కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సాగు చట్టాలు రద్దు : ప్రియాంకగాంధీ

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సాగు చట్టాలు రద్దు : ప్రియాంకగాంధీ

priyanka

Congress కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తామని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ తెలిపారు. బుధవారం ఉత్తరప్రదేశ్ లోని సహరాన్పూర్ లో నిర్వహించిన కిసాన్‌ మహాపంచాయత్‌ లో ప్రియాంకగాంధీ పాల్గొన్నారు. పెద్ద ఎత్తున ప్రజలు ఒకచోట ఉండటంపై నిషేధం విధిస్తూ జిల్లా యంత్రాంగం ఇవాళ ఆదేశాలె జారీ చేసినప్పటికీ కిసాన్ మహాపంచాయత్ కార్యక్రమం కొనసాగింది. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనకు హాట్ స్పాట్ గా యూపీ మారుతుండటంలో ఇవాళ ఉదయం యూపీలో ఈ ఆదేశాలు అమల్లోకి వచ్చాయి.

వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న యూపీలో 10 రోజులపాటు జై జవాన్‌, జై కిసాన్‌ పేరుతో రాష్ట్రంలోని 27 జిల్లాల్లో కాంగ్రెస్‌ చేపట్టిన భారీ క్యాంపెయిన్‌ లో భాగంగా నిర్వహించిన కిసాన్ పంచాయత్ కార్యక్రమానికి హాజరై రైతులను ఉద్దేశించి మాట్లాడిన ప్రియాంకగాంధీ..మోడీ సర్కార్ తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలతో రైతుల ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందన్నారు. కొత్త వ్యవసాయ చట్టాలు అరబ్‌పతిలకు మేలు చేస్తాయని, వారే రైతుల పంటకు ధరను నిర్ణయిస్తారని వ్యాఖ్యానించారు. మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను తాము అధికారంలోకి వస్తే రద్దు చేస్తామని ప్రియాంక చెప్పారు.

రైతులే దేశాన్ని ఆత్మనిర్భర్ గా మార్చారని అయితే కొత్త చట్టాల వల్ల వాళ్లు ఇబ్బందుల్లోకి నెట్టబడుతున్నార్ననారు. రైతులను దేశ వ్యతిరేకులు,తీవ్రవాదులు,ఉగ్రవాదులు అని కేంద్రం అంటోందని,కానీ వాస్తవాంలో కేంద్ర ప్రభుత్వమే దేశ వ్యతిరేకి అని ప్రియాంక అన్నారు. రైతు గుండె ఎప్పటికీ దేశానికి వ్యతిరేకంగా ఉండదన్నారు. భూమిపైనే రాత్రింబవళ్లు రైతులు పనిచేస్తారని..అలాంటివాళ్లు దేశానికి ఎలా ద్రోహం చేయగలరు అని ప్రియాంక ప్రశ్నించారు.

ప్రధానమంత్రి నరేంద్రమోడీకి పాకిస్తాన్,చైనా దేశాలకు వెళ్లేందుకు సమయం ఉందని,కానీ ఆయన సొంత నియోజకవర్గ సరిహ్దదులకు వెళ్లి రైతులను కలిసే సమయం లేదని విమర్శించారు. రైతులే మోడీకి ఓటు వేశారన్న విషయాన్ని ఆమె ఎత్తిచూపారు. ఆందోళన్ జీవి(ఆందోళన చేసేందుకే బతికేవాళ్లు)అంటూ స్వయంగా మోడీనే రైతులను అవమానించారని..అది కూడా పార్లమెంట్ లో అని ప్రియాంక అన్నారు.

ఇక, యూపీలో జై జవాన్‌, జై కిసాన్‌ పేరుతో రాష్ట్రంలో పది రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో పార్టీ నేతలంతా పాల్గొంటారని యూపీ కాంగ్రెస్‌ మీడియా కన్వీనర్‌ లలన్‌ కుమార్‌ తెలిపారు. సహరన్‌పూర్‌, షమ్లి, ముజఫర్‌నగర్‌, భాగ్పట్‌, మీరట్‌, బిజ్నోర్‌, హపూర్‌, బులంద్‌షహర్‌, అలీఘడ్‌, హథ్రాస్‌, మధుర, ఆగ్రా, ఫిరోజాబాద్‌, బదౌన్‌, రాంపూర్‌, ఫిలిబిత్‌, లఖింపూర్‌ ఖేర్‌, సీతాపూర్‌, హర్దోయ్‌ జిల్లాల్లో కాంగ్రెస్‌ పార్టీ ప్రచార కార్యక్రమాన్ని రూపొందించింది.