రైతు నేతలతో ముగిసిన కేంద్రం చర్చలు…కమిటీ ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వం

రైతు నేతలతో ముగిసిన కేంద్రం చర్చలు…కమిటీ ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వం

Talks With Farmers రైతు సంఘాల నేతలతో ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆరో దఫా జరిపిన చర్చలు మగిశాయి. ఐదు గంటలపాటు సాగిన చర్చలు ఎటూ తేలకుండానే అసంపూర్తిగా ముగిశాయి. దీంతో అపరిష్కృత అంశాలపై జనవరి 4న మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. రైతులు డిమాండ్ చేస్తున్నట్లుగా.. వ్యవసాయ చట్టాలను రద్దు చేసే ప్రశక్తే లేదని కేంద్రం తేల్చి చెప్పింది. అయితే చట్టాల్లో సవరణలకు సిద్దమని తెలిపింది. రైతుల డిమాండ్ మేరకు ఎంఎస్‌పీపై కమిటీ వేసేందుకు కేంద్రం సుముఖం వ్యక్తం చేసింది. మద్దతు ధర విషయంలో రైతుల డిమాండ్ల పరిశీలనకు కమిటీ ఏర్పాటు యోచనలో ఉన్నట్లు కేంద్రం తెలిపింది.

అలాగే ఢిల్లీలో గాలి నాణ్యత ఆర్డినెన్స్‌లో సవరణలకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. విద్యుత్‌ బిల్లులో రైతు సంఘాలు సూచించినట్లు సవరణలకు కేంద్రం మొగ్గుచూపింది. మిగతా అంశాలనూ పరిగణనలోకి తీసుకుంటామని రైతులు ముందుగా తమ ఆందోళనను విరమించాలని కేంద్రం కోరింది. కాగా నేటితో కలిపి ఇప్పటివరకు కేంద్రం.. ఆరుసార్లు రైతు సంఘాలతో చర్చలు జరుపగా..ఇప్పటివరకు చర్చలు ఓ కొలిక్కి రాలేదు.

రైతు నేతలతో చర్చల అనంతరం కేంద్రవ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మాట్లాడుతూ…ఇవాళ చర్చలు మంచి వాతావరణంలో జరిగాయని..సానుకూల ధోరణిగా చర్చలు ముగిశాయని అన్నారు. రైతులు లేవనెత్తిన మొత్తం 4అంశాల్లోని 2అంశాలపై రెండువైపుల నుంచి సమ్మతి లభించిందని తెలిపారు. ఢిల్లీలో విపరీతమైన చలి నేపథ్యంలో వృద్ధులను,మహిళలను,పిల్లలను ఇంటికి పంపించేయాలని రైతు నేతలను తాము కోరామని తోమర్ అన్నారు. జనవరి-4న తదుపరి రౌండ్ చర్చలు జరుగుతాయన్నారు.

కనీస మద్దతు ధర కొనసాగుతుందని ప్రభుత్వం చెప్తూనే ఉందని తెలిపారు. దీనిపై రాతపూర్వక హామీ ఇచ్చేందుకు తాము సిద్దంగా ఉన్నామన్నారు. అయితే MSPకి చట్ట బద్ధత కల్పించాలని రైతు సంఘాలు భావిస్తున్నాయని తెలిపారు. కావున MSP చట్టబద్ధత మరియు ఇతర సమస్యలపై జనవరి-4 మధ్యాహ్నాం 2గంటలకు మరోసారి రైతులతో చర్చలు జరుపేతామని తెలిపారు.