భారత్‌లో కరోనా ఉగ్రరూపం, భారీగా పెరిగిన కొత్త కేసులు, 20వేలకు చేరువలో బాధితులు

దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. మళ్లీ కరోనా తీవ్రత పెరుగుతోంది. కొత్త కేసులు భారీగా పెరిగాయి.

భారత్‌లో కరోనా ఉగ్రరూపం, భారీగా పెరిగిన కొత్త కేసులు, 20వేలకు చేరువలో బాధితులు

corona cases rise in india again: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. మళ్లీ కరోనా తీవ్రత పెరుగుతోంది. కొత్త కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీంతో అందరిలోనూ ఆందోళన మొదలైంది. గతేడాది(2020) సెప్టెంబర్ నుంచి తగ్గుముఖం పట్టిన ఈ మహమ్మారి.. మళ్లీ కొన్ని వారాలుగా విజృంభిస్తోంది. 20వేలకు చేరువగా పాటిజివ్ కేసులు నమోదవుతుండటం కలవరపెడుతోంది.

Corona virus positive for seven people in the same family

24 గంటల్లో 18వేల 327 కొత్త కేసులు:
గడిచిన 24 గంటల్లో 18వేల 327 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం(మార్చి 6,2021) తెలిపింది. వరుసగా రెండో రోజూ కరోనా మరణాల సంఖ్య వంద దాటింది. తాజాగా 108 మంది కరోనాకు బలయ్యారు. దీంతో ఇప్పటివరకు మొత్తంగా 1.11 కోట్ల మందికి పైగా వైరస్ బారిన పడగా.. లక్షా 57వేల 656 కొవిడ్ మరణాలు సంభవించాయి. గడిచిన 24 గంటల్లో 7లక్షల 51వేల 935 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

కరోనా సోకుతున్నవారి సంఖ్య పెరుగుతుండటంతో యాక్టివ్ కేసులు ఎగబాగుతున్నాయి. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు లక్షా 80వేలకు పైబడ్డాయి. ఆ రేటు 1.61 శాతానికి పెరిగింది. ఈ మధ్యకాలంలో 97 శాతాన్ని దాటిన రికవరీ రేటు.. ఇప్పుడు 96.98 శాతానికి పడిపోయింది. నిన్న(మార్చి 5,2021) 14వేల 234 మంది కొవిడ్‌ నుంచి కోలుకోగా..మొత్తంగా వైరస్‌ను జయించినవారి సంఖ్య 1,08,54,128కి చేరింది.

2కోట్లకు చేరువలో:
మరోవైపు, దేశంలో కరోనా వ్యాక్సినేషన్ సాగుతోంది. దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ తీసుకున్న వారి సంఖ్య రెండు కోట్లకు చేరువవుతోంది. రెండు దశల్లో భాగంగా మార్చి ఐదు నాటికి.. 1,94,97,704 మందికి కేంద్రం టీకాలు అందించింది. నిన్న అత్యధికంగా 14లక్షల 92వేల 201 మంది టీకాలు వేయించుకున్నారు.

tests-coronavirus-positive

తెలంగాణలో కొత్తగా 170 కరోనా కేసులు:
తెలంగాణలో కొత్తగా 170 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,99,742కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ శనివారం(మార్చి 6,2021) ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో కరోనాతో ఒకరు మరణించారు. దీంతో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 1640కి చేరింది. నిన్న(మార్చి 5,2021) రాత్రి 8గంటల వరకు 40వేల 712 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.

నిన్న 196 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 2,96,166కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 1,936 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. వారిలో 812 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో తాజాగా 28 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. మరోవైపు తెలంగాణలో ఇప్పటివరకు 89,24,007 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

కరోనా విజృంభణకు నిర్లక్ష్యమే కారణం:
వ్యాక్సిన్ వచ్చేసిందనే అతి విశ్వాసమో, కేసులు తగ్గుముఖం పట్టాయనే ధీమానో.. కారణం ఏంటో కానీ, ప్రజల్లో మళ్లీ నిర్లక్ష్యం పెరిగింది. దీనికి తోడు ప్రభుత్వం దాదాపుగా అన్ని కార్యకలాపాలకు అనుమతులు ఇచ్చేయడం తాజాగా కరోనా విజృంభణకు కారణమని నిపుణులు చెబుతున్నారు. వ్యాక్సిన్ వచ్చినా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ఇంటి నుంచి బయటకు వస్తే మాస్కులు తప్పనిసరి అని, భౌతికదూరం పాటించాలని ప్రభుత్వం నెత్తీనోరు బాదుకుని చెబుతోంది. అయినా, జనాలు ఖాతరు చేయడం లేదు. నిబంధనలకు పాతరేశారు. నిర్లక్ష్యంగా, విచ్చలవిడిగా తిరుగుతున్నారు. కరోనాతో గేమ్స్ ఆడుతున్నారు.