భారత్‌లో రోజుకు లక్ష కరోనా కేసులు నమోదయ్యే పరిస్థితులు

భారత్‌లో రోజుకు లక్ష కరోనా కేసులు నమోదయ్యే పరిస్థితులు

భారత్‌లో 40 వేల పైనే కరోనా కేసులు. ఈ డిజిట్స్ చాలు.. దేశంలో కరోనా ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి. ఇదిలాగే కంటిన్యూ అయితే.. ఇండియా మరో అమెరికా అవుతుందా? అన్‌లాక్‌ 3.0 అదిరిపోయే షాకిస్తుందా? వ్యాక్సిన్ వచ్చే దాకా ఈ విలయం తప్పదా?

నెల క్రితం వరకు.. రోజుకు ఐదారు వేల కేసులు కూడా నమోదు కాలేదు. కానీ.. ఇప్పుడు రోజుకు దాదాపు 50 వేల కేసులు రికార్డయ్యే దశకు చేరుకున్నాం. మున్ముందు.. ఈ కౌంట్ రోజుకు లక్షకు కూడా చేరువయ్యే అవకాశం ఉందంటున్నారు. ఇదిలాగే కొనసాగితే.. ఇండియా కరోనా కేసుల్లో నెంబర్ వన్ పొజిషన్‌కు చేరుతుందన్న అంచనాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు దేశం గుండెల్లో గుబులు రేపుతోంది.

రోజురోజుకు వేగంగా వ్యాపిస్తున్న కరోనా.. ఇండియాను కమ్మేస్తోంది. భారత్‌లో వైరస్ దూకుడు చూస్తుంటే.. అతి త్వరలో సెకండ్ పొజిషన్‌లో ఉన్న బ్రెజిల్‌ని దాటేస్తామని అర్థమవుతోంది. తర్వాత.. అమెరికాను కూడా వెనక్కి నెట్టేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇదంతా జరగడానికి నెలలు కాదు.. వారాల సమయమే పట్టే అవకాశం కనిపిస్తుంది. కేవలం.. 4 వారాలు.. నాలుగంటే 4 వారాల్లోనే.. భారత్ కరోనా కేసుల్లో నెంబర్ వన్ పొజిషన్‌కు చేరే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.

ఇండియాలో ఇప్పటివరకు సుమారు 15 లక్షల కేసులు నమోదయ్యాయి. బ్రెజిల్‌లో.. 24 లక్షలు దాటాయి. అమెరికాలో 44 లక్షలకు పైనే కేసులు రికార్డయ్యాయి. వారం రోజుల్లో నమోదైన కేసుల లెక్కలు చూస్తే.. భారత్‌లో.. 3 లక్షల 10 వేలకు పైనే పాజిటివ్ కేసులు వచ్చాయి. బ్రెజిల్ రిపోర్ట్ చూస్తే.. 3 లక్షల 20 వేల కేసులు నమోదయ్యాయి. రెండు వారాల క్రితం వరకూ.. బ్రెజిల్‌లో రోజుకు 90 వేల కేసులు, యూఎస్‌లో 85 వేల కేసులు నమోదయ్యాయి. కానీ.. ఇప్పుడు ఇండియా కరోనా కేసుల్లో ర్యాపిడ్ స్పీడ్ కనిపిస్తోంది.

ఫస్ట్ ప్లేస్‌లో ఉన్న అమెరికా, సెకండ్ ప్లేస్‌లో ఉన్న బ్రెజిల్‌లో.. కేసులు తగ్గుతుంటే.. మన దగ్గర మాత్రం వైరస్ దూకుడు మామూలుగా లేదు. రెండు రోజులుగా.. బ్రెజిల్‌లో కేసులు 30 వేల మార్క్ దాటడం లేదు. కానీ.. మన దగ్గర.. దాదాపు 45 వేల దాకా వస్తున్నాయ్. అమెరికాలోనూ.. రోజుకు 55 నుంచి 60 వేల కేసులు నమోదవుతున్నాయి. ఈ లెక్కలన్నీ చూసుకుంటే.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న కొత్త కేసుల్లో.. ఇండియా రెండో స్థానానికి వెళ్లిపోయింది. అతి త్వరలో.. కొత్తగా రికార్డయ్యే కేసుల్లో.. భారత్ మొదటి స్థానానికి చేరుకుంటుందన్న అంచనాలున్నాయి.

కొత్త కేసుల్లోనే కాదు.. మొత్తం కేసుల్లోనే భారత్ రెండో స్థానానికి ఎగబాకే పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుత లెక్కల ప్రకారం.. బ్రెజిల్‌కు.. ఇండియాకు కేవలం.. 10 లక్షల కేసులే తేడా కనిపిస్తోంది. అక్కడ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గిపోతుండగా.. మన దగ్గర మాత్రం పీక్‌కి వెళ్లిపోయింది. ఇండియాలో.. ఎంత తక్కువగా చూసుకున్నా.. రోజుకు 30 వేలకు పైగా కేసులు వస్తున్నాయి. ఈ స్పీడ్ ఇలాగే కొనసాగితే.. రెండు వారాల్లోనే కరోనా పాజిటివ్ కేసుల్లో.. భారత్ ప్రపంచంలోనే మొదటి స్థానానికి వెళ్తుందేమోనన్న ఆందళన వ్యక్తమవుతోంది.

నెల క్రితం ఇండియాలో వారానికి 22.9 శాతం కేసులు, బ్రెజిల్‌లో 15.8శాతం, యూఎస్‌లో 11.5 శాతం కేసులు నమోదయ్యాయి. గత వారం భారత్‌లో.. 24 శాతం గ్రోత్ రేట్ పెరగగా.. బ్రెజిల్‌లో మాత్రం 14 శాతానికి తగ్గింది. ఇక అమెరికాలో ఐతే.. ఏకంగా 11 శాతానికి తగ్గింది. ప్రపంచంలోని మిగతా దేశాలతో పోలిస్తే.. ఇప్పుడు ఇండియాలోనే కరోనా డేంజర్ బెల్స్.. ఓ రేంజ్‌లో మోగుతున్నాయి. ఇప్పటి వరకు అత్యధిక కేసులున్న బ్రెజిల్‌, యూఎస్‌లో కేసులు తగ్గుముఖం పడుతుంటే.. భారత్‌లో మాత్రం 19 రోజుల్లోనే కరోనా కేసులు డబుల్ అయ్యాయి. బ్రెజిల్‌లో 32 రోజులకు, అమెరికాలో 42 రోజలకు కోవిడ్ కేసులు రెట్టింపు అయ్యాయి.

భారత్‌లో టెస్టుల సంఖ్య పెరుగుతున్నట్లే.. పాజిటివ్ కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. కొత్తగా నమోదవుతున్న కేసులు.. ఆందోళనకరంగా మారాయి. గత నెలతో పోలిస్తే.. రోజుకు 2 లక్షల నుంచి 5 లక్షలకు పైగానే టెస్టులు చేస్తున్నారు. టెస్టులు, కేసులతో పాటు.. కోవిడ్ బారిన పడి కోలుకున్న వారి సంఖ్య కూడా బాగానే ఉంది. ఇప్పటివరకు తొమ్మిదిన్నర లక్షల మందికి పైగా.. కరోనాకు చికిత్స తీసుకొని.. పూర్తిగా కోలుకొని ఇళ్లకు చేరుకున్నారు. ఇప్పటివరకు వైరస్ బారిన పడి.. దేశంలో 33 వేల మందికి పైగా మృతి చెందారు.