అమిత్ షా ఇంటి దగ్గర కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన

  • Published By: venkaiahnaidu ,Published On : November 8, 2019 / 01:15 PM IST
అమిత్ షా ఇంటి దగ్గర కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన

గాంధీ కుటుంబానికి (సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ)ప్రత్యేక భద్రతా బృందం(SPG) భద్రతను ఉపసంహరించాలని మోడీ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ ఫైర్ అయింది. కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఇవాళ(నవంబర్-8,2019)ఢిల్లీలోని హోంశాఖ మంత్రి అమిత్ షా నివాసం దగ్గర కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. గాంధీ కుటుంబ సభ్యుల ప్రాణాలకు ముప్పు ఉందని, ఎస్పీజీ భద్రతను మళ్లీ పునరుద్ధరించాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ప్రధాని మోడీ,హోంమంత్రి అమిత్ షా వ్యక్తిగత,రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ నాయకుడు కేసీ వేణుగోపాల్ తెలిపారు. 

z+సెక్యూరిటీని గాంధీ ఫ్యామిలీకి కల్పించి ఎస్పీజీ తొలగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ తో జడ్+సెక్యూరిటీని గాంధీ కుటుంబానికి ప్రభుత్వం ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ ఏడాది ఆగస్టులో మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్‌కు కూడా ప్రత్యేక భద్రతా బృందం(SPG) భద్రతను కేంద్రం వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే. 

మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్య తర్వాత ప్రధానుల భద్రత కోసం 1985లో ఎస్పీజీ వ్యవస్థ ఏర్పాటు అయింది. 1991లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య తర్వాత మాజీ ప్రధానులు, వారి కుటుంబాలకు 10ఏళ్ల పాటు ఎస్పీజీ భద్రత కల్పించే విధంగా ఎస్పీజీ చట్టానికి సవరణ చేశారు. 2003లో మాజీ ప్రధాని వాజ్ పేయి…10 ఏళ్ల నుంచి ఒక ఏడాదికి లేదా కేంద్రం నిర్ణయించిన ముప్పు స్థాయిని బట్టి ఎస్పీజీ సెక్యూరిటీ కల్పించేలా చట్టానికి మరోసారి సవరణ చేశారు.