డబ్బులడిగిన పాన్ షాప్ నిర్వాహకుడిని కారుతో గుద్ది చంపిన కానిస్టేబుల్

డబ్బులడిగిన పాన్ షాప్ నిర్వాహకుడిని కారుతో గుద్ది చంపిన కానిస్టేబుల్

Cop mows down pan shop owner ఉత్తరాఖండ్‌లో బాజ్‌పూర్‌లో ఓ పాన్ షాపు నిర్వాహకుడిని ఓ పోలీస్ కానిస్టేబుల్ దారుణంగా కారుతో గుద్ది చంపడం కలకలం సృష్టించింది. షాపులో కొనుగోలు చేసిన సిగరేట్ ప్యాకేట్ కు డబ్బులు అడగడంతో ఆగ్రహానికి గురైన ఆ పోలీస్ కానిస్టేబుల్ ఈ దారుణానికి ఒడిగట్టారు. కానిస్టేబుల్, అతని ఇద్దరు స్నేహితులు… కారుతో గుద్ది పాన్ షాపు యజమానిని చంపేశారు. బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింది.

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉధమ్ సింగ్ నగర్ జిల్లాలోని బాజ్‌పూర్‌లో గౌరవ్ అనే వ్యక్తి పాన్ షాపు రన్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం రాత్రి 11గంటల సమయంలో..సిగరెట్లు కొనుక్కునేందుకు స్థానిక పోలీస్ స్టేషన్ లో పనిచేసే కానిస్టేబుల్ ప్రవీణ్ కుమార్..తన బావమరిది,స్నేహితుడితో కలిసి గౌరవ్ షాప్ కి వెళ్లారు. ఓ సిగరెట్ ప్యాకెట్ తీసుకుని దానికి ఇచ్చేందుకు నిరాకరించాడు కానిస్టేబుల్. దీంతో పాన్ షాపు నిర్వాహకుడు గౌరవ్..పోలీస్ కానిస్టేబుల్ మధ్య వాగ్వాదం జరిగింది. వెంటనే పొరుగున్న షాపులవాళ్లు కూడా అక్కడికి చేరుకుని..ఆ గొడవలో జోక్యం చేసుకునే ప్రయత్నం చేశారు.

అయితే, తర్వాత ఆగ్రహంతో ఊగిపోయిన కానిస్టేబుల్, అతని ఇద్దరు స్నేహితులు తమ కారుతో పాన్ షాపు నిర్వాహకుడిని గుద్ది వెళ్లిపోయారు. తీవ్రగాయాలపాలైన పాన్ షాపు నిర్వాహకుడిని స్థానికులు దగ్గర్లోని హాస్పిటల్ కి తరలించారు. అయితే అతడు అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు ధృవీకరించారు.

ఘటనపై స్థానికులు తీవ్రంగా స్పందించి గురువారం బాజ్‌పూర్‌ పోలీస్ స్టేషన్ ఎదుట మృతదేహంతో ఆందోళన నిర్వహించారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిందుతులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న కుమాన్ ఐజీ అజయ్ రౌతేలాతో సహా ఇతర పోలీస్ ఉన్నతాధికారులు బాజ్‌పూర్‌ పోలీస్ స్టేషన్ కి చేరుకున్నారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసేందుకు ఆదేశాలు జారీ చేశారు.

కానిస్టేబుల్ ప్రవీణ్ కుమార్,మరో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి జైలుకి తరలించారు. కానిస్టేబుల్ ప్రవీణ్, అతని స్నేహితులు గౌరవ్ రాథోడ్, జీవన్ పై ఐపీసీ 302, 504 మరియు 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తుకి ఆదేశించినట్లు సీనియర్ సూపరిండెంటెండ్ ఆఫ్ పోలీస్ దలీప్ సింగ్ తెలిపారు. కాశీపూర్ పోలీస్ స్టేషన్ SHO సంజయ్ పఠాక్ నేతృత్వంలో విచారణకు ఆదేశించినట్లు దలీప్ సింగ్ తెలిపారు. ఘటన కారణంగా స్థానికంగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్య సమీప ప్రాంతాల నుంచి అదనపు పోలీసు సిబ్బందిని మోహరించారు.