు, హిందువులు పలు మతాల వారు ట్యాక్స్‌లు చెల్లించి భారత ఎదుగుదలకు సహకరిస్తున్నారు. కానీ, కేంద్ర ప్రభుత్వం కేవలం హిందూ ఆచారాలనే ఎందుకు అనుసరిస్తుంది’ అని ట్వీట్ చేసింది.