కాంగ్రెస్ సోషల్ ఆర్మీ, 5 లక్షల మంది వారియర్స్ నియామకం

కాంగ్రెస్ సోషల్ ఆర్మీ, 5 లక్షల మంది వారియర్స్ నియామకం

Congress Social Army : క్యాడర్‌లో జోష్‌ నింపేందుకు కాంగ్రెస్‌ యత్నిస్తోంది. జాతీయస్థాయిలో పార్టీకి పునర్వైభవం సాధించేందుకు సోషల్‌ మీడియా వింగ్‌ను పటిష్టం చేస్తోంది. ఏకంగా 5 లక్షల మంది వెబ్‌ వారియర్స్‌ను నియమించనుంది. రాష్ట్రాల్లో గెలవాలన్నా, హస్తినను హస్తగతం చేసుకోవాలన్నా డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ను పటిష్టం చేస్తేనే సాధ్యమవుతుందని భావిస్తోంది కాంగ్రెస్‌. బీజేపీ మాదిరే సోషల్‌ మీడియా వేదికను బలోపేతం చేయాలని నిర్ణయానికి వచ్చింది హస్తం పార్టీ. యూ ట్యూబ్‌, ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌, వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్‌…ఇతరత్రా డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లపై నుంచి పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేసేందుకు, బీజేపీతో సహా ఇతర ప్రత్యర్థి పార్టీలపై విరుచుకుపడేందుకు 5 లక్షలమందిని యాక్టివ్‌ ఉంచనుంది కాంగ్రెస్‌.

త్వరలోనే జాయిన్‌ కాంగ్రెస్ సోషల్‌ మీడియా రిక్రూట్‌మెంట్‌ నిర్వహించనుంది సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెస్‌ పార్టీ. వాలంటరీగా చేరి పార్టీకి సేవలు అందించవచ్చని కాంగ్రెస్‌ పిలుపునిస్తోంది. ఇందులో భాగంగా.. జిల్లా కాంగ్రెస్ కార్యాలయాల్లో ఆఫీస్‌ బేరర్లుగా 50 వేల మందిని నియమించనుంది. కాంగ్రెస్‌ కార్యకర్తలతో టచ్‌లో ఉంటూ పార్టీ సందేశాలను ప్రజలకు చేరువయ్యేలా మరో నాలుగు లక్షల 50 వేల మంది పనిచేయనున్నారు. కరోనాతో పార్టీ శ్రేణులు కూడా ప్రజల్లో అంతగా తిరగలేదని కాంగ్రెస్‌ నాయకత్వం భావిస్తోంది. దీంతో సోషల్‌ మీడియాలో మరింత జోరు కనబర్చాలంటే సోషల్‌ మీడియాలో స్పీకప్‌ క్యాంపెయిన్స్‌ను పెంచడమే మార్గమనుకుంది.