శబరిమల ఆలయంలో మహిళల పూజలు

  • Published By: madhu ,Published On : January 2, 2019 / 04:45 AM IST
శబరిమల ఆలయంలో మహిళల పూజలు

కేరళ : శబరిమల ఆలయంలోకి మహిళలు ప్రవేశించారు. నల్లదుస్తులు ధరించిన ఇద్దరు మహిళలు అయ్యప్పను దర్శించుకుని తిరుగు ప్రయాణమయ్యారు. గత ఐదారు నెలలుగా కేరళలో టెన్షన్ టెన్షన్ వాతావరణం నెలకొంది. మహిళలు ఆలయ ప్రవేశం చేయవచ్చు..లింగ వివక్ష చూపొద్దంటూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై అనేక పిటిషన్‌లు దాఖలయ్యాయి. సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తామని పేర్కొన కేరళ ప్రభుత్వం అందుకనుగుణంగా చర్యలు కూడా తీసుకుంది. అయ్యప్పను దర్శించుకొనేందుకు మహిళలు రావడం..హిందూ సంఘాలు వారిని వ్యతిరేకిస్తుండడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 

తెల్లవారుజామున ప్రవేశం…
తాజాగా జనవరి 2వ తేదీన 50 ఏళ్లలోపు వయస్సున్న బిందు, కనకదుర్గలు అయ్యప్పను దర్శించుకున్నారు. బిందు కోజికోడ్, కనకదుర్గ మళప్పురం నుండి వచ్చారు. గతంలో డిసెంబర్ 24వ తేదీన అయ్యప్పను దర్శించుకోవడానికి వీరు ప్రయత్నించి విఫలం చెందారు. కానీ అయ్యప్పను ఎలాగైనా దర్శించుకోవాలని మరోసారి ప్రయత్నించి సక్సెస్ అయ్యారు. నల్లదుస్తులతో పంబకు చేరుకున్న వారిద్దరూ తెల్లవారుజామున 3.45 నిమిషాలకు ఆలయ గర్భాలయంలోకి ప్రవేశించి అయ్యప్పను దర్శించుకున్నారు.  వీరికి పోలీసులు భద్రతగా నిలిచారు.