వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా : 24 నుంచి కాంగ్రెస్ నిరసనలు…రాష్ట్రపతికి 15 పార్టీల లేఖ

  • Published By: venkaiahnaidu ,Published On : September 21, 2020 / 09:59 PM IST
వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా : 24 నుంచి కాంగ్రెస్ నిరసనలు…రాష్ట్రపతికి 15 పార్టీల లేఖ

వివాదాస్పదమైన రెండు వ్యవసాయ బిల్లులను పార్లమెంట్ ఆమోదించడాన్ని వ్యతిరేకిస్తూ సెప్టెంబర్ 24 నుంచి దేశవ్యాప్త ఆందోళన నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ సోమవారం నిర్ణయించింది. ఇవాళ న్యూఢిల్లీలోని ప్రధాన కార్యాలయంలో ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల ఇన్‌చార్జులతో సమావేశమై దేశవ్యాప్త ఆందోళనల నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ పార్టీ.

రైతులకు మద్దతుగా దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా కాంగ్రెస్ పార్టీ పలు కార్యక్రమాలను చేపట్టనున్నట్టు సమావేశానంతరం పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జి కేసీ వేణుగోపాల్ మీడియాకు తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రెస్ కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తామని చెప్పారు. ఆయా రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభాగం అధ్యక్షులు, సీఎల్‌పీ నేతలు, మాజీ మంత్రలు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో రాజ్‌భవన్‌‌ వరకూ పాదయాత్రలు చేసి గవర్నర్లకు వినతి పత్రం అందజేస్తామని, ఆ మొమొరాండం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు పంపాలని కోరుతామని చెప్పారు.


రైతు వ్యతిరేక బిల్లుల గురించి దేశ ప్రజల ముందుకు తీసుకువెళ్తామని కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే ఆంటోని తెలిపారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు పార్టీ సమావేశం జరిపి దేశవ్యాప్త ఆందోళనకు నిర్ణయం తీసుకున్నట్టు అయన వివరించారు.

కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ అందుబాటులో లేని సమయంలో విధాన పరమైన నిర్ణయాల్లో ఆమెకు సహాయం అందించేందుకు ఆరుగురు సభ్యుల ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. కాగా, హెల్త్ చెకప్‌ల కోసం సోనియాగాంధీ, ఆమె వెంట రాహుల్ గాంధీ ఇటీవల అమెరికా వెళ్లిన విషయం తెలిసిందే.


రాష్ట్రపతికి విపక్షాల లేఖ

మరోవైపు, పార్లమెంట్ ఆమోదం పొందిన వ్యవసాయ బిల్లులపై సంతకాలు చేయొద్దంటూ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కు విపక్షాలు లేఖ రాశాయి. కాంగ్రెస్, జేడీయూ, ఎన్సీపీ, సీపీఐ, సీపీఎం, టీఎంసీ, టీఆర్ఎస్, ఆప్, ఆర్జేడీ, ఇండియన్ ముస్లిం లీగ్, ఎల్జేడీ తదితర 15 రాజకీయ పార్టీల నేతలు లేఖపై సంతకాలు చేశారు.


25న భారత్ బంద్

రైతు సంఘాల ఐక్యవేదిక.. ”ఆలిండియా కిసాన్ సంఘర్ష్ కోఆర్డినేషన్ కమిటీ(ఏఐకేఎస్‌సీసీ) ప్రకటించినట్లు ఈనెల 25న భారత్ బంద్ కూడా కొనసాగనుంది. ఏఐకేఎస్‌సీసీ బంద్ పిలుపునకు విపక్ష పార్టీలన్నీ మద్దతు పలికాయి.