భారత్ “టీ”పై విదేశీ కుట్ర..మోడీ

భారత్ “టీ”పై విదేశీ కుట్ర..మోడీ

Modi in Assam త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న అసోంలో ఆదివారం ప్రధానమంత్రి నరేంద్రమోడీ పర్యటించారు. సోనిత్‌పుర్ జిల్లాలోని ధెకియాజులిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ‘అసోం మాల’ పేరుతో అభివృద్ధి చేసిన రాష్ట్ర హైవేలు, వంతెనలను జాతికి అంకితమిచ్చారు. విశ్వనాథ్​, చరైడియోలో రెండు మెడికల్ కాలేజీలకు మోడీ శంకుస్థాపన చేశారు. అనంతరం బహిరంగ సభలో ప్రధాని మాట్లాడుతూ..అసోం మాల రాష్ట్ర ఆర్థిక పురోగతికి దోహదపడుతుందని తెలిపారు.

మారుమూల ప్రాంతాల్లో ప్రతిభకు కొదవలేదన్న ప్రధాని.. ప్రతి రాష్ట్రంలో మాతృభాషలో బోధించే ఒక మెడికల్ కాలేజీ, ఒక టెక్నికల్ కళాశాల ఉండాలన్నది తన కల అని చెప్పారు. ఎక్కువ మంది వైద్యులు తమ మాతృభాషలో ప్రజల సమస్యలను అర్థం చేసుకోగలుగుతారన్నారు. మారుమూల ప్రాంతాల్లో ఇంకా వైద్య సేవలను విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. ఆరోగ్యం, మౌలిక సదుపాయాల విషయంలో అసోం గత ఐదేళ్లలో చెప్పుకోదగిన అభివృద్ధి సాధించిందని అన్నారు. 2016 వరకు రాష్ట్రంలో కేవలం ఆరు మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయన్న ఆయన వాటిలో సీట్ల సంఖ్యను 725 నుంచి 1,600కు పెంచినట్లు గుర్తు చేశారు.

భారతీయ సంస్కృతిలో భాగమైన ‘టీ’ని అప్రతిష్ఠపాలుజేసేందుకు విదేశాలలో కుట్ర జరిగిందని ఈ సందర్భంగా మోడీ ఆరోపించారు. ఇందుకు సంబంధించిన కొన్ని దస్త్రాలు బయటపడినట్లు తెలిపారు. ఈ దాడిని తిప్పికొట్టాల్సిన అవసరముందని ఉద్ఘాటించారు. టీ ఇండస్ట్రీపై ఈ దాడి అసోం ప్రజలు,టీ వర్కర్లు అంగీకరిస్తారా అని ప్రశ్నించారు? ఇలాంటి వాటికి యత్నించే వారిని.. వారికి మద్దతు తెలిపే వారిని(విపక్షాలు) ప్రజలు దూరం పెట్టాలని కోరారు.

అసోం మరియు వెస్ట్ బెంగాల్ లోని టీ వర్కర్ల కోసం ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ లో రూ.1000కోట్లు కేటాయించినట్లు మోడీ తెలిపారు. అస్సాం యొక్క శ్రేయస్సుకు టీ పరిశ్రమ ఒక ప్రధాన కారణమని ప్రధాని అన్నారు. సోనిత్‌పుర్ యొక్క రెడ్ టీ దాని ప్రత్యేకమైన రుచికి ప్రసిద్ది చెందిందని..తనకన్నా మంచిగా ఎవరు దాని నాణ్యతను తెలుసుకోగలరన్నారు. అందుకే టీ గార్డెన్ కార్మికుల సంక్షేమాన్ని అస్సాం మొత్తం పురోగతితో తాను ఎప్పుడూ ముడిపెట్టానని మోడీ అన్నారు.