కాంగ్రెస్‌తో విడిపోలేదు: రెండు సీట్లు ఇచ్చాం

  • Edited By: vamsi , March 7, 2019 / 12:47 PM IST
కాంగ్రెస్‌తో విడిపోలేదు: రెండు సీట్లు ఇచ్చాం

మహాకూటమిలో కాంగ్రెస్ కూడా ఉందని, కాంగ్రెస్‌కు రెండు సీట్లు కేటాయించమని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికలు దగ్గరకు వస్తున్న నేపధ్యంలో  ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలు వ్యూహాలు, పొత్తుల ఎత్తుల్లో మునిగి ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ-బీఎస్పీ జతకట్టాయి. మొత్తం 80 సీట్లలో ఎస్పీ 37, బీఎస్పీ 38 సీట్లలో పోటీచేయాలని అఖిలేశ్ యాదవ్-మాయావతి నిర్ణయించుకోగా.. సంయుక్త ప్రకటన చేశారు. ఈ కూటమితో కాంగ్రెస్ కూడా చేతులు కలిపినట్లు అఖిలేశ్ యాదవ్ తెలిపారు. కాంగ్రెస్‌కు రెండు సీట్లు కేటాయించినట్లు స్పష్టంచేశారు. 
దేశ రాజకీయాల్లో కీలకంగా ఉన్న ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 80సీట్లు ఉండగా ఇక్కడ మెజారిటీ సీట్లు సాధించినవాళ్లే ఎక్కువగా ప్రధాని అవుతుంటారు. ఈ క్రమంలో ఎస్పీ, బీఎస్పీ అభ్యర్థులు పోటీచేసే జాబితాను కూడా ప్రకటించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నియోజకవర్గం అమేథీ, సోనియా గాంధీ లోక్‌సభ స్థానం రాయ్‌బరేలీలో మాత్రం పోటీకి నిలబెట్టం అని ప్రకటించగా.. ఇప్పుడు పొత్తులో భాగంగా ఆ సీట్లను కాంగ్రెస్‌కు కేటాయించాం అనడం విశేషం. అఖిలేష్ తాజా వ్యాఖ్యలు చూస్తుంటే ఎన్నికలు తర్వాత రెండు పార్టీలు కాంగ్రెస్‌కు సపోర్ట్ చేస్తాయి అనే విధంగా ఉన్నాయి. అయితే మరోవైపు అఖిలేష్ తండ్రి ములాయం మాత్రం రాబోయే ఎన్నికల్లో మోడీనే మళ్లీ ప్రధాని కావాలంటూ విశ్వాసం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
అయితే ఉత్తరప్రదేశ్‌లో ప్రియాంకగాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాక ఆ రాష్ట్ర ముఖచిత్రం మారిపోయింది. రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఇటువంటి పరిస్థితిల్లో కాంగ్రెస్ రెండు స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తుందని అనుకోవడం కష్టమే. ఉత్తరప్రదేశ్ తూర్పు ప్రాంత ఇంచార్జిగా ఆమెను నియమించడంతో.. యూపీలో కాంగ్రెస్ బలమైన శక్తిగా ఎదుగుతుందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తంచేశారు. బీజేపీని ధీటుగా ఎదుర్కొని వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలుస్తామని అభిప్రాయపడుతన్నారు. అయితే అఖిలేష్ చెప్పినట్లు 2 స్థానాలకు మాత్రమే పరిమితం అవడం అనేది సాధ్యం కాదు.